ETV Bharat / city

కాళేశ్వరం పైపులైన్‌ పనుల కోసం చట్ట సవరణ!

author img

By

Published : Sep 13, 2020, 2:19 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో తలనొప్పిగా మారిన భూసేకరణ అంశాన్ని ఎలాగైనా ప్రభుత్వం సులభతరం చేసుకోవాలని చూస్తోంది. భూసేకరణతో పనిలేకుండా, భూమిలోపల పైపులైన్‌ వేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలాగైతే... పనులు జరిగినన్ని రోజులకు పంట పరిహారాన్ని సంబంధిత రైతులకు చెల్లించవచ్చని ఆలోచిస్తున్నారు.

kaleshwaram project act amendment for land acquisition
kaleshwaram project act amendment for land acquisition

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టే పనులకు భూసేకరణతో పనిలేకుండా, భూమిలోపల పైపులైన్‌ వేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని గృహ, పారిశ్రామిక అవసరాల కోసం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పనుల కోసం భూసేకరణతో పనిలేకుండా భూమి లోపల పైపులైన్‌ వేసేలా 2015లో ప్రభుత్వం ఓ చట్టం చేసింది. ప్రస్తుతం దీన్ని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు అన్వయించేలా చట్టంలో మార్పు చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీరామ్​సాగర్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లాలోని ఆయకట్టుకు నీరు సరఫరా చేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి మళ్లించే మూడో టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు పైపులైన్‌ ద్వారా తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తయిన పనుల్లో ఎక్కువ భాగం సొరంగ మార్గాలు, కాలువలు ఉన్నాయి. వీటి కోసం భారీగా భూసేకరణ చేయాల్సి వచ్చింది.

‘ఇకపై జరిగే పనులకు భూసేకరణతో పనిలేకుండా భూమి లోపలే పైపులైన్‌ వేయాలనేది సర్కారు ఆలోచన. అందులో భాగంగా రెండు మీటర్ల లోతున గొట్టాలు అమరుస్తారు. అందుకోసం జరిగే తవ్వకాలు, వాటిని పూడ్చడానికి పట్టే కాలాన్ని బట్టి సంబంధిత రైతులకు ఒకటి లేదా రెండు పంటలకు పరిహారం చెల్లిస్తారు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.