ETV Bharat / international

ట్రంప్xబైడెన్: రికార్డు ఓటింగ్- హోరాహోరీ ఫలితాలు

author img

By

Published : Nov 4, 2020, 7:34 AM IST

శతాబ్దంలో ఎరుగని విధంగా అమెరికాలో ఓటింగ్ శాతం నమోదయ్యేలా కనిపిస్తోంది. 67 శాతం మంది ఓటర్లు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగమైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పలు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి.

US set to witness highest voter turnout in a century as over 160 million votes expected to be cast in Election 2020
ట్రంప్xబైడెన్: రికార్డు ఓటింగ్.. హోరాహోరీ ఫలితాలు

అమెరికాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. వందేళ్లలో ఎన్నడూ చూడనంత భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 16 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అర్హులైన ఓటర్లలో వీరు 67 శాతం కాగా.. 1900 సంవత్సరం తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతంగా రికార్డుకెక్కే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగానే సాగింది. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్​, బైడెన్​లు ప్రయత్నించారు. ఓటింగ్​కు తరలిరావాలని కోరారు.

ఇదో చరిత్ర!

అమెరికాలో ప్రస్తుత ఓటింగ్ చరిత్రలో నిలిచిపోనుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 16 కోట్ల మంది ఓటేస్తారని ఫ్లోరిడా యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు మైఖేల్ పీ మెక్​డొనాల్డ్ వెలువరించిన అంచనాలను ప్రస్తావించింది. టెక్సాస్, కొలరాడో, వాషింగ్టన్, ఓరెగన్, హవాయి, మోంటనా రాష్ట్రాల్లో పోలైన ముందస్తు ఓట్లు 2016లో నమోదైన మొత్తం ఓట్లకన్నా అధికంగా ఉందని పేర్కొంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో దాదాపు గత ఎన్నికల మొత్తం ఓట్ల స్థాయిలో ముందస్తు పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.

"మల్లగుల్లాలు పడుతున్న ఆర్థిక వ్యవస్థ తీరు, కరోనా వ్యాప్తి, ట్రంప్ హయాంలో రాజకీయ వ్యవహారాలు సహా దేశంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం పడే పరిణామాలు ఉన్న నేపథ్యంలో భారీగా ఓటర్ టర్నవుట్ నమోదైనట్లు కనిపిస్తోంది. మహమ్మారి సమయంలోనూ ఓటింగ్ సురక్షితంగా, సులభంగా నిర్వహించేలా పలు రాష్ట్రాలు తీసుకున్న చర్యలు కూడా ఇందుకు దోహదం చేశాయి."

-న్యూయార్క్ టైమ్స్

ఎన్నికల రోజున రిపబ్లికన్ ఓటర్లే అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ముందస్తు ఓటింగ్, మెయిల్​ ఇన్ ఓట్లను డెమొక్రాట్లు అధికంగా వినియోగించుకున్నారని తెలిపింది. ఎన్నికల రోజు డెమొక్రాటిక్ ఓటర్లు సైతం భారీగానే హాజరైనట్లు వెల్లడించింది.

ట్రంప్ x బైడెన్

ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. ఒక్కో రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇరువురు అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.

మాదే విజయం

ఇరువురు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 2016తో పోలిస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. తన గెలుపు సులభమే అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజు రాత్రి తన వందలాది మద్దతు దారులతో పార్టీకి పిలుపునిచ్చారు. శ్వేతసౌధంలోని ఈస్ట్ రూంను ఇందుకు వేదికగా ఎంపిక చేశారు.

తన సొంత రాష్ట్రం డెలావేర్ నుంచి రాత్రి ప్రసంగం ఇవ్వనున్నట్లు ప్రకటించిన బైడెన్ తర్వాత దాన్ని రద్దు చేశారు. స్కాంటన్​లోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించారు. ఓట్లు వేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. తన భార్య జిల్​తో కలిసి విల్మింగ్టన్​లోని సెయింట్ జోసెఫ్ చర్చిని సందర్శించారు. మరణించిన తన కుమారుడి సమాధి వద్దకు వెళ్లారు.

సైబర్ దాడులు లేవు

ఎన్నికల పోలింగ్​లో ఇప్పటివరకు ఎలాంటి సైబర్​ దాడి జరగలేదని సైబర్​ భద్రతా ఏజెన్సీ హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది. చిన్న సాంకేతిక సమస్యలు మాత్రమే వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఫలితాలు వెల్లడయ్యే సమయంలో మాత్రం సైట్ల మీద ఒత్తిడి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.