ETV Bharat / international

Unesco: ప్రమాదంలో 'ప్రపంచ వారసత్వ సంపద'

author img

By

Published : Jun 24, 2021, 11:58 AM IST

వేలాది జాతుల జలాచరాలకు ఆవాసమై.. ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందిన గ్రేట్​ బారియర్​ రీఫ్(Great barrier reef)​ ప్రమాదం అంచుకు చేరింది. వాతావరణ కాలుష్యం ఈ పగడాల దిబ్బపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రపంచ వారసత్వ సంపద హోదా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

Great barrier reef
గ్రేట్​ బారియర్​ రీఫ్​

ప్రపంచంలోనే అతిపెద్దదైన పగడాల దిబ్బగా పేరొందిన గ్రేట్ బారియర్ రీఫ్(Great barrier reef) ప్రమాదపుటంచున నిలిచింది. వేలాది జాతుల జలాచరాలకు ఆవాసమై.. ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందిన ఈ ప్రకృతి సంపదకు వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా మారింది. భూతాపం కారణంగా గ్రేట్ బారియర్ రీఫ్‌కు ప్రపంచ వారసత్వ సంపద హోదాను వెనక్కు తీసుకునే ప్రమాదం కనిపిస్తోంది. 400 జాతులు పగడాలు, వేలాది జాతులు చేపలు, మొలస్కాలు, సముద్ర పాములు, సముద్ర తాబేళ్లు, తిమింగలాలు, డాల్ఫిన్లకు ఆవాసం ఈ గ్రేట్ బారియర్ రీఫ్‌. ఆస్ట్రేలియా ఈశాన్య తీర ప్రాంతంలో 2300 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. 1981లో దీనికి ప్రపంచ వారసత్య సంపద గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌కు ప్రమాదం పొంచిఉంది.

ఆ జాబితాలో చేర్చే యోచన!

గత కొన్నేళ్లుగా బ్లీచింగ్‌ కార్యకలాపాల కారణంగా ఈ పగడపు దిబ్బకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శిలాజ ఇంధనాలు మండించడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందంటున్న శాస్త్రవేత్తలు.. భూతాపం కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ మీద తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంటున్నారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను కాపాడుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ కాలుష్యం కారణంగా గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ను ప్రమాదంలో ఉన్న వారసత్వ సంపదల జాబితాలో చేర్చాలని యునెస్కో(Unesco) భావిస్తోంది. వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. భూతాపం నుంచి ఈ ప్రపంచ వారసత్వ సంపదను రక్షించేందుకు ఆస్ట్రేలియా చర్యలు తీసుకోవడం లేదని యునెస్కో ఆరోపిస్తోంది. ఇదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని నిరోధించే చర్యల్ని తీసుకోడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆసక్తి చూపించడంలేదని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. బొగ్గు, సహజ వాయువుల్ని భారీగా ఎగుమతి చేసే ఆస్ట్రేలియా 2015 నుంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను మార్చుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

తొలి ప్రదేశంగా..

అయితే యునెస్కో నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆస్ట్రేలియా పేర్కొంటోంది. సుమారు 83 ప్రపంచ వారసత్వ సంపదలు వాతావరణ కాలుష్య ముప్పును ఎదుర్కొంటుంటే కేవలం గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ హోదాను మాత్రమే మారుస్తామనడం సబబు కాదంటోంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ చర్యల మాట ఎలా ఉన్నప్పటికీ.. గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ నీటి నాణ్యత కోసం నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేకపోతున్నాయని యునెస్కో పేర్కొంటోంది. చైనా వ్యక్తి యునెస్కోకు సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో బీజింగ్‌, కాన్‌బెర్రాల మధ్య గత కొన్నేళ్లుగా ఉన్న ఉద్రిక్తతలు గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ను ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చే అంశంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆస్ట్రేలియా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ను ప్రమాదంలో ఉన్న వారసత్వ సంపద జాబితాలో చేరిస్తే.. వాతావరణ కాలుష్యం కారణంగా ఈ జాబితాలో చేరిన తొలి ప్రదేశంగా అప్రతిష్టను మూటగట్టుకుంటుంది.

ఇదీ చూడండి: Universal Vaccine: అన్ని వైరస్‌లపై..ఒకే ఆయుధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.