ETV Bharat / opinion

రహదారులపై మృత్యు ఘంటికలు- దేశార్థికానికి తూట్లు

author img

By

Published : Sep 21, 2021, 7:00 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఇండియాలో ఒక శాతమే తిరుగుతున్నా.. రోడ్డు ప్రమాదాల్లో మాత్రం విశ్వవ్యాప్తంగా 11శాతం మరణాలు భారత్‌లోనే జరుగుతున్నట్లు గతంలో ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్​ వల్ల చాలా రోజులు వాహనాలు రోడ్లపైకి రాకపోయినా గతేడాది అంత పెద్దమొత్తంలో మరణాలు సంభవించడం ఆందోళనకరమే! నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.

road accidents
రోడ్డు ప్రమాదాలు

దేశంలోని రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. వందల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యపూరిత రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 1.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీటిలో సగటున రోజుకు 328 మంది అసువులు బాశారు. రోడ్లపై వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా గడచిన మూడేళ్లలో దాదాపు 3.29 లక్షల మంది మరణించారు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొన్న (హిట్‌ అండ్‌ రన్‌) కేసులు భారత్‌లో 2018 నుంచి 1.35 లక్షలు నమోదయ్యాయి. గతేడాదే ఇవి 41వేలకు మించిపోయాయి. 2019లో భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో 1.36 లక్షల మంది మృత్యువాతపడ్డారు. రెండేళ్ల కిందటితో పోలిస్తే నిరుడు ప్రమాదాలు దాదాపు 13శాతం తగ్గాయి. కరోనా లాక్‌డౌన్ల వల్ల చాలా రోజులు వాహనాలు రోడ్లపైకి రాకపోయినా గతేడాది అంత పెద్దమొత్తంలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమే! నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడిపి ఇతరులను గాయపరచిన ఘటనలు పోయిన సంవత్సరం 1.30 లక్షలు నమోదయ్యాయి. సగటున రోజూ 112 హిట్‌ అండ్‌ రన్‌ కేసులు వెలుగుచూశాయి.

అతివేగం ప్రధాన శత్రువు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఇండియాలో ఒక శాతమే తిరుగుతున్నా, రోడ్డు ప్రమాదాల్లో మాత్రం విశ్వవ్యాప్తంగా 11శాతం మరణాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నట్లు గతంలో ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. రహదారులే ఆయువులను మింగేస్తున్న ఘటనల పరంగా భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. సగటున ప్రతి గంటకు దేశంలో 53 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. వీటిలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. గత దశాబ్దంలో భారత్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల 13 లక్షల మంది అసువులు బాయగా, మరో 50 లక్షల మంది గాయపడ్డారు. దీని వల్ల దేశార్థికానికి దాదాపు రూ.5.96 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. జీడీపీలో ఇది 3.14శాతానికి సమానం. కేంద్రం లెక్కల ప్రకారం రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్నవారు 75 శాతానికి పైగా 18-45 ఏళ్ల లోపు వారే. ఫలితంగా దేశం ఏటా విలువైన శ్రామిక శక్తిని కోల్పోతోంది.

సంపాదనపరులైన ఇంటి యజమానులు అకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. గాయపడిన వారి కుటుంబాలు వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు పాదచారులకు సైతం శాపంగా పరిణమిస్తున్నాయి. మృతుల్లో సుమారు 78శాతం ద్విచక్ర వాహనదారులు, పాదచారులే! అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, అడ్డదారుల్లో చొరబడటంవల్లే చోటుచేసుకొంటున్నాయి. 70శాతం మరణాలకు అతి వేగమే కారణం. దేశంలో కొవిడ్‌ కల్లోలం కన్నా రహదారి ప్రమాదాలు మరింత నష్టదాయకంగా మారాయని ఇటీవల కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి వైద్యానికి సగటున రూ.3.64 లక్షలు, కొద్దిపాటి గాయాలపాలైనవారికి రూ.77వేల వరకు ఖర్చవుతోంది. ఎన్‌సీఆర్‌బీ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 6,288 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య 6,415. ఏపీలో 491 హిట్‌ అండ్‌ రన్‌ కేసులు నమోదవగా, తెలంగాణలో వాటి సంఖ్య 1332. ఏపీతో పోలిస్తే ఇవి రెండున్నర రెట్లు అధికం.

తమిళనాడు ఆదర్శం

రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో తమిళనాడు ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రమాద ప్రాంతాలను వేగంగా గుర్తించడం, గరిష్ఠంగా 13 నిమిషాల్లోగా సంఘటనా స్థలానికి ఆంబులెన్సు చేరుకునేలా చూడటం, రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం తదితర చర్యల ద్వారా తమిళనాడు మేలిమి ఫలితాలను సాధిస్తోంది. 2016లో నవంబరు నాటికి ఆ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 15,855 మంది మరణించగా, 2020కి ఆ సంఖ్య ఎనిమిది వేలకు దిగివచ్చింది. 2015 నుంచి ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన 4.15 లక్షల మంది డ్రైవింగ్‌ లైసెన్సులను అక్కడ రద్దుచేశారు.

అన్ని రాష్ట్రాలూ ఈ విధానాలను అనుసరించాలి. రాబోయే మూడేళ్లలో దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను 50శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. 50శాతం ప్రమాదాలు రహదారి ఇంజినీరింగ్‌ లోపాల వల్లే చోటుచేసుకొంటున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రమాదాలను నివారించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తాజాగా ‘ఐరస్తే’ పేరిట కృత్రిమ మేధ ప్రాజెక్టును నితిన్‌ గడ్కరీ ఇటీవల ప్రారంభించారు. ఐఐటీలు, కార్పొరేట్‌ సంస్థలు సైతం రహదారి భద్రతపై అధ్యయనాలు సాగించాలి. ప్రభుత్వాల పటిష్ఠ చర్యలతో పాటు, జనావళిలో అవగాహన, సంయమనం పెరిగితేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యమవుతుంది.

రచయిత- శాంతి జలసూత్రం

ఇదీ చూడండి: స్కూళ్లు తెరవాలని మైనర్ పిటిషన్- షాకిచ్చిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.