ETV Bharat / crime

dating app fraud: డేటింగ్ యాప్ మోజులో కోటిన్నర పోగొట్టుకున్న 60ఏళ్ల వైద్యుడు

author img

By

Published : Jul 12, 2022, 12:51 PM IST

Updated : Jul 12, 2022, 4:43 PM IST

gigolo dating app
gigolo dating app

12:45 July 12

ఇదేందయ్యా ఇది.. మళ్లీ మోసపోయావా..?

హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీతో ఈటీవీ భారత్ ముఖాముఖి

డేటింగ్ యాప్ మోజులో ఓ వైద్యుడు దారుణంగా మోసపోయాడు. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలు పోగొట్టుకున్నాడు. జిగోలో డేటింగ్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న డాక్టర్.. ఆ యాప్‌లో డేటింగ్ చేసే యువతుల కోసం వెతికాడు. ఎట్టకేలకు ఓ యువతి యాక్సెప్ట్ చేసింది. ఆమె అమ్మాయని నమ్మి.. అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు.

మరోవైపు అమ్మాయి ముసుగులో చాట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. డాక్టర్ నుంచి విడతల వారీగా కోటిన్నర రూపాయలు కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. వైద్యుడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతణ్ని చూసి కంగుతిన్నారు. ఇంతకు ముందు ఇలాంటి కేసులోనే మోసపోయి తమ వద్దకు వస్తే కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. విద్యావంతులు.. ఉన్నత వృత్తుల్లో ఉన్న వాళ్లే ఇలా మోసపోతే నిరక్షరాస్యుల పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేశారు.

"గుజరాత్‌లో వైద్యుడిగా పని చేస్తున్న వ్యక్తి జిగోలో డేటింగ్‌ యాప్‌లో రిజిస్టర్ అయ్యాడు. మొదట క్లబ్‌ మెంబర్‌షిప్ పేరిట కొంత డబ్బు కట్టాడు. తర్వాత అమ్మాయిలను ఎంపిక చేసుకోవడానికి మరికొంత డబ్బు కట్టాడు. అలా ఓ అమ్మాయిని ఎంపిక చేసుకుంటే.. ఆమెను తన దగ్గరికి పంపిస్తామని యాప్ నిర్వాహకులు చెప్పడం.. అమ్మాయి కోసం ఈ డాక్టర్ డబ్బులు కట్టడం జరిగింది. ఫస్ట్ రూ.40 లక్షలు కట్టాడు. ఇంట్లో వాళ్లకి తెలిసి వాళ్లు డాక్టర్‌ని తీసుకొచ్చి మాకు ఫిర్యాదు చేశారు. మేం అతడికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చాం. అయినా అతడు తన అలవాటు మారలేదు. మరో రూ.30 లక్షలు ఇంకో అమ్మాయి కోసం బదిలీ చేశాడు. రూ.70 లక్షలకు సంబంధించి మేం ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేశాం. కానీ డాక్టర్, అరెస్టయిన వ్యక్తి లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నారు. డాక్టర్ అంతటితో ఆగలేదు. మళ్లీ రూ.80 లక్షలు డేటింగ్ యాప్‌లో పెట్టాడని అతడి కుటుంబ సభ్యులు మా వద్ద మౌఖికంగా ఫిర్యాదు చేశారు. రేపు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తామని చెప్పారు." - ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ

డేటింగ్ యాప్స్‌లో చాలా వరకు ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయని హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. చాలా డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిల ప్రొఫైల్స్‌తో అబ్బాయిలే అమ్మాయిల్లా మాట్లాడుతూ మాయ చేస్తున్నారని చెప్పారు. కొన్ని కేసుల్లో యాప్ నిర్వాహకులే ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేసి చీట్ చేస్తున్నారని తెలిపారు.

"డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిల ప్రొఫైల్స్ పెట్టి.. వారి ఫొటోలతో మాయ చేసి.. వారి కాంటాక్ట్ నంబర్ చూడాలన్నా.. వారి వివరాలు తెలుసుకోవాలన్నా.. చాట్ చేయాలన్నా.. రిజిస్ట్రేషన్ కోసం కొంత నగదు కట్టేలా ఆప్షన్స్ ఉంటున్నాయి.. వాటి కోసం చాలా మంది డబ్బు కడుతూ చివరకు మోసపోతున్నారు. డేటింగ్ యాప్స్‌కి సంబంధించి.. ఉత్తర భారత్‌లో ముఖ్యంగా పశ్చిమ బంగాలో కాల్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ కాల్ సెంటర్లలో మొత్తం అమ్మాయిలే పని చేస్తారు. అలా అమ్మాయిలతో ఫోన్‌లో మాట్లాడిచ్చి.. అబ్బాయిలను మోసగిస్తున్నారు." అని ఏసీపీ ప్రసాద్ అన్నారు.

Last Updated : Jul 12, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.