ETV Bharat / crime

విహార యాత్రల మాటున గంజాయి సరఫరా..

author img

By

Published : Oct 11, 2022, 10:30 PM IST

Youth transporting ganja in Telangana: అడుగడుగునా పోలీసుల నిఘా.. పట్టుబడితే జైలు ఊచలు లెక్కపెట్టిస్తారనే భయం..! ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నా.. కొందరు యువత మత్తుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. స్నేహితులతో కలిసి విహార యాత్రల పేరిట సొంతంగా గంజాయ్‌ యాత్రలకు సిద్ధమవుతున్నారు. గంజాయి సరఫరాదారులు, విక్రేతలపై నిఘా నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక​ కథనం.

Etv Bharat
Etv Bharat

Youth transporting ganja in Telangana: నగరంలో గంజాయి రవాణా, అమ్మకాలపై పోలీసులు పెద్దయెత్తున నిఘా పెట్టారు. పట్టుబడితే సరఫరదారుతో పాటూ వినియోగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సొంతంగా సరకు సమకూర్చుకునేందుకు ద్విచక్రవాహనాలపై ఏజెన్సీకి వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. అప్పటివరకూ సరఫరాచేసిన వ్యక్తుల లింకుల ద్వారా విశాఖకు చేరుకుంటున్నారు. అక్కడే రెండు మూడు రోజులు సరదాగా గడిపి సరకు సేకరించాక నగరానికి తిరుగుముఖం పడుతున్నారు. రెండు కిలోల్లోపు సరకు కొనుగోలు చేసి అడ్డదారుల్లో గుట్టుగా హైదరాబాద్‌ చేరుకుంటున్నారు.

హైదరాబాద్​లో కిలో గంజాయి రూ.40 వేలు: మార్గమధ్యంలో సరిహద్దులు, జాతీయ రహదారుల వెంబడి పోలీసుల తనిఖీలు ఎదురైనా ద్విచక్రవాహనం కాబట్టి సులువుగా అడ్డదారుల ద్వారా తప్పించుకుంటున్నారు. అవసరమైతే చిన్న మొత్తంలో ఉండే సరకును దూరంగా విసిరేసి ఏమీ తెలియనట్లుగా వచ్చేస్తున్నారు. వ్యసనపరులు ఏఓబీ నుంచి తెచ్చుకునే సరకును సొంత అవసరాలతో పాటు ఇతరులకు విక్రయించేందుకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో కిలో గంజాయి రూ.40 వేలకుపైనే పలుకుతోంది.

ఏఓబీ సరిహద్దుల్లో కిలో గంజాయి రూ.3 వేలు: గంజాయి గ్రాముల్లో కొనాలన్నా రూ.వేలల్లోనే ఉంటోంది. అదే ఏఓబీ సరిహద్దుల్లో కిలో రూ.3 వేలలోపు దొరుకుతుంది. దీంతో అక్కడ తక్కువ ధరకు కొని హైదరాబాద్‌కు తీసుకొచ్చాక తక్కువ పరిమాణంలో దగ్గర ఉంచుకుంటున్నారు. మిగతా సరకును ఐదారు రెట్లు ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. వచ్చిన డబ్బును జల్సాల కోసం ఖర్చు చేస్తున్నారు. అవసమరమైతే మరోసారి విశాఖకు వెళ్తున్నారు. తల్లిదండ్రులకు విహార యాత్రలకు వెళ్తున్నట్లు చెప్పి.. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి మీదుగా అక్కడి నుంచి ఏజెన్సీకి వెళ్తున్నారు.

గంజాయి రవాణా కేసులలో అమాయకులు బలి: సరకు తీసుకుని తిరుగుముఖం పట్టే సమయంలో దారి మారుస్తున్నారు. ఏవోబీ నుంచి భద్రాచలం ఏజెన్సీ మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. నిఘా తక్కువగా ఉండే మార్గాలను ఎంచుకొని గుట్టుగా నగరానికి చేరుకుంటున్నారు. అడ్డదారుల్లో గంజాయి తరలిస్తున్న వ్యవహారంలో కొన్నిసార్లు అమాయకులు బలవుతున్నారు. ఇటీవల రాచకొండ పోలీసులు 500 కిలోలకుపైగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్టు చేశారు. ముఠా ప్రధాన సూత్రధారి గంజాయి తరలింపునకు తన స్నేహితుడిని.. అతని వాహనాన్ని తీసుకొచ్చాడు.

మత్తు పేరుతో యువత చిత్తు: గంజాయి తరలిస్తున్నారనే విషయం స్నేహితుడికి తెలియదు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. మరో ఘటనలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనం మీద వెళ్తూ గంజాయి పొట్లాలతో పట్టుబడ్డారు. అలవాటు లేకున్నా గంజాయి తరలించిన నేపథ్యంలో వాహన యజమానిపైనా కేసు నమోదు చేశారు. వాహనాలు స్నేహితులకు ఇష్టానుసారంగా ఇస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత్తులో యువత చిత్తవుతున్నారని కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లలపైనా కాస్త నిఘా ఉంచాలని నిపుణులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.