గాజాలో సైనికులతో నెతన్యాహు- కాల్పుల విరమణ పొడగిస్తారా? ఇజ్రాయెల్ స్పందన ఇదే!

author img

By PTI

Published : Nov 27, 2023, 6:50 AM IST

Updated : Nov 27, 2023, 2:10 PM IST

Israel Hamas Ceasefire

Israel Hamas Ceasefire : ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా హమాస్ 17 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 39 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ ఒప్పందం సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Israel Hamas Ceasefire : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో ఆ ఒప్పందం పొడగింపుపై ఆసక్తి నెలకొంది. మూడో విడతలో భాగంగా హమాస్.. 17మంది బందీలను విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. అందులో 14మంది ఇజ్రాయెల్‌ పౌరులు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. 14మంది ఇజ్రాయెల్‌ పౌరుల్లో 9మంది చిన్నారులు ఉండగా.. విదేశీయుల్లో నాలుగేళ్ల అమెరికన్‌ కూడా ఉన్నారు. ప్రతిగా ఇజ్రాయెల్.. తమ జైళ్లలో ఉన్న 39మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు హమాస్ 58మందిని, ఇజ్రాయెల్‌ 114 మందిని విడుదల చేశాయి.

Israel Hamas Ceasefire
బందీలను రెడ్​క్రాస్​కు అప్పగించిన హమాస్
Israel Hamas Ceasefire
హమాస్ విడుదల చేసిన బందీలు

కాల్పుల విరమణ అమలులో ఉండటం వల్ల సంక్షోభంలో ఉన్న గాజాకు ఇప్పుడు సులభంగా మానవతాసాయం అందుతోంది. 120ట్రక్కులు గాజాకు బయల్దేరినట్లు ఈజిప్టు తెలిపింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ముగియనుండటం వల్ల.. ఒప్పందాన్ని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దానివల్ల మరింతమంది బందీలు విడుదలయ్యే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఎన్నో ప్రాణాలను కాపాడుతోందని, గాజాకు అత్యంత అవసరమైన మానవతా సాయం అందుతోందని బైడెన్‌ తెలిపారు. సత్ఫలితాలను ఇలాగే పొందేందుకు ఈ ఒప్పంద గడువును మరింత పెంచాలని బైడెన్ అన్నారు.

Israel Hamas Ceasefire
హెలికాప్టర్​లో వెళ్తున్న ఇజ్రాయెల్ విడుదల చేసిన ఖైదీలు
Israel Hamas Ceasefire
పాలస్తీనా ఖైదీలు

'10 మంది బందీలకు ఒకరోజు చొప్పున పొడగిస్తాం'
మరోపక్క, హమాస్ కూడా ఈ ఒప్పందం పొడిగింపును కోరుకుంటోంది. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ సీరియస్‌గా ఉంటే ఈ ఒప్పందాన్ని పొడిగించొచ్చని హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందం పొడగింపునకు సానుకూలంగా ఉంది. హమాస్ అదనంగా విడుదల చేసే ప్రతి 10 మంది బందీలకు.. ఒకరోజు చొప్పున కాల్పుల విరమణను పొడగిస్తామని తెలిపింది.

'హమాస్ అంతం పక్కా'
అదే సమయంలో, హమాస్​ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేసి తీరుతామని సైతం ఇజ్రాయెల్ పునరుద్ఘాటిస్తోంది. గాజా పట్టీలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ బలగాలను కలుసుకుని వారికి మరింత మనోధైర్యాన్ని ఇచ్చారు. ప్రతీ బందీని విడిపిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమకున్న మూడు లక్ష్యాల్లో.. హమాస్‌ అంతం, బందీల విడుదల, భవిష్యత్‌ ముప్పులు నివారించడం ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ అనుకూల పాలనను ప్రస్తావించారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన శక్తియుక్తులన్నీ తమకు ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు.

Israel Hamas Ceasefire
గాజాలో సైనికులతో నెతన్యాహు
Israel Hamas Ceasefire
గాజాలో సైనికులతో నెతన్యాహు

'గాజాపై ఇజ్రాయెల్ పట్టు- ఇదే సంకేతం'
నెతన్యాహు గాజా పర్యటన ఆప్రాంతంలో ఇజ్రాయెల్ నియంత్రణకు స్పష్టమైన సంకేతమని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. చీఫ్ ఆఫ్ స్టాఫ్ బ్రేవర్‌మాన్, జాతీయ భద్రతా మండలి డైరెక్టర్ త్జాచి హనెగ్బి, మిలిటరీ సెక్రటరీ మేజర్‌ జనరల్ అవీ గిల్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF డిప్యూటీ చీఫ్-ఆఫ్-స్టాఫ్ మేజర్-జనరల్ అమీర్ బరమ్ కూడా నెతన్యాహుతో ఉన్నారు.
మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ కానున్నారు. ఇజ్రాయెల్‌ వర్గాలు ఈ భేటీని ధ్రువీకరించగా.. మస్క్‌ ప్రతినిధుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

Israel Hamas Ceasefire
గాజాలో సైనికులతో నెతన్యాహు

'మానవతా సాయం పెంచాలి'
ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఘర్షణతో గాజా నగర ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఈ దాడులతో గాజా కరవు అంచున కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గాజాకు మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రపంచ దేశాలను కోరింది. ఈ కరవు వల్ల వ్యాధులు వ్యాప్తి చెందొచ్చని, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురుకావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

హమాస్​ కీలక కమాండర్ మృతి..
Hamas Commander Killed : ఒకవైపు కాల్పుల విరమణ అమల్లో ఉండగా.. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో ఉత్తర గాజా ఇన్​చార్జి అహ్మద్​ అల్ ఘాందౌర్​ మృతిచెందినట్లు హమాస్ ప్రకటించింది. అయితే ఎప్పుడు, ఎక్కడ మరణించాడనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు మృతిచెందిన హమాస్‌ సభ్యుల్లో అహ్మద్‌ కీలకమైన వ్యక్తి అని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. వెస్ట్​బ్యాంక్​లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది పాలస్తీయన్లను ఇజ్రాయెల్‌ దళాలు కాల్చి చంపాయని పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది. జెనిన్‌ శరణార్థి శిబిరంలో ఐదుగురు మృతి చెందగా.. సెంట్రల్‌ వెస్ట్‌బ్యాంక్‌లో ఒకరు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

హమాస్​ కీలక కమాండర్​ మృతి- కాల్పుల విరమణ ఉండగానే దాడులు, 8 మంది పాలస్తీనీయన్లు మృతి

ఇజ్రాయెల్,​ హమాస్​ కాల్పుల విరమణ- బందీల విడుదల షురూ, సంతోషంగా ఉందన్న నెతన్యాహు

Last Updated :Nov 27, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.