ETV Bharat / crime

Telugu Akademi Case Mastermind: కమీషన్ ఆశజూపి.. కోట్లు కొల్లగొట్టాడు!

author img

By

Published : Oct 7, 2021, 9:59 AM IST

అతనో పట్టభద్రుడు.. మంచి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా జీవనం సాగించవచ్చు. కానీ.. కొన్నేళ్ల నుంచి మోసాలకు అలవాటు పడ్డాడు. మాస్టర్ మైండ్​తో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ప్రతీసారి దొరికిపోతున్నా... రోజుకో కొత్త మోసానికి తెర తీస్తున్నాడు. పన్నెండేళ్ల నుంచి కాజేసిన డబ్బుతో రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడులు పెట్టాడు. అది చాలదని తెలుగు అకాడమీ(Telugu Akademi Case)పై కన్నేశాడు. కమీషన్ ఇప్పిస్తానంటూ మేనేజర్లకు వల వేసి కోట్లు కాజేశాడు.

Telugu Akademi Case
Telugu Akademi Case

చుండూరి వెంకట కోటి సాయికుమార్‌ అలియాస్‌ సాయికుమార్‌. 49ఏళ్ల ఎంకామ్ పట్టభద్రుడు. ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లెక్కలు.. ప్రభుత్వ శాఖల్లో నిధులను బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయించడంలో దిట్ట. అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో నివాసముంటున్న సాయికుమార్‌ ఎంకామ్ తర్వాత ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అయ్యేందుకు ఐసీడబ్ల్యూఏ కూడా పూర్తి చేశాడు. దాంతో పెద్దగా ఆదాయం రాదని గ్రహించి బషీర్‌బాగ్‌లో ఓ కంప్యూటర్‌ సెంటర్‌ ప్రారంభించాడు. టీవీ ఛానెల్‌ ప్రారంభిచేందుకు సన్నాహాలు చేశాడు.

25 కోట్ల ఎఫ్డీ కేసులో..

పన్నెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన కొందరు వ్యక్తులు రమేశ్​ను కలిశాడు. వారు ఓ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 6 కోట్లు బదిలీ చేస్తామని, కమీషన్‌ రూ. కోటి ఇస్తామని వివరించగా సాయికుమార్‌ సరేనన్నాడు. సదరు వ్యక్తులు రూ. 6 కోట్లు జమచేయగా రూ.కోటి కమీషన్‌ తీసుకుని వారికి రూ. 5 కోట్లు ఇచ్చేశాడు. కొద్ది రోజులకు సీబీఐ అధికారులు సాయికుమార్‌ను అరెస్ట్‌ చేశారు. నార్తర్న్‌ కోల్డ్‌ ఫీల్డ్స్‌ చెన్నైకి చెందిన రూ. 25 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వ్యవహారంలో నిందితులకు సహకరించినందుకు అరెస్ట్‌ చేశామని చెప్పారు. కొద్దినెలలు జైల్లో ఉండి వచ్చిన సాయికుమార్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మోసాలపై దృష్టి కేంద్రీకరించాడు.

ఏపీ మైనార్టీ కార్పొరేషన్ ఎఫ్డీ మాయం కేసులో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మైనార్టీ కార్పొరేషన్‌.. పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుండేది. తొమ్మిదేళ్ల క్రితం మైనార్టీ కార్పొరేషన్‌ అధికారులను కలిసిన సాయికుమార్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే వడ్డీలు ఎక్కువగా వస్తాయని నమ్మించాడు. తన సహచరుడు నండూరు వెంకటరమణతో కలసి పథకం రచించాడు. విజయా బ్యాంక్‌ కోఠీ శాఖలో మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించాడు. ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అప్పటికే ఆ బ్యాంక్‌లో తప్పుడు పేర్లతో తెరిచిన పదిహేను ఖాతాల్లోకి మళ్లించి డబ్బులు తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయికుమార్​ను అరెస్ట్ చేశారు.

ఈసారి హౌసింగ్​బోర్డ్​ లక్ష్యంగా..

బెయిల్‌పై బయటకు వచ్చిన సాయికుమార్‌ ఈసారి ఏపీ హౌసింగ్‌బోర్డు, కాలుష్య నియంత్రణమండలిపై కన్నేశాడు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను గమనించాడు. ఆ రెండు సంస్థలతో సంబంధమున్న ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో పరిచయమున్న వ్యక్తిని ఆరేళ్ల క్రితం కలిశాడు. ఆయన అంగీకరించడంతో ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)లో మాజీ అధికారిని కలుసుకున్నాడు. అనంతరం హౌసింగ్‌బోర్డు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను వేర్వేరుగా కలుసుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయాన్ని వివరించాడు. వారు సరేననడంతో ఎస్‌బీహెచ్‌ మెహిదీపట్నం, సింగపూర్‌ టౌన్‌షిప్, మల్కాజిగిరి, ఖమ్మంలోని మరో బ్యాంక్‌లో ఎఫ్‌డీలను తెరిచాడు. కొద్దిరోజులకే వాటిని విత్‌డ్రా చేసుకున్నారు. సీబీఐ కేసు నమోదు చేసి ఐదేళ్ల క్రితం సాయికుమార్‌ను ముంబయిలో అరెస్ట్‌ చేసింది.

నేరుగా అకాడమీ ఏవోకే లంచం

ఏపీ హౌసింగ్‌ బోర్డు నిధులు స్వాహా చేసిన అనంతరం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిర్వహించిన సాయికుమార్‌ బృందం.. ఏడాది క్రితం తెలుగు అకాడమీ(Telugu Akademi Case) నిధుల గురించి తెలుసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతగా ఉండదని గ్రహించిన సాయికుమార్‌.. గతంలో తాను అమలు చేసిన ప్రణాళికను పరిస్థితులకు అనుగుణంగా మార్చాడు. ఈ సారి నేరుగా బ్యాంక్‌ మేనేజర్లను కలుసుకుని కమీషన్‌ ఇస్తానంటూ ప్రలోభపెట్టాడు. తెలుగు అకాడమీ(Telugu Akademi Case) ఏవోకూ రూ.కోట్లలో ఇస్తానని చెప్పాడు. దశలవారీగా రూ. 64.05 కోట్లు కొల్లగొట్టాడు. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో సాయికుమార్‌ రూ. 20 కోట్లు తీసుకున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. ఈ డబ్బు ఎలా ఖర్చుచేశాడు? ఏం చేశాడన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.