ETV Bharat / international

'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్​'తో లాభాలెన్నో: మోదీ

author img

By

Published : Nov 2, 2021, 9:04 PM IST

గ్లాస్గోలో జరిగిన సీఓపీ26లో ప్రధాని మోదీ రెండో రోజు ప్రసంగించారు. సౌరశక్తి సామర్థ్యంపై మాట్లాడారు. సౌరశక్తి పరిశుభ్రమైనదిగా పేర్కొన్న మోదీ.. 'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్​'తో ఎన్నో లాభాలున్నాయని వెల్లడించారు. ఇందుకోసం ఇస్రో సోలార్​ కాలిక్యులేటర్​ రూపొందిస్తోందని స్పష్టం చేశారు. సోలార్​ ప్రాజెక్టుల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

pm modi latest news
'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్​'

శిలాజ ఇంధనాల వినియోగంతో కొన్ని దేశాలు సుసంపన్నమైన స్థితికి ఎదిగినప్పటికీ, వాటి ఉపయోగంతో భూమి, పర్యావరణానికి చేటు జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శిలాజ ఇంధనాల కారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా తలెత్తాయని గుర్తుచేశారు. కానీ సౌరశక్తిని వినియోగించుకుంటే ప్రపంచానికి మంచి జరుగుతుందన్నారు.

గ్లాస్గోల్​ జరిగిన సీఓపీ26లో పాల్గొన్నారు మోదీ. సౌరశక్తి పూర్తిగా పరిశుభ్రమైనదని అన్నారు. పగటిపూటే అందుబాటులో ఉండటం, వాతావరణంపై ఆధారపడం పెద్ద సవాలని వివరించారు. ఈ సమస్యకు 'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్​' పరిష్కారమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే గ్రిడ్​ను ఏర్పాటు చేస్తే సౌరశక్తిని సులభంగా ఎప్పుడైనా, ఎక్కడికైనా సరఫరా చేయవచ్చన్నారు. దీనికే అనేక లాభాలున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. స్టోరేజీ సామర్థ్యం తగ్గడం సహా సోలార్​ ప్రాజెక్టులకు ఊతమందిస్తుందన్నారు. దీనితో ఇంధన ధరలు తగ్గుతాయని, దేశాలు, మతాల మధ్య సహకారం పెరుగుతుందన్నారు.

"'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్​'తో శక్తివంతమైన అంతర్జాతీయ గ్రిడ్​ను అభివృద్ధి చేయవచ్చని ఆశిస్తున్నా. గ్రీన్​ గ్రిడ్​ సహకారంతో ఇది సాధ్యపడుతుంది. ప్రపంచానికి ఇస్రో.. ఓ సోలార్​ కాలిక్యులేటర్​ను అందిస్తుంది. దీనితో శాటిలైట్​ డేటా ద్వారా.. ఎక్కడైనా సౌరశక్తి సామర్థ్యాన్ని లెక్కించవచ్చు. సోలార్​ ప్రాజెక్టుల కోసం ఈ యాప్​ ఉపయోగపడుతుంది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

సమావేశంలో పాల్గొన్న బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. వాతావరణ మార్పులపై ఏ విధంగా పోరాడాలనే విషయాన్ని అర్థం చేసుకున్న అంతర్జాతీయ నేతల్లో మోదీ ఒకరని కొనియాడారు.

ఇదీ చూడండి:- ఆ దేశాలకు అండగా 'ఐరిస్'- ఆవిష్కరించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.