ETV Bharat / international

'మాపై దాడి చేస్తే వెయ్యి రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాం'

author img

By

Published : Sep 15, 2020, 12:38 PM IST

అమెరికాపై ఇరాన్​ ఏవైనా దాడులకు తెగబడితే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతకు వెయ్యి రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.

Trump warns Iran
ఇరాన్​కు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఏవైనా దుశ్చర్యలకు పాల్పడితే అంతకు వెయ్యి రెట్ల పరిమాణంలో ప్రతిదాడి చేస్తామని స్పష్టం చేశారు.

ఇరాన్​ కీలక నేత కాశీం సులేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దేశం​ ప్రయత్నిస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు ట్రంప్.

Trump warns Iran
ఇరాన్​కు ట్రంప్ హెచ్చరిక

"చాలా ఏళ్లుగా అమెరికా సైనికులు హత్యలకు గురవుతున్నారు. భవిష్యత్తులో సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ హత్య లేదా ఇతర దాడికి ప్రణాళిక వేయవచ్చు. ఇదే జరిగితే అంతకు వెయ్యి రెట్లు అమెరికా ప్రతిదాడి చేస్తుంది."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

రాయబారి హత్యకు ప్రణాళిక!

దక్షిణాఫ్రికాలోని అమెరికా రాయబారి లానా మార్క్స్‌ను హత్యకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓ వార్తా పత్రిక కథనం వెలువరించింది. ఇదే జరిగితే.. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతాయని పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రతిదాడికి పాల్పడేలా ట్రంప్​పై ఒత్తిడి పెరుగుతుందని వివరించింది.

అయితే, ఈ ఆరోపణలను ఇరాన్​ ప్రభుత్వం ఖండించింది. ఎన్నికల ప్రచారంలో ఇరాన్​ వ్యతిరేక భావజాలాన్ని అమెరికన్లు వినియోగిస్తున్నారని ఇరాన్​ విదేశాంగ అధికార ప్రతినిధి సయీద్ ఖతిబ్​జాడే పేర్కొన్నారు.

సులేమానీ మరణం..

ఇరాక్‌ రాజధానిలోని బాగ్దాద్‌లో అమెరికా దళాలు జనవరి 3న చేసిన దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్​ జనరల్‌ ఖాసిం సులేమానీ హతమయ్యారు. ఆయనతో సహా ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతున్న తిరుగుబాటు సంస్థ పాపులర్ మొబిలైజేషన్‌ ఫోర్సెస్‌ (పీఎంఎఫ్‌) డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌-ముహందిస్‌ మృతి చెందారు.

ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీ బలగాలను మోహరించింది అమెరికా. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

ఇదీ చూడండి: ట్రంప్​ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్​ మధ్య డీల్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.