ETV Bharat / international

ఐరాసలో పాక్ ప్రయత్నాలకు భారత్ బ్రేకులు

author img

By

Published : Oct 9, 2020, 8:16 AM IST

అమాయకులపై ఉగ్రవాదులనే ముద్ర వేయాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలను ఐరాస భద్రతా మండలిలో భారత్ అడ్డుకొంది. అల్‌ఖైదా ఆంక్షల కమిటీ రూపొందించిన ఉగ్రవాదుల జాబితాలో నలుగురు భారతీయుల పేర్లు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఖండించింది. ఆధారాలు లేకుండా ప్రతీకార కాంక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.

pak india news
ఐరాసలో పాక్ ప్రయత్నాలను అడ్డుకొన్న భారత్

అమాయకులపై ఉగ్రవాదులు అన్న ముద్రవేయడానికి పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని భారత్‌ పేర్కొంది. ఇందుకు భద్రతా మండలిని ఉపయోగించుకోవాలని చూస్తోందని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ప్రతీకార కాంక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. భద్రతా మండలి పరిధిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ రూపొందించిన ఉగ్రవాదుల జాబితాలో నలుగురు భారతీయుల పేర్లు పెట్టడానికి పాక్ చేసిన ప్రయత్నాలను అడ్డుకొంది.

అంగర అప్పాజీ, గోబింద పట్నాయక్‌, అజయ్‌ మిస్త్రీ, దొంగర వేణుమాధవ్‌ల పేర్లను ఈ కమిటీ పరిశీలనకు పాక్‌ గతంలోనే పంపించింది. వేణుమాధవ్‌, మిస్త్రీల పేర్లను జాబితాలో పెట్టడానికి జూన్‌/జులైలో జరిగిన సమావేశంలో భద్రతా మండలి తిరస్కరించింది. గత నెలలో జరిగిన సమావేశంలో మిగిలిన ఇద్దరు పేర్లపై అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియంలు అభ్యంతరం తెలిపాయి.

ఈ విషయాన్ని అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ సమావేశంలో.. ఐరాసలో భారత రాయబార కార్యాలయం ఫస్ట్‌ సెక్రటరీ, న్యాయసలహాదారు యెడ్ల ఉమాశంకర్‌ ప్రస్తావించారు. పాకిస్థాన్‌ పేరు పెట్టకుండా ఆ దేశం చేస్తోన్న ప్రయత్నాలను తప్పుబట్టారు.

"సరిహద్దుల నుంచి వస్తున్న ఉగ్రవాదానికి భారత్‌ బాధిత దేశంగా మారింది. మా పోరాటం ఉగ్రవాదులను, వారి స్థావరాలను నిర్మూలించడమే కాదు...వారికి ఆశ్రయం ఇస్తున్న, ఆర్థిక సాయం చేస్తోన్న దేశాలను అడ్డుకోవడం కూడా..."

-యెడ్ల ఉమాశంకర్‌, ఐరాసలో భారత రాయబార కార్యాలయం ప్రథమ కార్యదర్శి

ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోన్న వారిని బహిర్గతం చేయడంలో దేశాలన్నీ కలసికట్టుగా వ్యవహరించాలని కోరారు. ఉగ్రవాద నిర్మూలనపై ఇంకా సమగ్రమైన విధానం రూపొందించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి- చైనాపై 'కరోనా' దర్యాప్తునకు డబ్ల్యూహెచ్​ఓ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.