ETV Bharat / lifestyle

కదలకుండానే.. ఈ చిట్కాలతో బరువు తగ్గేయొచ్చు!

author img

By

Published : Mar 20, 2021, 6:11 PM IST

ఈ రోజుల్లో చాలామంది కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులన్నీ చకచకా ముగించుకోవాలనుకుంటున్నారు. ఇందుకు తగినట్లుగానే వివిధ రకాల గ్యాడ్జెట్లు సైతం పుట్టుకు రావడంతో చాలామందిలో ఒక రకమైన బద్ధకం ఆవహిస్తుంటుంది. ఇదే వారు క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది. అందుకే వ్యాయామాన్ని రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోమంటున్నారు.

tips to lose weight without doing exercise
కదలకుండానే.. ఈ చిట్కాలతో బరువు తగ్గేయొచ్చు!

కరోనా వల్ల గత ఏడాది కాలంగా చాలామంది ఇంటి నుంచే పనిచేయాల్సి రావడంతో ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందే గడపాల్సి వస్తోంది. అధిక బరువుకు ఇదీ ఓ కారణంగా మారుతోందని పలు పరిశోధనల్లో సైతం వెల్లడైంది. మరి, ఇదిలాగే కొనసాగితే క్రమంగా బరువు పెరిగే వారంతా కొన్నాళ్లకు స్థూలకాయులుగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వ్యాయామాన్ని రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోమంటున్నారు. అయితే అందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదని, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆఫీస్ పని చేసుకుంటూ, ఉన్న చోటు నుంచి కదలకుండానే సులభంగా బరువు తగ్గేయచ్చని సలహా ఇస్తున్నారు.

sittinglooseweight650-1.jpg
సరైన మోతాదులో నీళ్లు తాగాలి


సిప్‌ చేస్తుండాలి!

అధిక బరువును తగ్గించే శక్తి నీళ్లకు ఉంది. అందుకే బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగడం ఇటు ఆరోగ్యానికి, అటు ఫిట్‌నెస్‌కూ మంచిదని చెబుతుంటారు నిపుణులు. అలాగని గ్లాసులకు గ్లాసులు ఒకేసారి గటగటా తాగేయడం కాకుండా కూర్చొని నెమ్మదిగా సిప్‌ చేయాలంటున్నారు. ఇలా రోజంతా ఇదే పద్ధతిని పాటించడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా ఎంచక్కా బరువు తగ్గేయచ్చట..! మొన్నామధ్య బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా కూడా తానూ తన ఫిట్‌నెస్‌ కోసం ఇదే చిట్కా పాటిస్తున్నానంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే!

sittinglooseweight650-2.jpg
కాస్త కదిలిస్తే పోయేదేముంది!


కాస్త కదిలిస్తే పోయేదేముంది!

రోజంతా కూర్చున్న చోటు నుంచి లేవకుండా పనితోనే గడిచిపోతుంది. అలాంటప్పుడు వ్యాయామం చేసే సమయమెక్కడిది? ఫిట్‌నెస్‌ విషయంలో ఇది చాలామందిని వేధించే ప్రశ్నే! కానీ అలా కూర్చున్న చోటు నుంచి లేవకుండా శరీరంలో చేరిన అదనపు క్యాలరీలను కరిగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే పనిచేసే క్రమంలో మధ్యలో ఓ ఐదు-పది నిమిషాల పాటు విరామం తప్పకుండా దొరుకుతుంది. అలాంటప్పుడు బద్ధకంగా ఓ కునుకు తీయడమో, మొబైల్‌ చూడడమో కాకుండా.. చేతులు, కాళ్లతో చిన్న పాటి వ్యాయామాలు చేయండి.. దీనివల్ల ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే శరీరానికి చక్కటి వ్యాయామమూ అందుతుంది. బరువు తగ్గించుకోవడానికి ఇదీ ఓ మార్గమే!

sittinglooseweight650-3.jpg
మనస్ఫూర్తిగా నవ్వేద్దాం!


మనస్ఫూర్తిగా నవ్వేద్దాం!

కూర్చున్న చోటే హ్యాపీగా నవ్వుతూ బరువు తగ్గేయచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మన శరీరంలో బేసల్‌ మెటబాలిక్‌ రేటు (విశ్రాంతిలో ఉన్నప్పుడు జీవక్రియల పనితీరుకు అవసరమైన క్యాలరీల సంఖ్య) సుమారు 10-20 శాతం పెరుగుతుందని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీలో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంటే ఒక పదిహేను నిమిషాల పాటు నవ్వితే దాదాపు 40-170 క్యాలరీల దాకా కరుగుతాయట! అంతేకాదు.. ఇలా మనం నవ్వే నవ్వు మనలోని ఒత్తిడి, ఆందోళనల్ని కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే!

sittinglooseweight650-4.jpg
బైక్‌ రైడింగ్‌తో..!


బైక్‌ రైడింగ్‌తో..!

కూర్చున్న చోటే బరువు తగ్గమన్నారు.. అంతలోనే ఈ బైక్‌ రైడింగ్‌ ఏంటి అనుకుంటున్నారా? హాయిగా కూర్చొని, అదీ ఆఫీస్ పనిచేసుకుంటూ బరువు తగ్గేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓ గ్యాడ్జెట్‌ ఇది! దీన్నే ‘డెస్క్‌ బైక్‌’గా పిలుస్తారు. మనం కూర్చోవడానికి కుర్చీ/సీటు, దానికి కింది వైపు సైకిల్‌ తొక్కేలా, ముందువైపు ల్యాప్‌టాప్‌ పెట్టుకునేలా ఉపరితలం.. ఇలా ఇవన్నీ ఒకే పరికరానికి అమరి ఉంటాయి. అయితే దీన్ని ఎంచుకునే క్రమంలో వెనక ఒరగడానికి వీలుగా ఉండేది కాకుండా స్టూల్‌ తరహాలో ఉండేది లేదంటే సీటుకు బదులుగా స్టెబిలిటీ బాల్‌ ఉండే డెస్క్‌ బైక్‌ని ఎంచుకుంటే మరింత ఫిట్‌గా మారిపోవచ్చు. ఇలా దీనిపై కూర్చొని ఓవైపు వ్యాయామం చేస్తూనే, మరోవైపు ఆఫీస్‌ పనీ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది అనుకునే వారు ఇదే తరహాలో ఉండే ఎక్సర్‌సైజ్‌ మినీ బైక్‌ని కూడా ఎంచుకోవచ్చు.

sittinglooseweight650-5.jpg
స్టెబిలిటీ బాల్‌పై..


స్టెబిలిటీ బాల్‌పై..

అలాగే ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నప్పుడు వీలైతే మధ్య మధ్యలో కొద్దిసేపు - స్టెబిలిటీ బాల్ పైన కూడా కూర్చోవచ్చు. దీనిపై నిటారుగా కూర్చోవడం వల్ల కాళ్లు, వెన్నెముక, పొట్ట.. వంటి భాగాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. అంతేకాదు.. బరువూ తగ్గచ్చు.

sittinglooseweight650-6.jpg
చల్లగా ఉంటే మంచిదేనట!


చల్లగా ఉంటే మంచిదేనట!

వేసవి వచ్చిందంటే ఏసీలు, కూలర్లు పెట్టుకోకపోతే ఉండలేం. ఇక మనం పనిచేసే క్యాబిన్‌/హోమ్‌ ఆఫీస్‌లో ఓ ఏసీ/కూలర్‌ ఉండాల్సిందే! అయితే ఇలాంటి చల్లటి వాతావరణంలో కూర్చొని పనిచేయడం వల్ల కూడా బరువు తగ్గచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అదెలాగంటే.. ఇలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు మన శరీరంలో ఉండే బ్రౌన్‌ ఫ్యాట్‌ (బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ) యాక్టివేట్‌ అయి.. జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తుంది.. అంతేకాదు.. నడుము చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని సైతం కరిగించడంలో ఇది సహాయపడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా బరువు తగ్గచ్చంటున్నారు. ఇక వేడిగా ఉన్న ప్రదేశంలో పనిచేసే వారి కంటే చల్లటి ప్రదేశంలో పనిచేసే వారిలో బ్రౌన్‌ ఫ్యాట్‌ ఎక్కువగా యాక్టివేట్‌ అవుతున్నట్లు, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతున్నట్లు ఓ అధ్యయనంలో కూడా తేలింది. అలాగని ఏసీలోని ఉష్ణోగ్రతను మరీ తగ్గించకుండా సాధారణ ఉష్ణోగ్రత వద్ద సెట్‌ చేసుకోవడం, విండో కూలర్స్‌ ఉపయోగించడం మంచిది.

ఇక వీటితో పాటు కూర్చొనే మన మనసుకు నచ్చిన పని చేయడం, చక్కటి పోషకాహారం తీసుకోవడం.. వంటి వాటి వల్ల కూడా సులభంగా బరువు తగ్గేయచ్చంటున్నారు నిపుణులు. అయితే మరి ఆలస్యమెందుకు.. మనం కూడా ఈ సింపుల్‌ చిట్కాల్ని పాటించేద్దామా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.