ETV Bharat / international

సిరియా రాజధానిపై క్షిపణి దాడి.. 15 మంది పౌరులు మృతి.. USలో 9మంది చిన్నారులు..

author img

By

Published : Feb 19, 2023, 7:15 AM IST

సిరియా రాజధాని డమాస్కస్​లోని నివాస భవనాలపైకి క్షిపణి దాడి చేసింది ఇజ్రాయెల్​. ఈ ఘటనలో 15 మంది పౌరులు మరణించారు. మరోవైపు, కరాచీ పోలీసు హెడ్​క్వార్టర్స్​పై దాడులు తమ పనేనని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు.

Israel strike Damascus
సిరియాపై క్షిపణి దాడి

సిరియా రాజధాని డమాస్కస్​లో ఘోరం జరిగింది. నివాస భవనాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 15 మంది పౌరులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అంతకుముందు పలుమార్లు సిరియాపై ఇజ్రాయెల్​ దాడులకు పాల్పడింది. 2022 ఆగస్టులో సిరియా మిలటరీ ఆయుధ డిపోపై ఇజ్రాయెల్ వాయుదాడులు జరిపింది. ఈ దాడిలో ఒక సిరియన్ ఆర్మీ కెప్టెన్ మరణించగా.. మరో 14 మంది గాయపడ్డారు.

'ఉగ్రదాడి మా పనే'
కరాచీలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై శుక్రవారం జరిగిన ఉగ్రదాడి తమ పనే అని పాకిస్థాన్‌ తాలిబన్లు ప్రకటించారు. ఆత్మాహుతి దాడిలో మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు భద్రతాదళాలతోపాటు ఓ పౌరుడు మృతి చెందగా మరో 18 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరు ఆత్మాహుతిదళ సభ్యులు హతంకాగా, మరో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. దాడి జరిగిన 3గంటల్లోపు పోలీసులు, పారా మిలిటరీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ను క్లియర్‌ చేసినట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరీఫ్‌ అల్వీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఖండించారు.

మరోసారి కాల్పులు..
అమెరికాలో తుపాకుల మోత మరోసారి మోగింది. అలబామా సరిహద్దులోని జార్జియాలో ఓ గ్యాస్ స్టేషన్​లో కాల్పులు జరిపారు గుర్తుతెలియని దుండగులు. ఈ దాడిలో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరూ 5 నుంచి 17 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారేనని అధికారులు తెలిపారు. అయితే గాయపడినవారిలో ఏడుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలిపారు. అయితే క్షతగాత్రులను ప్రాణాపాయమైన గాయాలు కాలేదని పేర్కొన్నారు.

మరోవైపు.. అమెరికాలో శుక్రవారం కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నెస్సీ రాష్ట్రంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మిసిస్సిపీలోని అర్కాబుట్ల అనే ఓ చిన్న పట్టణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాల్పులకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరిపుతున్నారు. మెంఫిస్ నగరానికి 50 కి.మీ దూరంలో ఉండే అర్కాబుట్ల పట్టణంలో 285 మంది మాత్రమే నివసిస్తారని 2020 జనాభా లెక్కల ప్రకారం తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.