ETV Bharat / crime

New Year Road accidents: ప్రమాదాలతో ప్రారంభమైన న్యూఇయర్​.. ఓ ఎస్సై సహా 12 మంది మృతి

author img

By

Published : Jan 1, 2022, 10:42 PM IST

New Year Road accidents: నూతన సంవత్సరం విషాదాలతో మొదలైంది. ఆనందంతో అడుగేసే సమయంలో.. ఆయువులు వాయువులో కలిపేసిన వార్తలు ఉలిక్కిపడేలా చేశాయి. రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 నెలల చిన్నారితో పాటు వారం రోజుల కిందే వివాహమైన ఎస్సై కూడా ఉన్నారు.

12 died on New Year Road accidents in telangana
12 died on New Year Road accidents in telangana

New Year Road accidents: కొత్త ఏడాది తొలి రోజున.. రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. నూతన సంవత్సరానికి ఆనందంలో ఆహ్వానం పలుకుతూ సంబురాలు జరుపుకునే వేళ ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలొదిలారు.

ఓడిబియ్యం పోసుకుని వస్తుండగా..

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వికారాబాద్​ వన్​టౌన్​ ఎస్సై శ్రీనుతో పాటు ఆయన తండ్రి మోతీరాం మృత్యువాత పడ్డారు. వికారాబాద్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీనుకు వారం క్రితమే (డిసెంబర్​ 26) వివాహం జరిగింది. ఈ క్రమంలో ఓడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్‌ (55)ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాడుగుల మండలం మాన్యానాయక్‌ తండాకు వెళ్లారు. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్‌ గ్రామ పరిధిలోకి రాగానే హైదరాబాద్‌ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సొంతంగా ఆటో నడుపుతున్న ఎస్సై శ్రీను, ఆయన తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నారు.

12 died on New Year Road accidents in telangana
వికారాబాద్​ వన్​టౌన్​ ఎస్సై శ్రీను నాయక్​

సంగారెడ్డి జిల్లాలోనే ఎనిమిది మంది..

సంగారెడ్డి జిల్లాలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న కారు.. బైక్​ను ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు(28), శ్రావణి(22) దంపతులు .. రెడిమేడ్​ దుస్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజూలాగే.. ఈరోజు కూడా దంపతులిద్దరు తమ కుమార్తె అమ్ములు(8 నెలలు)తో కలిసి ద్విచక్రవాహనం మీద వ్యాపారం చేసుకునేందుకు వెళ్తున్నారు. అదేసమయంలో.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్​కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25) కారులో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తుండగా.. ప్రమాదవశాత్తు బాలరాజ్​ బైక్​ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా.. బాలరాజు దంపతులు, కారులోని ఫరీద్​ అక్కడికక్కడే మృతి చెందారు.

12 died on New Year Road accidents in telangana
డిడ్గీ ప్రమాదానికి కారణమైన కారు..

పటాన్​చెరు జాతీయ రహదారిపై ఇద్దరు..

పటాన్​చెరు జాతీయ రహదారిపై డివైడర్​ను ఢీకొట్టి కారు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. టోలిచౌక్​ నుంచి.. సంగారెడ్డి జంజం దాబాకు వెళ్తుండగా.. పటాన్​చెరు పట్టణ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో బషీర్​ ఖాద్రి అనే యువకుడు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. అదే జాతీయ రహదారిపై... సంగారెడ్డికి వెళ్తున్న సాయికృష్ణ అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి.. ద్విచక్రవాహనం పై నుంచి పడి మరణించాడు. రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి.. శంకరపల్లి మండలం మోకిలా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

నాగర్​ కర్నూల్​ జిల్లాలో నలుగురు..

నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లికి చెందిన మల్లయ్య(50) భార్య రేణమ్మ(40), తమ్ముడు బాలస్వామితో కలిసి ద్విచక్రవాహనంపై నాగర్​కర్నూల్​లోని బంధువు ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటికి తిరుగు ప్రయాణం కాగా.. రాకొండ వద్ద ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి, రేణమ్మ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. మహబూబ్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వదిన, మరిది ఇద్దరు చనిపోవడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వీరిద్దరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వెల్దండ వద్ద కారు, బైకు ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి తండాకు చెందిన రమావత్‌ ఉదయ్‌(14), ముడావత్‌ మహేశ్‌‍‌(19) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.