ETV Bharat / city

ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్

author img

By

Published : Mar 14, 2022, 9:18 PM IST

Updated : Mar 15, 2022, 6:34 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని.. రాష్ట్ర రాజధాని ఎక్కడికీ తరలిపోయే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై యుద్ధం కొనసాగుతుందన్న జనసేనాని.. 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా ఇప్పటంలో ఘనంగా జరిగింది. ఈ బహిరంగ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన పవన్.. ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

pawan kalyan
pawan kalyan

జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సభావేదికపై.. అధికార వైకాపా తీరుపై నిప్పులు కురిపించారు పవన్. ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాను గద్దె దించి తీరుతామన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలో జనసేన విజయం సాధిస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పవన్​ ధీమా వ్యక్తం చేశారు. జనసైనికులపై వైకాపా చేసే దాడులను వెన్ను చూపేది లేదన్న పవన్.. వైకాపా మహిషానికి మొలిచిన కొమ్ములు విరగ్గొట్టి.. గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం భాజపా నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తానన్నారని, దానికోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు. వైకాపా వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదన్న జనసేనాని.. ప్రజా ప్రయోజనాల కోసం పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తామన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్​ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.

అశుభంతో వైకాపా పాలన ఆరంభం..

వైకాపా 151 సీట్లు గెలిచినపుడు బాగా పాలిస్తారనే తానూ ఎదురుచూశానని, కానీ.. ప్రజాకాంక్షకు వ్యతిరేక పాలన ఏపీలో కొనసాగుతోందని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన ప్రారంభించిందన్నారు. వైకాపా తీసుకొచ్చిన ఇసుక విధానంతో 30 లక్షల మంది రోడ్డునపడ్డారని, 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు ఇంత విధ్వంసపూరిత ఆలోచనా విధానం ఏంటని ప్రశ్నించారు. వైకాపా నేతలు ఏమని ప్రతిజ్ఞ చేసి.. అధికారం చేపట్టారని నిలదీశారు. ఏపీ ప్రజలు తమ బానిసలని ప్రతిజ్ఞ చేశారా? ప్రజల నడ్డి విరగ్గొడతామని ప్రతిజ్ఞ చేశారా? ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఆంధ్రను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారా? అని పవన్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను లెక్కచేయబోమని ప్రతిజ్ఞ చేశారా? రోడ్లను గుంతలు గుంతలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారా? అని నిలదీశారు. వైకాపా నేతలంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్‌కల్యాణ్‌.. వైకాపా విధానాలపైనే తాను విమర్శలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​ సుభిక్షంగా ఉంటే తాను మాట్లాడేవాడిని కాదన్నారు.

రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాక రాజధాని ఎలా మారుస్తారు..?

ఏపీ రాజధాని అమరావతిపైనా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు పవన్. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని పవన్‌ అన్నారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాక ఎవడబ్బ సొమ్మని రాజధాని మారుస్తారని పవన్ నిలదీశారు. సీఎం మారినప్పుడల్లా రాజధానులు మారవని తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం చట్టం చేసినా అది కొనసాగుతుందన్న పవన్.. సీఎంలు మారినప్పుడల్లా విధానాలు మారవన్నారు. రాజధానులకు భూములివ్వని రైతులకు తాను ఆరోజు మద్దతిచ్చానని పవన్‌ చెప్పారు. మరి, రైతులు ఒప్పందం చేసుకున్నప్పుడు వైకాపా నేతలు గాడిదలు కాశారా? అని నిలదీశారు. రాజధానికి 32 వేల ఎకరాలు సరిపోవని నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ అన్నారన్న పవన్‌.. మరి, ఆనాడే 3 రాజధానులు చేస్తామని వైకాపా నేతలు ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు.

ఏపీ ఆదాయం రూ.1.17 లక్షల కోట్లు.. ఆ డబ్బంతా ఎటు పోతోంది?

ఏపీలో ఆదాయం భారీగా వస్తున్నప్పటికీ.. దుర్వినియోగమే ఎక్కువగా అవుతోందని జనసేనాని ఆరోపించారు. పార్టీ ప్రకటనల కోసమే రూ.400 కోట్లు వృథా చేశారని వైకాపాపై ధ్వజమెత్తారు. పార్టీ రంగులు వేసుకునేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ వృథా ఖర్చు బదులు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చు కదా? అంటూ ప్రశ్నిించారు. దుబారా చేయడానికి డబ్బులు ఉంటాయిగానీ.. ఉద్యోగుల జీతాలకు మాత్రం డబ్బులు ఉండవా? అని నిలదీశారు. రాష్ట్ర ఆదాయం ఎటు పోతుందో అడిగేవారు లేరన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పులున్నయని చెబుతున్నారన్న పవన్‌కల్యాణ్‌.. అప్పులు తీర్చే మార్గాలను వెతకాలని సూచించారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంటే ఎలా? అని నిలదీశారు. రూ.లక్ష కోట్ల ఆదాయం సద్వినియోగం చేయకపోతే.. ప్రభుత్వంలో లోపమున్నట్లేనని తేల్చి చెప్పారు. ఈ విషయాలు ప్రశ్నిస్తే.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. చివరకు పోలీసులు కూడా భయపడే స్థాయికి వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువగా మాట్లాడితే వీఆర్‌కు పంపుతున్నారని, ఇప్పటి వరకు ఎందరు అధికారులను వీఆర్‌లో పెట్టారో లెక్కలేదన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన వైకాపా.. ఆ తర్వాత ఉద్యోగులకు మొండిచేయి చూపిందని మండిపడ్డారు.

ఏపీని సుసంపన్నం చేసేందుకు షణ్ముఖ వ్యూహం..

ఆవిర్భావ సభ వేదికగా.. జనసేన భవిష్యత్ ప్రణాళికలను పవన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని, ఉంటుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుల్లో కూరుకున్న ఏపీని సంపన్న రాష్ట్రంగా మార్చాలన్నదే జనసేన లక్ష్యమని చెప్పారు. బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తెస్తామన్నారు. పెట్టుబడులు తరలివచ్చే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్న పవన్‌.. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రకటించారు. జనసేన సౌభాగ్య పథకం కింద యువతకు సాయం చేస్తామని, ఐదేళ్లలో 5 లక్షల మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పవన్‌ ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మారుస్తామని, పంట కాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రతి పోస్టునూ భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడడమే జనసేన లక్ష్యమన్నారు. ఉద్యోగులకు వేతన సవరణ చేపడతామన్న పవన్‌కల్యాణ్‌.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సీపీఎస్‌ ఖచ్చితంగా రద్దు చేస్తాని స్పష్టంగా చెప్పారు.

జనసేనకు గత పునాది లేదు..

ఒక పార్టీని నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలని, బలమైన సిద్ధాంతాన్ని పట్టుకున్న లక్షల మంది ఉండాలని పవన్‌ అన్నారు. వైకాపా, తెదేపాకు బలమైన పునాదులున్నాయని పవన్‌కల్యాణ్‌ గుర్తు చేశారు. కానీ.. జనసేనలో సీనియర్‌ నాయకులు ఎవరూ లేరన్నారు. జనసైనికులు, తాను మాత్రమే ఉన్నామని చెప్పారు. అయినా.. అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నామన్నారు. 2019 ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించామన్న పవన్‌కల్యాణ్‌.. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున 1,209 మంది సర్పంచులు గెలిచారని చెప్పారు. తద్వారా.. 7 నుంచి 27 శాతానికి జనసేన ఓట్లు పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో.. అధికారం సాధించే స్థాయికి జనసేన చేరుతుందని పవన్‌కల్యాణ్​ ధీమావ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనే నేతల వ్యక్తిత్వం బయటపడుతుందన్న పవన్‌.. ఇచ్చిన మాటపై నిబద్ధత కలిగి ఉండటం నాయకత్వ లక్షణమన్నారు. ఆ లక్షణంతోనే ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.

సుదీర్ఘ నమస్కారాలు..

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత పవన్ సుదీర్ఘంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు, అన్ని వర్గాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేశారు. తమ పార్టీ నేతలు శ్రేణులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చివరకు తన సంస్కారం.. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా నేతలకూ నమస్కారాలు తెలియజేస్తోందని పవన్​ అన్నారు.

సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం పంచాయతీకి విరాళం..

జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చి, తమ పార్టీపై ప్రేమచూపిన ఇప్పటం ప్రజలకు కృతజ్ఞతగా గ్రామానికి రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నట్టు పవన్ ప్రకటించారు. రైతు పెద్దల ద్వారా గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తానని పవన్‌ వెల్లడించారు.

ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్
Last Updated : Mar 15, 2022, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.