ETV Bharat / crime

రూ.1200 కోట్ల కృత్రిమ నష్టాలు.. రాంకీలో ఐటీ శాఖ తనిఖీల్లో గుర్తింపు

author img

By

Published : Jul 10, 2021, 6:36 AM IST

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రాంకీ సంస్థలో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. అనధికారిక నగదు లావాదేవీలు నిర్వహించినట్లు దోషపూరిత పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు... వాటిని పరిశీలిస్తున్నారు. రూ.1200 కోట్లు మేర కృత్రిమ నష్టం చూపి, ఇందుకు చెందిన పన్ను ఎగవేతకు పాల్పడినట్లు బట్టబయలైంది. ఎగవేసిన పన్ను మొత్తం చెల్లించేందుకు రాంకీ సంస్థ యాజమాన్యం అంగీకరించినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

raids on ramki industries
raids on ramki industries

రాంకీ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగం, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన విభాగాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో స్థిరాస్తి వ్యాపారం హైదరాబాద్​లోనే నిర్వహిస్తుండగా మిగిలినవి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ చేస్తున్న వివిధ వ్యాపార లావాదేవీలకు చెందిన పన్ను చెల్లింపులు సక్రమంగా లేనట్లుగా గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ, ఈ నెల 6న హైదరాబాద్​లో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు ఇల్లు, అనుబంధ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసింది. మొత్తం 15 ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

తనిఖీల సందర్భంగా భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపన్నుశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పెద్ద మొత్తంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాంకీ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజార్టీ వాటాను విక్రయించి భారీ మొత్తం మూలధన లాభాలను ఆర్జించినట్టు ఐటీ శాఖ గుర్తించింది. అయితే మూలధన లాభాలకు బదులుగా నష్టాన్ని సృష్టించినట్లు పేర్కొంది. నష్టాలు చూపించిన మొత్తం దాదాపు రూ.1,200 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబందించి పన్ను విధించాల్సి ఉందని స్పష్టం చేసింది.

మరో రూ.288 కోట్ల అనధికారిక లావాదేవీలు జరిగినట్లు, ఇది లాభాలకు పూర్తి విరుద్ధంగా చూపిన మొత్తంగా తెలిపింది. ఇందుకు చెందిన దోషపూరిత పత్రాలను గుర్తించిది. ఇవి కాకుండా లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించింది. లెక్కించని ఆదాయం రూ.300 కోట్లుగా పేర్కొంది. ఈ అనధికారిక రూ.300 కోట్లతో పాటు, ఎగవేతకు పాల్పడిన పన్నును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించినట్లు ఐటీశాఖ వెల్లడించింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఇదీచూడండి: ఆన్​లైన్ గేమ్​ కోసం అమ్మ నగలనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.