ETV Bharat / crime

Cyber crime: వలపు వల.. చిక్కారో జేబు గుల్ల

author img

By

Published : Jul 6, 2021, 8:21 PM IST

సైబర్‌ నేరగాళ్లు(cyber criminals) రోజుకోరకం మోసాలతో లూఠీ చేస్తున్నారు. తాజాగా నకిలీ అశ్లీల వీడియోలు... యువతుల స్వరంతో పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకొని... ఆపై అడిగినంత సొమ్ము ముట్టజెప్పాలని, లేకుంటే నగ్నంగా ఉన్న వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన కేటుగాళ్లు ఈ తరహా బెదిరింపులతో వేల మంది నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

cyber cheating
cyber cheating

అవధులు లేని శృంగారం... ఆనందం అంటూ వాట్సప్‌ కాల్స్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ తర్వాత వీడియోలు తీసి బెదిరిస్తున్న కేటుగాళ్ల గుట్టు(cyber gang) రట్టయింది. ఫేస్​బుక్‌ ద్వారా పరిచయం చేసుకొని అనంతరం వాట్సప్‌ వీడియోల్లో నగ్నంగా మాట్లాడుతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించి డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌ భరత్‌పూర్‌కు చెందిన ముఠా... ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు తేల్చారు.

అందంతో ఆకర్షిస్తూ.. కోట్లల్లో కాజేస్తూ..

అంతర్జాలంలో అశ్లీల వీడియోలను ఫోన్​లో డౌన్లోడ్‌ చేసుకొని... వాటికి వాయిస్‌ను మార్చి... మోసాలకు పాల్పడున్న సైబర్‌ కేటుగాళ్ల వివరాలు, సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. పదోతరగతి కూడా ఉత్తీర్ణులు కాని నేరగాళ్లు... వేల మందిని బెదిరించి రెండు నెలల్లో 25 కోట్ల రూపాయలకు పైగా దండుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేటుగాళ్ల ముఠా బాధితులు 18 రాష్ట్రాల్లో ఉన్నారంటే ఎంత మంది వీరి బారిన పడి ఉంటారో అర్థమవుతోంది. ఈ ముఠా కోసం ఇప్పటికే బెంగళూరు, ముంబయి, చెన్నై పోలీసులు గాలిస్తున్నారు. ముఠాలో 18 మందిని హైదరాబాద్‌ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు.

యువతే లక్ష్యంగా..

సామాజిక మాధ్యమాల ద్వారా మెట్రో నగరాల్లో ఉంటున్న యువకులను, వృత్తి నిపుణులను ఎంపిక చేసుకొని వల విసురుతున్నారు. ఒకటి రెండు రోజులు సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడి... అనంతరం వారి వాట్సప్‌ నంబర్లు తీసుకుంటున్నారు. వాట్సప్‌ కాల్‌ మొదలయిన వెంటనే దుస్తులను తొలగించి నగ్నంగా మారుతున్నారు. ఇదంతా సాంకేతిక మాయాజాలం. చరవాణిలో అప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న అశ్లీల వీడియోల్లో ఒకదానిని పంపుతున్నారు. పెదాల కదిలికలకు అనుగుణంగా వాయిస్‌ చేంజ్‌ యాప్‌ ద్వారా అమ్మాయిల్లా మాట్లాడుతున్నారు. ఒకటి రెండు రోజులు నగ్న వీడియోల ద్వారా మాట్లాడిన తర్వాత... మీరు కూడా నగ్నంగా మాట్లాడండి అంటూ కోరుతున్నారు.

ట్రాప్​లో పడిపోతున్నారు..

బాధితుడు వీడియో కాల్‌ మొదలుపెట్టగానే అవతలి నుంచి నిందితుడు మరో కెమారాతో బాధితుడి మాటలు, దృశ్యాలను రికార్డు చేస్తున్నాడు. వీడియోకాల్‌ పూర్తయిన అయిదు నిమిషాలకు... బాధితుడు మాట్లాడిన వీడియోను పంపి దీన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక పరువుపోతుందనే భయంతో డిమాండ్‌ చేసినంత ముట్టజెప్పుతున్నారు. ఇలాగే సికింద్రాబాద్‌లో నివసించే ఈవెంట్‌ మేనేజర్‌... సైబర్‌ నేరస్థుల వేధింపులు తాళలేక పది లక్షల రూపాయలు నగదు బదిలీ చేశాడు. పది రోజుల్లో వివాహముందని, పెళ్లి రోజు తన నగ్న వీడియోలను స్నేహితులు, భార్య, బంధువులు చూస్తే పరువు పోతుందన్న భయంతో 10 లక్షలు ముట్టజెప్పినట్లు బాధితుడు వాపోయాడు.

బంజారాహిల్స్​లో నివాసముంటున్న ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ కొద్దిరోజుల క్రితం నగ్నవీడియోల ద్వారా సంభాషించాడు. అతడికి సంబంధించిన నగ్నవీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామని రూ.20 లక్షలు ఇవ్వాలని సైబర్​ నేరగాడు బెదిరించాడు. ఇవ్వనని చెప్పడంతో... నగ్న వీడియోను అతడి స్నేహితుల చరవాణికి పంపించారు. భయపడిన అతడు రూ.15లక్షలు సమర్పించుకున్నాడు. ఈ విధంగా అనేక మందిని కేటుగాళ్ల చిక్కులో పడి లక్షలు ఇచ్చుకుంటున్నారు.

అప్రమత్తంగా ఉండండి

రాజస్థాన్‌ ముఠా ఆటకట్టించడానికి సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ తరహా నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: CYBER CRIME : కొవిడ్‌తో మరణించిన వ్యక్తి ఖాతా నుంచి నగదు మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.