ETV Bharat / crime

స్విగ్గీ బ్యాగ్​లో గంజాయి.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్​..!

author img

By

Published : Apr 23, 2022, 8:25 PM IST

గంజాయి సరఫరా చేసే అక్రమార్కులు విభిన్న పద్ధతులు పాటిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు.. ఎవరూ ఊహించని విధంగా రవాణా చేస్తున్నారు. కార్లు, ఆటోలు, లారీలంటూ ఏ వాహనంలో తీసుకెళ్దామన్నా.. పోలీసులకు దొరికిపోతున్నామన్న ఉద్ధేశంతో ఈ సారి మరింత విభిన్నంగా ఆలోచించారు. ఏకంగా స్విగ్గి బ్యాగ్​లో గంజాయిని సరఫరా చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన.. హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది.

police found 6 kilos of ganza in swiggy bag and arrested two at jagadgirigutta
police found 6 kilos of ganza in swiggy bag and arrested two at jagadgirigutta

స్విగ్గీ బ్యాగ్​లో గంజాయి.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్​..!

హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదేవ్​పురం చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు పోలీసులను ఆశ్చర్యపరిచారు. స్విగ్గీ బ్యాగ్​లో గంజాయిని​ తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆహార పదార్థాలు డెలివరీ చేసే స్విగ్గి బ్యాగ్​లో గంజాయిని సరఫరా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదన్న నెపంతో ఈ దారి ఎంచుకోవటం.. ఎవ్వరికీ దొరకకుండా ఈ పద్ధతిలోనే సుమారు ఏడాదిగా గంజాయిని సరఫరా చేయటం.. అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

స్విగ్గీ బ్యాగును తగిలించుకుని డెలివరీ బాయ్స్​లా వెళ్తున్న యువకులపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయటంతో.. అసలు విషయం బయటపడిపోయింది. తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నానికి చెందిన వెంకట రమణ, విశాఖపట్నానికి చెందిన సాయి హరి నారాయణ అనే ఇద్దరు యువకులు.. ఏడాది పాటు స్విగ్గీ డెలివరీ బాయ్స్​గా పనిచేశారు. ఏడాది క్రితం ఆ పని మానేసి.. గంజాయి దందా మొదలుపెట్టారు. వైజాగ్​లోని ఏమిలి రమణ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తీసుకొస్తారు. కావాల్సిన వారికి గ్రాముల లెక్కన ఎవ్వరికీ అనుమానం రాకుండా.. స్విగ్గి బ్యాగులో తీసుకెళ్లి విక్రయిస్తారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా గంజాయి డెలివరీకి వెళ్తున్న ఆ యువకులను చూసిన పోలీసులు.. అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఉప్పల్​లో వాళ్లు నివాసముంటున్న ఇంట్లో తనిఖీలు చేశారు. మొత్తం 6 కిలోల గంజాయితో పాటు.. రెండు హుక్కాపాట్​లు, హుక్కా కాయిల్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను సుమారు ఏడాదిగా సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైజాగ్​కు చెందిన రమణ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇదే రోజు.. మరో గంజాయి సరఫరాదారున్ని పోలీసులు అరెస్టు చేసి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్​ జిల్లా గండిమైసమ్మకు చెందిన సునీల్ ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి గత కొంత కాలంగా గంజాయి దందా నడిపిస్తున్నాడు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. రైలులో జనరల్​ బోగీలో వెళ్లి వస్తూ.. తెచ్చిన గంజాయిని గ్రాముల లెక్కన అమ్ముతూ.. సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.