ETV Bharat / international

'స్పేస్​లో ఉన్నా.. రాగానే మన పెళ్లి!'.. కేటుగాడి బుట్టలో పడ్డ మహిళ.. రూ.25లక్షలు పోయాక..

author img

By

Published : Oct 12, 2022, 8:14 AM IST

'అంతర్జాతీయ రొమాన్స్‌ స్కామ్‌' ఇది. అంతరిక్షంలో ఉన్నా, భూమ్మీదకు రాగానే వివాహం చేసుకుంటానంటూ ఓ మహిళకు ప్రేమ బాణాలు వేశాడు ఓ కేటుగాడు. లక్షల రూపాయలు కాజేశాడు.

fake Astronaut cheating case
'స్పేస్​లో ఉన్నా.. రాగానే మన పెళ్లి!'.. కేటుగాడి బుట్టలో పడ్డ మహిళ.. రూ.25లక్షలు పోయాక..

అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నా.. నీపై మనసుపడ్డా.. భూమ్మీదకు రాగానే నిన్ను పెళ్లిచేసుకుంటానంటూ ఓ వ్యక్తి మాయమాటలు చెప్పగా.. నమ్మిన ఓ మహిళ అతడికి భారీ మొత్తంలో ముట్టజెప్పింది. ఆపై మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. జపాన్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు సామాజిక మాధ్యమంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. రష్యాకు చెందిన వ్యోమగామిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నట్లు కొన్ని నకిలీ ఫొటోలను కూడా ఆమెతో పంచుకున్నాడు. ఆపై తరచూ ఇద్దరూ మెసేజ్‌లు చేసుకోవడంతో కొద్దిరోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఇదిలా ఉండగా.. ఆ నకిలీ వ్యోమగామి ఆ మహిళ ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచాడు. గాఢంగా ప్రేమిస్తున్నానని, భూమ్మీదకు రాగానే వివాహం చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు. అయితే, తిరిగి భూమ్మీదకు రావాలంటే డబ్బు ఖర్చవుతుందని, జపాన్‌కు వెళ్లగలిగే రాకెట్‌కు ల్యాండింగ్ ఫీజు చెల్లించాలంటూ ఆమెను నమ్మించాడు. అతడి మాటలను నిజమని భావించిన సదరు మహిళ 5 దఫాల్లో అతడు చెప్పిన ఓ ఖాతాకు 4.4 మిలియన్ యెన్‌లు (దాదాపు రూ.24.8లక్షలు) పంపించింది. అయినప్పటికీ మరింత డబ్బు అడగడంతో అనుమానంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అతడు నకిలీ వ్యోమగామి అని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు 'అంతర్జాతీయ రొమాన్స్‌ స్కామ్‌'గా పేరు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.