ETV Bharat / international

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్​తో పాక్​లో హింస​.. రంగంలోకి సైన్యం

author img

By

Published : May 10, 2023, 3:36 PM IST

Updated : May 10, 2023, 5:50 PM IST

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో పాకిస్థాన్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దేశంలోని అనేక నగరాల్లో హింస చెలరేగింది. సెక్షన్‌144ను ఏమాత్రం పట్టించుకోని ఇమ్రాన్​ ఖాన్ అభిమానులు, పీటీఐ కార్యకర్తలు.. పాక్‌ సైనిక సంస్థలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందినట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు దిగజారిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు అక్కడ ఉన్న తమ పౌరులను హెచ్చరించాయి. మరోవైపు.. ఇమ్రాన్​ ఖాన్​ను పోలీసులు స్పెషల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో స్పెషల్ కోర్టు.. ఇమ్రాన్​ను అవినీతి నిరోదక శాఖకు 8 రోజుల రిమాండ్​కు ఇచ్చింది.

imran khan arrest
imran khan arrest

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌కు నిరసనగా పీటీఐ పార్టీ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వగా ఆ దేశంలో హింస చెలరేగింది. అధిష్ఠానం పిలుపుతో పీటీఐ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. సైనిక సంస్థలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. పంజాబ్‌, బలూచిస్థాన్, ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రాల్లో 144వ సెక్షన్‌ను పీటీఐ కార్యకర్తలు ఏమాత్రం లెక్కచేయలేదు. లాహోర్‌, పెషావర్‌, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో.. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. భద్రతా దళాలలతో జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయారని, అనేక మంది గాయపడ్డారని పీటీఐ పార్టీ నాయకులు చెప్పారు. ముగ్గురు చనిపోయారని, అనేక ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయని జియో న్యూస్‌ పేర్కొంది.

imran khan arrest
ఇమ్రాన్ ఖాన్​ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు

కోర్టు ఎదుట ఇమ్రాన్​ ఖాన్​..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ను పటిష్ఠ భద్రత మధ్య పోలీసులు ప్రత్యేక కోర్టు ముందు బుధవారం హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో పాక్​ అవినీతి నిరోదక శాఖ.. ఇమ్రాన్ ఖాన్​ను 14 రోజుల రిమాండ్​కు కోరింది. అయితే స్పెషల్ కోర్టు ఇమ్రాన్​ను పాక్ అవినీతి నిరోదక శాఖకు 8 రోజులు రిమాండ్​కు ఇచ్చింది. మరోవైపు.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్​ను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పీటీఐ పార్టీ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి పాక్​ సైన్యం బరిలోకి దిగిందని పాక్ మీడియా పేర్కొంది. పాకిస్థాన్​లోని పంజాబ్​లో సైన్యం మోహరించినట్లు తెలిపింది.

imran khan arrest
పహారా కాస్తున్న పాక్ భద్రతా బలగాలు

మరోవైపు.. పాకిస్థాన్​లో హింస నేపథ్యంలో పంజాబ్‌ ఉన్నత విద్యాశాఖ అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను కూడా మూసివేశారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు పాక్‌లో అప్రమత్తంగా ఉండాలంటూ తమ పౌరులను హెచ్చరించాయి. అమెరికా, బ్రిటన్‌, కెనడా ఈ మేరకు పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులకు హెచ్చరికలు జారీచేశాయి. ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితిని గమనిస్తున్నట్లు పాకిస్థాన్‌లోని అమెరికా ఎంబసీ తెలిపింది. అమెరికా పౌరులు.. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఎక్కడికి వెళ్లినా వెంట గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలని, స్థానిక యంత్రాంగం సూచనలు పాటించాలని చెప్పింది. యూకే కూడా ఇదే తరహా సూచన చేసింది. రాజకీయ ప్రదర్శనలు, రద్దీ ప్రదేశాలు, బహిరంగ సభలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇమ్రాన్​ ఖాన్ అరెస్ట్ విషయంలో ప్రజాస్వామ్య విధానాలను గౌరవించాలని.. పాకిస్థాన్‌కు అమెరికా సూచించింది. సంక్లిష్టమైన, ఉద్వేగపూరితమైన.. ఈ సమయంలో ప్రశాంతత ముఖ్యమని ఐరోపా సమాఖ్య వ్యాఖ్యానించింది.

imran khan arrest
నిరసనకారుల దాడిలో దగ్ధమైన వాహనం

షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వం కావాలనే తమ నాయకుడిపై కుట్ర పన్ని అరెస్ట్ చేయించిందని పీటీఐ నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగానే వీధుల్లోకి వచ్చి ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ భద్రతను ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. లండన్‌లో PML-N సుప్రీం నాయకుడు నవాజ్ షరీఫ్‌ నివాసం ఎదురుగా పీటీఐ కా‌ర్యకర్తలు ఆందోళన చేశారు. నవాజ్‌ షరీఫ్‌కు వ‌్యతిరేకంగా నినాదాలు చేశారు.

imran khan arrest
ఇమ్రాన్ ఖాన్​ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు

జాతీయ జవాబుదారీ సంస్థ-NAB ఆదేశాలతో మంగళవారం పాకిస్థాన్ పారామిలటరీ రేంజర్లు.. ఇస్లామాబాద్‌ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు అద్దాలు పగలగొట్టి మరీ ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ చేయగా అరెస్ట్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు.. ఇస్లామాబాద్‌ పోలీసు అధిపతి, హోంశాఖ కార్యదర్శిపై విచారణ చేస్తామని తెలిపింది.

Last Updated : May 10, 2023, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.