ETV Bharat / crime

Accidents on NH 167: ప్రమాదాలకు నిలయంగా ఎన్​హెచ్ 167.. అవే ప్రధాన కారణాలు.!

author img

By

Published : Dec 27, 2021, 4:38 PM IST

Accidents on NH 167: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 167 జాతీయ రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారుతోంది. నిత్యం ఏదో ఒకచోట జరిగిన దుర్ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలవడంతో... బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలైతే... రహదారిపై వేగనియంత్రికలు, సూచికలు లేకపోవడం పరోక్షంగా దోహదపడుతున్నాయి. చారగొండ నుంచి టైరోడ్డు వరకూ విస్తరించిన రోడ్డుపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో... NH-167 పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Accidents on NH 167
NH 167 పై రోడ్డు ప్రమాదాలు

ప్రమాదాలకు నిలయంగా మారిన ఎన్‌హెచ్‌ 167

Accidents on NH 167: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న 167 వ నంబర్ జాతీయ రహదారి... ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం నుంచి... నారాయణపేట జిల్లా టైరోడ్ వరకూ సుమారు 172 కిలోమీటర్ల మేర.... ఈ రహదారి విస్తరించి ఉంది. సరుకు రవాణా వాహనాలు, లారీలు, బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నిత్యం వేలాదిగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో వివిధ కారణాల వల్ల ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల అతివేగంగా వచ్చిన కారు... ఆటోను ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపోగా... రెండేళ్ల కిందట మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను- లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. అమ్మాపూర్ రోడ్డు నుంచి హైవేపైకి వస్తుండగా జరిగిన మరో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా... పెద్దగోప్లాపూర్‌లో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టి చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ రహదారిపై ఏటా సగటున 70కి పైగా ప్రమాదాలు జరుగుతుండగా... 60 మంది మరణిస్తున్నారని, 70మందికి పైగా క్షతగాత్రులు అవుతున్నారని అనధికారిక అంచనా.

సూచిక బోర్డులు లేవు

Road accidents: అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికితోడు రహదారిపై స్పీడ్‌ బ్రేకర్లు, ఎక్కడెక్కడ ఎంతవేగంతో వెళ్లాలన్న సూచిక బోర్డులు లేకపోవడం మరో కారణం. గ్రామాల నుంచి జాతీయ రహదారికి రోడ్డు కలిసే చోట... వేగ నియంత్రికలు లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

'ఈ జాతీయ రహదారిపై భారీ వాహనాలు ఎక్కువగా వెళ్తుంటాయి. రహదారిపై సూచిక బోర్డులు కానీ, స్పీడ్​ బ్రేకర్లు కానీ లేవు. దీంతో గ్రామాలకు వెళ్లే దారిలో చౌరస్తాల వద్ద వేగం నియంత్రణ కావడం లేదు. ఫలితంగా అధికంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపడంతో వెనుక నుంచి వచ్చే వారు చూసుకోకపోవడంతో ప్రాణ నష్టానికి దారితీస్తోంది. కోదాడ- రాయచూర్​ మార్గంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇకనైనా అధికారులు పట్టించుకొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.' -స్థానికులు

నిర్లక్ష్య వైఖరి

రాయచూర్ నుంచి కోదాడ వరకూ వెళ్లే ఈ దారిలో సరుకు తరలించే భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటిని డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ రోడ్డుపక్కనే నిలపడంతో... ఆగి ఉన్న వాహనాన్ని గుర్తించక ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. హైవే వెంట ఉన్న దాబాలు, హోటళ్లలో అక్రమ మద్యం విక్రయాలు సాగుతుండటంతో... కొందరు పూటుగా తాగి ప్రమాదాలకు కారణమవుతున్నారు. జడ్చర్ల- మహబూబ్‌నగర్, మరికల్- కృష్ణా మధ్య అసంపూర్తి రోడ్డు విస్తరణ పనులు, కొన్నిచోట్ల సూచిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలకు పరోక్ష కారణాలుగా నిలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

'జాతీయ రహదారి మార్గం వెంబడి మద్యం షాపులు ఉండటం.. పలు చోట్ల అక్రమంగా విక్రయించడంతో వాహనదారులు ఆగి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. బండి నడుపుతూ ఫోన్ మాట్లాడటం, అతి వేగం, మత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారు. వేగ నియంత్రణలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చౌరస్తాల వద్ద ఏర్పాటు చేయాలి. అదే విధంగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి మళ్లీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.' - స్థానికులు

చర్యలు తీసుకుంటాం

మరోవైపు NH167పై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించామని... అధికారులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తైన వెంటనే అవసరమైన చోట సూచిక బోర్డులు, పల్లెల నుంచి హైవేకు వచ్చే రహదారులపై వేగ నియంత్రికలు ఏర్పాటు చేస్తామని నేషనల్ హైవేస్ మహబూబ్‌నగర్ డీఈ రమేష్ వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి: sisters died in road accident: 'తప్పతాగాడు.. బండిపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లను గుద్ది చంపాడు..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.