ETV Bharat / international

కరోనా మూలాలు ఎప్పటికీ కనుక్కోలేమా?- నిఘా సంస్థల మాటేంటి?

author img

By

Published : Oct 30, 2021, 3:49 PM IST

కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించిందా? ల్యాబ్ నుంచి లీక్ అయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో దొరికేలా కనిపించటం లేదు. తాజాగా కరోనా మూలాలపై(Covid Origin Update) విస్తృత అధ్యయనం చేసిన అమెరికా నిఘా సంస్థలు... తాము కొవిడ్ మూలాలను ఎప్పటికీ గుర్తించలేమని తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేశాయి.

coronavirus origin
కరోనా మూలాలపై పరిశోధన

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి మూలాలపై(Covid Origin Update) విస్తృత అధ్యయనం చేసిన అమెరికా నిఘా సంస్థలు కీలక వ్యాఖ్యలు చేశాయి. తాము కొవిడ్‌ మూలాలను ఎప్పటికీ గుర్తించలేమని తెలిపాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు వచ్చిందా? ల్యాబ్ నుంచి లీక్ అయిందా? అనే దానిపై శుక్రవారం ఓ నివేదికను విడుదల చేశాయి. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌తో పాటు మరో నాలుగు నిఘా సంస్థలు వైరస్‌ సహజసిద్ధంగా జన్మించి ఉంటుందన్న వాదనవైపు మొగ్గుచూపాయి. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ మాత్రం ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యి ఉంటుందన్న వాదనను విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. కానీ, వీటిలో ఏ ఒక్క సంస్థ కూడా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌కు లేదా శ్వేతసౌధానికి వైరస్‌ పుట్టుకకు ఇదే కారణమంటూ బలమైన ఆధారాలను ఇవ్వలేకపోయాయి. దీంతో రెండు వాదనలపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.

'తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు'

కరోనా వైరస్ ఒక జీవాయుధంగా ఉద్భవించిందనే వాదనను కూడా ఈ నివేదిక తోసిపుచ్చింది. ఎవరైతే ఈ వాదన చేస్తున్నారో వారికి చైనా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ప్రత్యక్ష ప్రవేశం లేదని తెలిపింది. వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. 90 రోజుల్లో కొవిడ్‌ మూలాలు తేల్చాలని అమెరికా నిఘా సంస్థలను గత మే నెలలో అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. మహమ్మారి మూలాలపై(Covid Origin Update) ఉన్న రెండు రకాల వాదనలపై విస్తృత అధ్యయనం చేపట్టాలని నిర్దేశించారు. దీనిపై దర్యాప్తు జరిపిన నిఘా సంస్థలు ఆగస్టులోనే నివేదికను సమర్పించాయి. జంతువుల నుంచి మనిషికి ఈ వైరస్ సోకి ఉంటుందని లేదా ల్యాబ్‌లో సృష్టించారన్న వాదనలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఏ ఒక్క వాదనకు బలమైన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు వైరస్‌ మూలాలపై అమెరికా నిఘా సంస్థలకు చాలా తక్కువే తెలుసని అంగీకరించారు.

'అది చెప్పలేం'

ప్రకృతిలో సహజసిద్ధంగా కనిపించని.. కరోనా కుటుంబానికి చెందిన కొన్ని వైరస్‌లను వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించారని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు. కానీ, కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌(Covid Origin Update) అదే కోవకు చెందిందా? లేదా? అన్నది మాత్రం చెప్పలేమని నిఘా సంస్థలు తెలిపాయి. దీనిపై మరింత లోతైన సమాచారం లభిస్తే తప్ప వైరస్‌ మూలాలపై ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేమని తేల్చిచెప్పాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.