ETV Bharat / international

జూన్​ నుంచి చైనాలోనే భారత నౌక.. సిబ్బంది ఆవేదన

author img

By

Published : Nov 8, 2020, 5:09 PM IST

చైనాతో దౌత్య సంబంధాలు దెబ్బతినడం వల్ల.. భారత్​కు చెందిన ఓ నౌక జూన్​ నుంచి ఆ దేశంలో చిక్కుకుపోయింది. నౌకలో తీసుకెళ్లిన సరకు దిగుమతికి జిన్​పింగ్​ సర్కారు అనుమతించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఫలితంగా 23మంది తమ కుటుంబాలకు దూరమై నౌకలో ఇరుక్కుపోయారు.

India's merchant ship stuck at China's port since June, crew in unpleasant condition
జూన్​ నుంచి చైనాలోనే భారత నౌక.. అయోమయంలో సిబ్బంది

భారత్​లోని ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు చెందిన నౌక.. ఐదు నెలలుగా చైనాలో చిక్కుకుపోయింది. ముంబయి గ్రేట్​ ఈస్టర్న్​ షిప్పింగ్​ లిమిటెడ్​కు చెందిన 'జగ్​ ఆనంద్​' నౌక.. గత జూన్​ నుంచి ఉత్తర జింగ్​టంక్​ ఓడరేవులో ఉండిపోయింది. తాము తీసుకొచ్చిన సరకును చైనా ఓడరేవు అధికారులు దిగుమతి చేస్కోనందునే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు చేరేందుకు సాయం కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

మందుల కొరత..

ఆ నౌకలో 23మంది భారతీయ సిబ్బంది చిక్కుకోగా.. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా ఉన్నట్టు సమాచారం. వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యల(రక్తపోటు, మధుమేహం)తో సతమతమవుతున్నారు. అయితే వారికి మందులు కూడా అందుబాటులో లేవని.. ఓ సిబ్బంది తమ కష్టాల గురించి ఫోన్​ ద్వారా మీడియా అధికారులతో చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.

"మేము సుమారు 1.7 లక్షల టన్నుల ఆస్ట్రేలియన్​ బొగ్గును లోడ్​ చేసుకుని జనవరిలో ఓడ ఎక్కాం. మే నెలలో ఆస్ట్రేలియా నుంచి బయల్దేరి జూన్​ 13నాటికి చైనాలోని జింగ్​టంక్​ నౌకాశ్రయానికి చేరుకున్నాం. అప్పటి నుంచి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఎన్నో నెలలుగా మా కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాం. చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వైరస్​ వ్యాప్తి కూడా ఆందోళన కలిగిస్తోంది. దయచేసి మా విజ్ఞప్తిని స్వీకరించి.. సరకును దించుకొని, మేము ఇంటికి వెళ్లేందుకు అనుమతించండి."

- సిబ్బంది, జగ్​ ఆనంద్​ ఓడ.

ప్రత్యామ్నాయ మార్గాలపై..

సరకు దిగుమతికి చైనా అంగీకరించకపోతే.. జపాన్​తో సంప్రదింపులు జరిపి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని తమ కంపెనీకి అభ్యర్థించారు ఉద్యోగులు. తాము జపనీస్​ నౌకాశ్రయానికి సరకును తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్​లకు లేఖ రాయాలని వారి కుటుంబసభ్యులకు విజ్ఞప్తి చేశారు.

అయితే.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు షిప్పింగ్​ అధికారి ఒకరు తెలిపారు.

మారిన నిబంధనల వల్లే ఈ దుస్థితి..

చైనాతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా నౌక.. జూన్​ 13 నుంచి లంగరులోనే ఉంది. కస్టమ్స్​ అధికారులు సరకుకు సంబంధించి ఎలాంటి స్పష్టతను ఇవ్వడం లేదు. దీంతో అనేక మంది తమ ఒప్పంద బాధ్యత ముగిసిపోయినా.. అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అందులో కొందరు 15నెలలకుపైగా విధుల్లో ఉన్నారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి సఫలీకృతం కావడంలేదు.

జిన్​పింగ్​ ప్రభుత్వం.. ఆస్ట్రేలియన్​ బొగ్గు దిగుమతిపై నియమ నిబంధనలు మార్చింది. ఈ మేరకు గత కొన్ని నెలలుగా సుమారు 20 నౌకలు చైనా ఓడరేవు వద్దే నిలబడ్డాయి.

ఇదీ చదవండి: ఎనిమిదో విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.