ETV Bharat / international

కరోనా పంజా​: లండన్​లో మూడో టైర్ లాక్​డౌన్

author img

By

Published : Dec 15, 2020, 6:00 AM IST

గత కొంతకాలంగా కరోనా కేసులు భారీగా పెరగడం వల్ల లండన్​లో మూడో టైర్ లాక్​డౌన్​ను విధించనున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమలు కానున్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఏడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అయిన నేపథ్యంలో వేగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

London to move to highest alert as new coronavirus variant identified in UK
కరోనా ఎఫెక్ట్​తో లండన్​లో మూడో టైర్ లాక్​డౌన్

కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న వేళ లండన్​లో లాక్​డౌన్ ఆంక్షలు పెంచనున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. మూడు దశల లాక్​డౌన్​ను అనుసరిస్తున్న యూకే.. లండన్​లో బుధవారం నుంచి మూడో టైర్​ను అమలు చేయనుంది. ఇది దాదాపు పూర్తి స్థాయి లాక్​డౌన్​తో సమానమని అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో భారీగా కేసులు పెరిగాయని, చాలా ప్రాంతాల్లో ఏడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయని వైద్య శాఖ మంత్రి మాట్ హాన్​కాక్ పేర్కొన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంక్షలతో పాటు.. మొబైల్ టెస్టింగ్, కమ్యునిటీ టెస్టింగ్​లను మరింత పెంచినట్లు తెలిపారు.

మరోవైపు, దేశంలో వెయ్యికిపైగా కరోనా కొత్త రకం కేసులను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. దక్షిణ ఇంగ్లాండ్​లో ఇవి ఎక్కువగా బయటపడ్డట్లు వివరించారు. 60 వేర్వేరు ప్రాంతాల్లో ఇవి వెలుగులోకి రాగా.. వీటి సంఖ్య మరింతగా పెరుగుతోందని చెప్పారు. గత కొద్ది నెలల్లో ఇలాంటి వైరస్​ వివిధ దేశాల్లో కనిపించాయని తెలిపారు. డబ్ల్యూహెచ్​ఓకు దీనిపై సమాచారం అందించినట్లు స్పష్టం చేశారు. ఇది ఇతర కరోనావైరస్​ రకాలతో పోలిస్తే తీవ్రంగా ఉండే అవకాశం లేదని అన్నారు.

టీకా పంపిణీ

బ్రిటన్​లో ఫైజర్ టీకా పంపిణీ కొనసాగుతోంది. వైద్యులు, జనరల్ ప్రాక్టీషనర్లు, నర్సులకు సోమవారం తొలి డోసు అందుకున్నారు. వైద్యుల కార్యాలయాల్లో టీకా పంపిణీ మొదలైందని అధికారులు తెలిపారు. వీరితో పాటు అధిక వైరస్ ముప్పు ఉన్నవారికి, ఫ్రంట్​లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతోందని చెప్పారు.

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కొనసాగేలా వైద్య సేవల సిబ్బంది కృషి చేస్తున్నారు. స్థానికంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.