ETV Bharat / international

'ఒమిక్రాన్​తో జాగ్రత్త.. మరణాలు పెరుగుతాయి!'

author img

By

Published : Dec 14, 2021, 6:40 PM IST

WHO on Omicron today: ఒమిక్రాన్​తో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది. కేసులు పెరిగే కొద్దీ.. ఆసుపత్రుల్లో చేరే వారు ఎక్కువగా ఉంటారని అంచనా వేసింది.

who on omicron today
'ఒమిక్రాన్​తో జాగ్రత్త.. మరణాలు పెరుగుతాయి'

WHO on ధmicron today: కరొనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అంచనా వేసింది. అదే సమయంలో మరణాలు సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించింది.

"ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్​ కేసులు బయటపడే కొద్దీ.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నాము."

--- డబ్ల్యూహెచ్​ఓ ప్రకటన.

ఒమిక్రాన్​ ప్రభావంపై మరింత డేటా అవసరం ఉందని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. అందువల్ల ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల డేటాను ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్​ఓకు అందించాలని విజ్ఞప్తి చేసింది.

గత నెలలో ఒమిక్రాన్​ వెలుగుచూసిన నాటి నుంచి కొత్త వేరియంట్​పై డబ్ల్యూహెచ్​ఓ పరిశోధనలు ముమ్మరం చేసింది. ఒమిక్రాన్​ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. ఒమిక్రాన్​ తీవ్రతను ఇప్పుడే అంచనా వేయలేమని, కొంత సమయం పడుతుందని ఇటీవలే వెల్లడించింది. అయితే వైరస్​ వ్యాప్తి వేగంగా ఉందని, ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.

బ్రిటన్​లో 75వేల మరణాలు..!

బ్రిటన్​లో ఒక్క ఒమిక్రాన్​తోనే 75వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం అంచనా వేయడం అత్యంత ఆందోళనకర విషయం. ఒమిక్రాన్​ నేపథ్యంలో బ్రిటన్​లో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. మరిన్ని చర్యలు తీసుకోకపోతే.. వచ్చే ఏడాది ఏప్రిల్​ నాటికి ఒమిక్రాన్​తో 25వేల నుంచి 75వేల మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఓ మోడెలింగ్​ అధ్యయనం పేర్కొంది. 2021 జనవరితో పోల్చుకుంటే.. ఒమిక్రాన్​తో కరోనా కేసులు మరింత ఎక్కువగా బయటపడతాయని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

యాంటీబాడీల నుంచి తప్పించుకునే లక్షణాలను ఆధారంగా చేసుకుని, అందుబాటులో ఉన్న డేటాతో ఈ అధ్యయనం చేశారు లండన్​ స్కూల్​ ఆఫ్​ హైజీన్​ అండ్​ ట్రాపికల్​ మెడిసిన్​కు చెందిన పరిశోధకులు. కొత్త వేరియంట్​.. రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై ఈ పరిశోధనలు జరిగాయి.

  • మరిన్ని కట్టడి చర్యలు తీసుకోకుండా, అత్యంత సానుకూల పరిణామాలను(రోగనిరోధక శక్తి దెబ్బతినకుండా ఉండి, వ్యాక్సిన్​ బూస్టర్లు కచ్చితంగా పనిచేస్తే) దృష్టిలో పెట్టుకుంటే.. డిసెంబర్​ 1 నుంచి 2022 ఏప్రిల్​ 30 నాటికి 24,700 మరణాలు నమోదవుతాయి. రోజుకు 2వేల కేసులు బయటకొస్తాయి. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అత్యధికంగా 1,75,000గా ఉంటుంది. ఈ సమయంలో.. కొవిడ్​ కట్టి చర్యలు చేపడితే.. మరణాలు 7,600కి తగ్గే అకాశముంది.
  • అత్యంత దారుణమైన పరిస్థితుల్లో(వైరస్​ను అడ్డుకునే సామర్థ్యం టీకాలకు, రోగ నిరోధక శక్తికి లేకపోతే), మరిన్ని కట్టడి చేర్యలు తీసుకోకపోతే.. 74,800 మరణాలు నమోదవుతాయి. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య 4.92లక్షలు దాటిపోతుంది. ఇదే జరిగితే.. ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని, లేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు.

ఒమిక్రాన్​ ముప్పుపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, ప్రపంచవ్యాప్తంగా మరింత డేటా తెలియాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనం.. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- China omicron: చాపకింద నీరులా 'ఒమిక్రాన్​'.. చైనాలో తొలి కేసు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.