ETV Bharat / city

Sabitha Indra Reddy : 'పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయండి'

author img

By

Published : Feb 16, 2022, 8:21 PM IST

Sabitha Indra Reddy : చదువు పూర్తయ్యాక ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న విశ్వాసం విద్యార్థుల్లో పెరిగేలా విశ్వవిద్యాలయాల్లో బోధన జరగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Sabitha
Sabitha

Sabitha Indra Reddy : విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కోసం శిక్షణ కోసం యూనివర్సిటీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. త్వరలో పోటీ పరీక్షల నోటిఫికేషన్లు రానున్నందున విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేయాలని.. దానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే కేటాయిస్తుందని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

లక్ష్యసాధన కోసం విద్యార్థుల్లో సంకల్పాన్ని కల్పించడంతో పాటు.. ఆ దిశలో అడ్డంకులను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను గుర్తించాలని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరిశ్రమలు, పరిశోధన సంస్థలతో యూనివర్సిటీలు నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాలన్నారు.

పరిశోధనలే యూనివర్సిటీలకు ప్రామాణికంగా ఉంటాయని.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలోనూ దోహద పడతాయని మంత్రి అన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. విశ్వవిద్యాలయాల భూములు కబ్జా కాకుండా వీసీలు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. సమావేశంలో సీఎస్ సోమేశ్​ కుమార్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : KCR Birth Celebrations: కేసీఆర్​ ముందస్తు జన్మదిన వేడుకలు.. రక్తదానం చేసిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.