ETV Bharat / opinion

అమెరికా పర్యావరణ అజెండా!

author img

By

Published : Apr 26, 2021, 7:12 AM IST

ప్యారిస్​ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా పర్యావరణానికి తీవ్ర అనర్థం వాటిల్లింది. అయితే.. నూతన అధ్యక్షుడు మాత్రం ప్యారిస్​ ఒడంబడికకు కట్టుబడి ఉంటామని చెప్పడం హర్షనీయం. 2035 నాటికి అమెరికా విద్యుత్‌ రంగాన్ని నూరుశాతం కర్బన కాలుష్యరహితంగా తీర్చిదిద్దగలమంటూ బైడెన్‌ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

biden
బైడెన్, అమెరికా అధ్యక్షుడు

మేర మీరిన మూర్ఖత్వంతో వాతావరణ మార్పు అన్నదే అర్థం లేనిదంటూ ప్యారిస్‌ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా పర్యావరణానికి వాటిల్లిన అనర్థం అంతాఇంతా కాదు. శ్వేతసౌధం చేతులు మారిన దరిమిలా చరిత్రాత్మక ప్యారిస్‌ ఒడంబడికకు కట్టుబాటు చాటిన జో బైడెన్‌, కాలుష్య ఉద్గారాల నియంత్రణకు చూపుతున్న నిబద్ధత కారుచీకట్లో కాంతిరేఖ అని చెప్పక తప్పదు. వాతావరణ మార్పులపై శాస్త్రీయ హెచ్చరికల్ని చెవిన పెట్టాల్సిందేనంటూ అధ్యక్షపీఠం అధిష్ఠించిన తొలివారంలోనే జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానాల్లో దానికి చోటు పెట్టిన బైడెన్‌ సర్కారు- ధరిత్రీ దినోత్సవం సందర్భంగా 40 దేశాల అధినేతలతో ఆన్‌లైన్‌ సదస్సు ద్వారా విశేష చొరవ కనబరచిందిప్పుడు! ప్రపంచ భవిష్యత్తును నిగ్గు తేల్చే దశాబ్ది ఇదేనంటూ- 2005 నాటి అమెరికా కాలుష్య ఉద్గారాల స్థాయిని 2030 నాటికి 50-52శాతం తగ్గించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

2015లో ఒబామా ప్రభుత్వం అంగీకరించిన లక్ష్యానికిది రెట్టింపు అంటున్న అధికారులు- 2035 నాటికి అమెరికా విద్యుత్‌ రంగాన్ని నూరుశాతం కర్బన కాలుష్యరహితంగా బైడెన్‌ తీర్చిదిద్దగలరంటున్నారు. 2050 నాటికే అమెరికా ఆర్థికాన్ని కర్బన ఉద్గార తటస్థత (నెట్‌ జీరో) దిశగా మళ్లిస్తామన్న వాగ్దానంతో పాటు, మరో మూడేళ్ళలో పేద దేశాలకు అందించే ఆర్థిక తోడ్పాటును రెట్టింపు చేయడానికీ అమెరికా సంకల్పించింది. పర్యావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్న కర్బన ఉద్గారాల్లో చైనా 28శాతం, అమెరికా 15, ఈయూ తొమ్మిది, ఇండియా ఏడుశాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికాతో పాటే కెనడా, జపాన్‌, దక్షిణ కొరియాలూ స్వయం నియంత్రణ లక్ష్యాల్ని మెరుగుపరచడం గమనార్హ విశేషం. చైనా కొత్త వాగ్దానాలేవీ చేయకపోయినా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్ని కచ్చితంగా నియంత్రిస్తామని చెబుతోంది. అగ్రరాజ్యంతో ఇంధన, వాతావరణ భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇండియా- నిర్దేశిత లక్ష్యాల దిశగా చేయాల్సింది మరెంతో ఉంది.

భారత్​లోనే రూ. 3.75 కోట్ల నష్టం..

మానవ పరిణామ క్రమాన్ని పొత్తిళ్లలో పాపలా సాకిన ప్రకృతి- భూతాప ప్రజ్వలనంతో పెను విపత్తులతో దాడి చేసే వికృతిలా మారడానికి మనిషి దుశ్చేష్టలే పుణ్యం కట్టుకొన్నాయి. ప్రగతి పేరిట పర్యావరణాన్ని బలిపెట్టే పెడధోరణులు ప్రబలి, గ్రీన్‌హౌస్‌ వాయు నిల్వలు గాలిలో పేరుకుపోయి, భూఉష్ణోగ్రతలు కట్టుతప్పి ప్రకృతి ఉత్పాతాలు ఏటికేడు పెచ్చరిల్లుతున్నాయి. పర్యావరణ వినాశం, వాయు కాలుష్యం కారణంగా ఒక్క ఇండియాలోనే ఏటా 3.75 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని అంచనా వేసిన ప్రపంచబ్యాంకు- ప్రాణ నష్టాన్ని మదింపు వెయ్యలేకపోయింది.

పారిశ్రామిక విప్లవానికంటే ముందున్న స్థాయికన్నా భూతాపం రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే మించకుండా చూడాలని ప్యారిస్‌ ఒప్పందం నిర్దేశించింది. ప్యారిస్‌ ఒప్పందం తరవాత ప్రమాదకర ఉద్గారాలు నాలుగు శాతం పెరిగాయని, పర్యావరణం మరింత విషమించకుండా ఉండాలంటే, ఏటా ఏడుశాతం వంతున- వచ్చే దశాబ్దకాలంపాటు వాటిని కట్టడి చేయాలని శాస్త్రవేత్తలు మొత్తుకొంటున్నారు! ఈ నేపథ్యంలో ప్యారిస్‌ ఒడంబడికను పూర్తిస్థాయిలో అమలు చేసే విధి విధానాల కోసం 16 నెలల క్రితం మాడ్రిడ్‌లో జరిపిన 'కాప్‌ 25' సదస్సు ఏమీ తేల్చకుండానే ముగిసిపోయింది. విద్యుత్‌, వాహన రంగాల్లో కర్బన ఉద్గారాలకు పూర్తిగా చెల్లుకొట్టేలా తాజా వ్యూహాల్ని ప్రకటించిన అమెరికా- పర్యావరణ హితకర ప్రణాళిక ఉపాధి వృద్ధికి ఎంతో ఊతమివ్వగలదంటోంది. అమెరికాతో ఇంధన, వాతావరణ భాగస్వామిగా ఇండియాకూ అత్యాధునిక హరిత సాంకేతికత, పెట్టుబడులు అందుబాటులోకి వస్తే- తనవంతు బాధ్యత నిర్వహణకు భారత్‌ సదా సిద్ధంగానే ఉంది. ఇప్పటికైనా పారిశ్రామిక దేశాలు- జ్వరపడిన భూమాత త్వరగా కోలుకోవడానికి తమవంతు కర్తవ్య నిర్వహణకు సిద్ధపడకపోతే, మానవాళి భవిష్యత్తు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమవుతుంది!

ఇదీ చదవండి:బద్రినాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు దుప్పటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.