ETV Bharat / jagte-raho

దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్‌

author img

By

Published : Oct 28, 2020, 8:46 PM IST

రాష్ట్ర రాజధానిలో దంత వైద్యుడి అపహరణ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. బాధితుడిని బెంగళూరుకు తరలిస్తుండగా ఏపీలోని అనంతపురం జిల్లాలో పట్టుకొని... సైబరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్‌ సూత్రధారి ముస్తఫా... వైద్యుడు హుస్సేన్‌కు దగ్గరి బంధువేనని సీపీ సజ్జనార్‌ తెలిపారు. విలాస జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం అపహరించాడని వెల్లడించారు.

Seven arrested in dentist abduction case in Hyderabad
దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్‌

దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పరిధిలో దంత వైద్యుడి అపహరణ కేసు సుఖాంతమైంది. మంగళవారం మధ్నాహ్నం బండ్లగూడ జాగీర్‌ ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైన వైద్యుడు హుస్సేన్‌ను 12 గంటల్లోనే పోలీసులు కాపాడారు. వందమందికి పైగా పోలీసు సిబ్బందితో... పొరుగు రాష్ట్రాల సహకారంతో సైబరాబాద్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వైద్యుడి అపహరణలో మొత్తం 13 మంది పాల్గొనగా... పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల వద్ద మూడు కార్లు, ఏడు చరవాణులు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసుకున్నామని... సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు.

రెండు బృందాలు

కిడ్నాప్‌ సూత్రధారి ముస్తఫా... వైద్యుడు హుస్సేన్‌కు దగ్గరి బంధువేనని కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. నిందితుడికి ఆర్థిక ఇబ్బందులతోపాటు విలాస జీవితానికి అలవాటు పడడం వల్ల... డబ్బు కోసం కిడ్నాప్‌ చేశాడన్నారు. కిడ్నాప్‌ కోసం ముస్తఫా రెండు బృందాలు ఏర్పాటు చేసుకుని... వైద్యుడి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి 10 కోట్లు డిమాండ్ చేశాడని సీపీ వివరించారు.

కిరాతకంగా వ్యవహరించిన నిందితులు

దుండగులు అత్యంత పాశవికంగా తనను చిత్రవధకు గురిచేశారని బాధిత దంత వైద్యుడు హుస్సేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సకాలంలో రాకపోయి ఉంటే... ప్రాణాలతో ఉండేవాడిని కాదన్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న సమయంలో వైద్యుడి పట్ల నిందితులు అతి కిరాతకంగా వ్యవహరించారని ఏపీలోని అనంతపురం పోలీసులు తెలిపారు. వాహనంలో తీసుకెళ్తూ రాక్షసంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనలతో అప్రమత్తమై... నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు.

ఇతరులతో పంచుకోవద్దు

ఏపీ, కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సైబరాబాద్‌ పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను... ఇతరులతో పంచుకోవద్దని సీపీ సజ్జనార్‌ ప్రజలకు సూచించారు. సన్నిహితంగా మెలిగేందుకు వచ్చే అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

ఇదీ చూడండి : మృత్యబావి కేసులో దోషికి ఉరి శిక్ష ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.