ETV Bharat / city

6నెలల్లో 50వేల ఉద్యోగాలు.. ఖాళీల భర్తీకి సన్నాహాలు

author img

By

Published : Dec 15, 2020, 7:03 AM IST

Updated : Dec 15, 2020, 8:51 AM IST

రాష్ట్రంలో తలపెట్టిన 50 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.  నియామకాల పర్యవేక్షణకు సర్కారు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగ బాధ్యతలను  ఆర్థికశాఖ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ ఎన్‌.శివశంకర్‌కు అప్పగించింది. ఆర్థికశాఖలోని ఉప కార్యదర్శి ఆయనకు సహాయకునిగా ఉంటారని పేర్కొంది.

job vacancies in telangana are filled from time to time
తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు ఎప్పటికప్పుడే భర్తీ

ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ), పోలీసు నియామకాల సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థ, వైద్యఆరోగ్య నియామక సంస్థలకు భాగస్వామ్యం కల్పించనుంది. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం నెలనెలా ఉద్యోగ నియామకాల క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టిసారించింది.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసులా..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు ప్రతి నెలా క్యాలెండర్‌ను విడుదల చేస్తోంది. ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి.. వాటిని భర్తీ చేస్తోంది. రాష్ట్రంలోనూ ఈ విధానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తాజా నియామక ప్రక్రియలను ఒకేసారి పూర్తి చేసి.. ఆపై నెలనెలా ఖాళీలను భర్తీ చేయనుంది.

సన్నాహాలు షురూ

ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో నియామకాలను వెంటనే చేపట్టాలని నిర్ణయించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేయగా....దీనికి అనుగుణంగా నియామకాలపై సన్నాహాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ దీనిపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు.

నిర్ణీత కాలపరిమితి

గతంలో ఉద్యోగ నియామకాలకు కాలపరిమితి లేదు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో కేసులు పడితే అవి పరిష్కారమయ్యే వరకు నియామకాలు పూర్తికావడం లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఉద్యోగ నియామకాలకు నిర్ణీత కాలపరిమితిని విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరు నెలల్లోపు ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వరకు ప్రభుత్వం గడువు నిర్దేశిస్తుంది.

అన్ని సంస్థలకు అవకాశం

ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ద్వారా భారీగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఒకేసారి 50 వేల పోస్టులను భర్తీ చేయడం దీనికి సాధ్యం కాదనే ఉద్దేశంతో మిగిలిన నియామక సంస్థలకూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించనున్నారు. పోలీసు నియామకాలన్నీ మొదటి నుంచి ఆ శాఖకు సంబంధించిన సంస్థ ద్వారానే జరుగుతున్నాయి. గురుకులాలు, వైద్యఆరోగ్యం తదితర సంస్థల ఉద్యోగాలను సంబంధిత సంస్థలు చేపడతాయి.

పొరుగు సేవల్లోనే ఆ పోస్టులు

కొత్తగా చేపట్టనున్న నియామక ప్రక్రియలో అటెండర్‌, వాచ్‌మెన్‌, స్వీపర్‌ తదితర ఉద్యోగాలుండవు. ఈ పోస్టులను పొరుగు సేవల ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిర్ణయంపై నిబంధన

నియామక పరీక్షలు రాసే అభ్యర్థులు వేర్వేరు ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. దేనిలో చేరాలనే దానిపై వారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏదేని ఉద్యోగంలో చేరితే మిగిలిన సంస్థలకు ఆ సమాచారం ఇవ్వడం లేదు. దీని వల్ల ఆయా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇకపై ఉద్యోగానికి ఎంపికైన వారు సత్వరమే ఎందులో చేరేది నిర్ణయం తీసుకోవాలనే నిబంధనను ప్రభుత్వం చేర్చనుంది. సదరు అభ్యర్థి ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగిలిన వాటిని వదిలివేసినట్లు సమాచారం ఇవ్వాలి. దీని వల్ల ప్రతిభ ఆధారంగా మిగిలిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తుంది.

ఒకే పరీక్ష

కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తోంది. ఒక పరీక్ష రాస్తే ఈ సంస్థల పరిధిలోని ఉద్యోగాలకు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రంలోనూ ఇంజినీరింగ్‌ సహా ఒకే కేటగిరికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈ విధానం అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది.

సత్వరమే సమాచారమివ్వాలి : సీఎస్‌

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై అన్ని శాఖలు సత్వరమే సమాచారం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన వాటి వివరాలను నిర్ణీత నమూనాలో అందజేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉద్యోగ నియామకాలపై సీఎస్‌ సోమవారం బీఆర్‌కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఖాళీల వివరాలను వెంటనే అందజేయాలని, దీనికి అనుగుణంగా అన్నిశాఖలు త్వరితగతిన సమాచారం ఇవ్వాలన్నారు. అవసరమైన మార్పులు, సంస్కరణలను తీసుకురావడం ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ నమూనాలో సమాచారం పంపండి

మొత్తం ఖాళీలు, మంజూరైన ఉద్యోగుల సంఖ్య, ప్రత్యక్ష నియామకాలకు నిర్దేశించినవి, ఇందులో నియమితులైన వారు, కొత్తగా నియమితులు కావాల్సిన వారి వివరాలతో సమాచారం ఇవ్వాలంటూ ప్రభుత్వం సోమవారం అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

- శాఖాధిపతులకు ప్రభుత్వ ఉత్తర్వులు

జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శాఖల కార్యదర్శులు శాఖాధిపతుల నుంచి సమాచారం కోరారు. శాఖాధిపతులు దీనిపై జిల్లా కలెక్టర్ల నుంచి ఖాళీల వివరాలు పంపించాలని లేఖలు పంపించారు. రెవెన్యూ శాఖ పరిధిలోని నాయబ్‌ తహసీల్దార్లు, సీనియర్‌ స్టెనో, జూనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ స్టెనో, టైపిస్ట్‌ డ్రైవర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌ల సమాచారాన్ని కలెక్టర్ల నుంచి కోరింది.

కార్పొరేషన్లు, సొసైటీల ఖాళీల వివరాలివ్వాలి

తెలంగాణలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలలోని ఖాళీల వివరాలు సైతం మాతృశాఖలే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిని కార్పొరేషన్లు, సొసైటీలకు వదిలివేయరాదంది.

Last Updated : Dec 15, 2020, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.