ETV Bharat / city

ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు.. చాలా భయంగా ఉంది: ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులు

author img

By

Published : Feb 24, 2022, 5:41 PM IST

Telugu Student On Ukraine : రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.

Ukrainetelugu student on ukraine crisis
telugu student on ukraine crisis

Telugu Student On Ukraine :అత్యవసరం అయితే తప్ప తమను బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారని.. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్' తో అక్కడి పరిస్థితులను వివరించారు. రాజధాని కీవ్‌ వైపు మాత్రం ప్రయాణాలు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారన్నారు. 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇంట్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారన్నారు.

"మా యూనివర్సిటీలో సుమారు 500 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు అయ్యాయి. భారత రాయబార కార్యాలయ అధికారులు మాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులందరినీ తరలిస్తామని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్టు ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడి రావాలని భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు చాలామంది స్వదేశానికి బయల్దేరుతున్నారు. మార్చి 10 వరకు ఉన్న టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి" అని లక్ష్మీ శ్రీలేఖ వివరించారు.

ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదు..

ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదని విశాఖకు చెందిన మరో తెలుగు విద్యార్థిని శ్రీజ వెల్లడించారు. కీవ్ ప్రాంతానికి 500 కి.మీ. దూరంలో ఉన్నామని ఇక్కడ చాలా భయనక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తాము బుక్ చేసుకున్న చార్టర్ విమానాలను రద్దు చేసినట్లు శ్రీజ వెల్లడించారు.

"కీవ్ ప్రాంతానికి 500 కి.మీ. దూరంలో ఉన్నాం. కావాల్సిన సామాన్లు కొనుక్కుని తెచ్చుకున్నాం. అత్యవసరమైతే మెట్రో అండర్‌గ్రౌండ్‌కు తీసుకెళ్తామన్నారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మమ్మల్ని తీసుకెళ్లాలి. కీవ్ విమానాశ్రయానికి వెళ్లినవారు తిరిగివస్తున్నారు. కీవ్‌ సమీప ప్రాంతాల్లో చాలా భయంగా ఉంది. మేం బుక్ చేసుకున్న చార్టర్డ్ విమానాలు రద్దు చేశారు. ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదు."

-శ్రీజ, తెలుగు విద్యార్థిని

ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు.. చాలా భయంగా ఉంది: ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.