ETV Bharat / international

రష్యాలో అన్ని ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్!

author img

By

Published : Sep 13, 2020, 5:12 PM IST

తాము రూపొందించిన కరోనా టీకాలు సోమవారం నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని రష్యా ప్రకటించింది. పరీక్షల నిమిత్తం తొలి బ్యాచ్​ను ఇప్పటికే తరలించినట్టు... ప్రస్తుతం పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తున్నట్టు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్​ మురషుకో వెల్లడించారు.

Russia to send vaccine to every part of the country by tomorrow
రేపటికి అన్ని ప్రాంతాలకు కరోనా టీకాలు

సోమవారం నాటికి రష్యాలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్‌ టీకాలు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురషుకో విలేకర్లకు వెల్లడించారు. ఇప్పటికే తొలి బ్యాచ్‌ టీకాలను పరీక్షల నిమిత్తం తరలించామని వెల్లడించారు. ఇప్పుడు పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ తొలిబ్యాచ్‌లు ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాటికి గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు రష్యా ఈ టీకాను విడుదల చేసిన వారానికి ఈ ప్రకటన వెలువడింది.

ఇప్పటికే ప్రజలకు వినియోగించడానికి రష్యా ఆరోగ్యశాఖ అనుమతులు ఇచ్చేసింది. మూడో దశ ప్రయోగాల కింద ఆ దేశంలో 40వేల మందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి దాదాపు 100 కోట్ల మంది స్పుత్నిక్‌-వి టీకాను తీసుకుంటారని రష్యాకు చెందిన రష్యాన్‌ డైరెక్టరేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అంచనా వేస్తోంది. మరోపక్క ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోవడంపై రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్‌ అభివృద్ధికి అవలంబిస్తున్న విధానంలో లోపాల్ని ఈ చర్య ఎత్తిచూపిందని ఆ సంస్థ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌ అభిప్రాయపడ్డారు. విస్తృత స్థాయిలో ఉపయోగించాల్సిన ఓ వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ఆయా దేశాలు సరికొత్త, గతంలో పరీక్షించని విధానాల్ని ఉపయోగిస్తున్నాయన్నారు. కోతుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడడం, ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను వినియోగించడం కొత్త విధానాలని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం కావడంపై ఆర్‌డీఐఎఫ్‌ సంతోషం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:- 'రష్యా 'స్పుత్నిక్-వీ'​ ప్రతిపాదనకు అధిక ప్రాధాన్యం '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.