ETV Bharat / crime

పబ్‌లో డ్రగ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

author img

By

Published : Apr 4, 2022, 5:27 AM IST

Updated : Apr 4, 2022, 6:38 AM IST

police Raids on Pub: బంజారాహిల్స్‌ పబ్‌ కేసులో పక్కా ప్రణాళిక ప్రకారమే డ్రగ్స్​ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామన్న పోలీసులు.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నమ్మకమైన వ్యక్తులనే పార్టీకి పిలిచి డ్రగ్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యాటకుల కోసం 24 గంటలపాటు మద్యం, ఆహార పదార్థాలు సరఫరా చేయాలనే నిబంధనను.. పబ్ సిబ్బంది దుర్వినియోగం చేశారన్నారు. పబ్‌లో ఉన్న 148 మంది వివరాలు తీసుకున్నామని వివరించారు.

drugs in hyderabad
drugs in hyderabad

పబ్‌లో డ్రగ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

police Raids on Pub: రాజధాని నడిబొడ్డున, ఐదు నక్షత్రాల హోటల్లోని పబ్‌లో మత్తుమందులు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. అనేకమంది ప్రముఖుల పిల్లలు పాల్గొన్న పార్టీలో మత్తుమందులు పట్టుబడటంపై దుమారం రేగుతోంది. బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడిలో ఈ మత్తు వ్యవహారం బయటపడింది. పార్టీలో పాల్గొన్న 148 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం వారిని వదిలేశారు. స్వాధీనం చేసుకున్న మత్తుమందులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు.

చాన్నాళ్లుగా ఈ పబ్‌లో రేవ్‌ పార్టీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నా స్థానిక పోలీసులు చూసీచూడనట్టు వదిలేయటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం రాత్రి డీజే జోరులో పార్టీ హోరెత్తిపోతోంది. అదే సమయంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట టాస్క్‌ఫోర్స్‌ విభాగాలకు చెందిన ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 100 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. మొదట కొందరు కానిస్టేబుళ్లను మఫ్టీలో లోపలికి పంపారు. అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాలు తీసుకొని పబ్‌లోకి వచ్చారు. వాటిని పొట్లాలుగా మార్చి చీకట్లోనే కొందరి చేతికిచ్చారు. అది ఇంకొందరి చేతులు మారింది. అప్పటికే అక్కడ మారువేషంలో ఉన్న పోలీసులు మత్తుమందు ఎవరెవరి చేతులు మారుతోందో గమనించారు. బయట కాపలా ఉన్న తోటి పోలీసులను అప్రమత్తం చేశారు. వారు లోపలికి ప్రవేశించటంతో మాదకద్రవ్యాల పొట్లాలు చేతిలో ఉన్న యువతీ, యువకులు ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలుపోక వాటిని కింద పారేశారు. వాటిలో పార్టీ డ్రగ్స్‌ (ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, ఎండీఎంఏ, హెరాయిన్‌) ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో లోపల ఉన్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన 148 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. వైద్య పరీక్షల కోసం వారి నుంచి ఎటువంటి నమూనాలు తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

ప్రముఖుల సంతానం: పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన వారిలో గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌, నటి నిహారిక తదితరులు ఉన్నారు. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కుమారుడు, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆమెను పోలీసులే తమ రక్షణలో బయటకు పంపినట్లు తెలిసింది. స్టేషన్‌లోకి మీడియాను అనుమతించలేదు. లోపల ఉన్నవారు మీడియా కంటబడతామనే ఉద్దేశంతో బయటకు వచ్చేందుకు నిరాకరించారు. నిజానికి చాలామంది పబ్‌లో జరిగే వారాంతపు పార్టీకనే వచ్చినా అక్కడ మత్తుమందులు దొరకడంతో ఆ సమయంలో ఉన్న అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరు మత్తుమందులు వాడారన్నది నిర్ధారణ కాలేదు. వాటిని సరఫరా చేసిన వారు దొరకడంతో ఎవరి కోసం తెచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

స్థానిక పోలీసులపై చర్య: ఆ పబ్‌లో సాయంత్రం నుంచే డీజే మోత, తెల్లవారుజాము వరకూ యువత హంగామా.. తరచూ రేవ్‌ పార్టీలు జరుగుతున్నట్టు స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనలు కూడా తెలిపారు. మత్తుమందుల కట్టడి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉన్నా బంజారాహిల్స్‌ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌ ద్వారా పబ్‌లో డెకాయి ఆపరేషన్‌ నిర్వహించడంతో గుట్టు రట్టయింది. ఒకవైపు మాదకద్రవ్యాలను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులు, ఆబ్కారీ శాఖలు ముమ్మరంగా దాడులు చేస్తున్నాయి. యంత్రాంగం ఇంత కఠినంగా ఉన్న సమయంలోనూ బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండటంపై నగర సీపీ సి.వి.ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్‌స్పెక్టర్‌ శివచంద్రను సస్పెండ్‌ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జిమెమో ఇచ్చారు.

ముగ్గురిపై కేసు నమోదు

ఈ పబ్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై మేనేజర్‌ మహదారం అనిల్‌కుమార్‌ (35), భాగస్వామి అభిషేక్‌ ఉప్పాల (35), అర్జున్‌ వీరమాచినేనిలపై కేసు నమోదు చేసి అనిల్‌కుమార్‌, అభిషేక్‌ను అరెస్ట్‌ చేశారు. అర్జున్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రవేశం ఆషామాషీ కాదు.. : ‘పోలీసుల తనిఖీలుండవు.. 24 గంటలు మద్యం లభ్యం. కావాలంటే మత్తుపదార్థాలు తెప్పిస్తాం..’ పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులు యువతను ఆకట్టుకునేందుకు చెప్పే మాటలివి. ఇందులోకి ప్రవేశం ఆషామాషీ వ్యవహారం కాదు. ముందుగా యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. పరిశీలించాక ఒక్కొక్కరికి ఒక్కో కోడ్‌ నంబరు కేటాయిస్తారు. అది నమోదు చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. మత్తుపదార్థాలు అవసరమైన వారి కోసం యాప్‌ రూపొందించారు. పబ్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ కనుసన్నల్లో దానిని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. పార్టీల్లో ఉపయోగించే ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్‌, ఎండీఎంఏ వంటివాటిలో ఏది కావాలి.. ఎంత మోతాదు కావాలనే వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ఫోన్‌ నంబర్లకు పంపిన ఓటీపీలను నిర్ధారించుకున్నాక మాదకద్రవ్యాలు అందజేస్తారని పోలీసులు గుర్తించారు.

ఆరా తీస్తున్నాం: రాష్ట్రంలో మత్తు పదార్థాలు అరికట్టాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పుడే కట్టడి చేయకపోతే ఈ మహమ్మారి చేయిదాటి పోతుంది. అందుకే హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సారథ్యంలో దాడులు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌, జోనల్‌ స్థాయిలో బృందాలు, డెకాయ్‌ ఆపరేషన్స్‌ చేస్తున్నాం. ఆదివారం తెల్లవారుజామున పుడింగ్‌ అండ్‌ మిక్‌ పబ్‌పై దాడులు చేశాం. రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌వారు 24 గంటలూ మద్యం విక్రయించేందుకని అనుమతి తీసుకున్నారు. అక్కడ టీ డిజైన్స్‌ అనే కంపెనీ పబ్‌ను ఏర్పాటు చేసింది. డీజే, డాన్స్‌ ఫ్లోర్‌, ఉదయం 4 గంటల వరకూ మద్యం, ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. మత్తుపదార్థాలు కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. 148 మందిని అదుపులోకి తీసుకున్నాం. వీరిలో 20 మంది పబ్‌ సిబ్బందే. 5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నాం. పబ్‌ ప్రవేశానికి నిర్దేశించిన యాప్‌లో ప్రస్తుతం 250 మంది నమోదై ఉన్నారు. దీనికి మాదక ద్రవ్యాలు ఎలా వస్తున్నాయి? ఎవరితో సంబంధాలున్నాయి.. ఎవరు తీసుకున్నారు.. అనే విషయాలపై ఆరా తీస్తున్నాం.

ఇవీచూడండి:

Last Updated : Apr 4, 2022, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.