ETV Bharat / city

గుప్పుమంటున్న గుట్కా.. గుట్టుగా సాగుతున్న దందా

author img

By

Published : Jun 10, 2021, 12:11 PM IST

గుట్కా ఉత్పత్తులపై రాష్ట్రంలో నిషేధం ఉన్నా... కొంతమంది వ్యాపారులు పోలీసుల కన్నుగప్పి విక్రయాలు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని గోదాముల్లో పలు బ్రాండ్ల పేరుతో గుట్కాలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్​తో పాటు... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గుట్కాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు.

tobacco illegal business in hyderabad
tobacco illegal business in hyderabad

నగరంలో గుప్పుమంటున్న గుట్కా.. గుట్టుగా విక్రయాలు

నోటి, గొంతు క్యాన్సర్‌కు కారణమవుతున్న గుట్కాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. గుట్కాలను ఉత్పత్తి చేయడం, విక్రయించడం రాష్ట్రంలో నిషేధం. కానీ పొగాకు అలవాటు పడిన వాళ్లు... మానలేక బానిసలవుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు గుట్కాలను విక్రయిస్తున్నారు. ఏ కిరాణ షాపులో చూసినా... ఏ పాన్ డబ్బాలోకి తొంగి చూసినా గుట్కా ప్యాకెట్‌లు దర్శనమిస్తాయి. నిషేధం పేరు చెప్పి వ్యాపారులు గుట్కా ప్యాకెట్‌లను అధిక ధరకు విక్రయిస్తున్నారు. గుట్కాలపై నిషేధం ఉన్నా పాన్ మసాల పేరుతో గుట్కాలను విక్రయిస్తున్నారు. పోలీసులు సరఫరా, ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించారు. కానీ విక్రయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. అడపదడపా పోలీసులు దాడులు చేస్తున్నా... వాళ్ల కన్నుగప్పి కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలలో విక్రయాలు చేస్తున్నారు.


హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గుట్కా ఉత్పత్తి కేంద్రాలను గుట్టుగా నడిపిస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ గోదాముల్లో గుట్కాలను ఉత్పత్తి చేస్తున్నారు. ముడి సరకును దిగుమతి చేసుకొని వాటిని యంత్రాల సాయంతో గుట్కాలుగా మారుస్తున్నారు. కొన్ని బ్రాండ్ల పేరుతో ప్యాకెట్‌లలో నింపి మార్కెట్ లో గుట్టుగా సరఫరా చేస్తున్నారు. బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌ ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ వ్యాన్‌ను పోలీసులు జప్తు చేశారు. అందులో 25లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీదర్ నుంచి అక్రమంగా వీటిని తీసుకొస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలాపూర్ పీఎస్​ పరిధిలోని మల్లాపూర్‌లో గుట్కా తయారీ స్థావరంపై ఐదు నెలల క్రితం ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఒకరిని అరెస్టు చేసి 45 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ముడిసరకు, తయారీ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లతీఫ్ అనే వ్యక్తి గుట్కా గోదాంను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లతీఫ్‌ను బాలాపూర్ పోలీసులు గుట్కా విక్రయ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా... బెయిల్‌పై బయటికి వచ్చి మరోసారి గుట్కా వ్యాపారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.


లంగర్‌హౌజ్‌ బాపునగర్‌లో ఓ ఇంట్లో దాడి చేసిన పోలీసులు... 35 లక్షల విలువ చేసే గుట్కాలు జప్తు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. చంద్రాయణ గుట్ట ఫూల్‌ బాగ్‌, భవానీనగర్‌ పీఎస్​ పరిధిలోని ఫతేషానగర్‌లో 10లక్షల విలువ చేసే గుట్కాలు, పాన్ మసాలాలను పోలీసులు స్వాధీన చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. బోరబండలో ఎల్కే ట్రేడర్స్‌పై దాడి చేసి 10.7 లక్షల విలువ చేసే గుట్సా స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. చిలకలగూడలో ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసి 3.65 లక్షల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని పలు దుకాణాల్లో దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2 లక్షల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు జప్తు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: Accident: భయంకరమైన ప్రమాదం.. చెట్టుపైన మృతదేహం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.