ETV Bharat / city

'కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఇదే చివరి అవకాశం'

author img

By

Published : Jul 20, 2020, 2:47 PM IST

Updated : Jul 20, 2020, 7:58 PM IST

ప్రభుత్వం నిద్రపోతోంది, ప్రజలను గాలి వదిలేసింది: హైకోర్టు
ప్రభుత్వం నిద్రపోతోంది, ప్రజలను గాలి వదిలేసింది: హైకోర్టు

14:45 July 20

'కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం'

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం.. కరోనాపై దాఖలైన 12 పిటిషన్లను కలిపి సోమవారం విచారణ చేపట్టింది.  కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. హైదరాబాదులో వేల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారని.. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ విస్తరించిందని పేర్కొంది.  దిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మూడు నెలలుగా పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ..  సర్కారు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏజీని ప్రశ్నించింది.  

ఏజీ క్షమాపణ..

ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ వైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అభినందించినట్టు అధికారులు పేర్కొనడంపై ఏజీ క్షమాపణ కోరారు.

చివరి అవకాశం..  

కరోనా విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి చివరి అవకాశమిచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని సర్కారుకు హితవు పలికింది.  

ఆస్పత్రుల వారీగా అందుబాటులో ఉన్న పడకల వివరాలు వెల్లడించాలి. ర్యాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే వివరాలు వెల్లడించాలి. ఫిర్యాదుల కోసం ఏర్పాటైన వాట్సప్ నంబర్‌ విస్తృత ప్రచారం చేయాలి. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలి. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలి. కరోనా నియంత్రణ.. ప్రభుత్వం, అధికారుల రాజ్యాంగబద్ధమైన విధి. ప్రభుత్వం, అధికారులు రాజ్యాంగ బాధ్యతలు విస్మరించవద్దు - హైకోర్టు

28న విచారణకు..

ఈనెల 28న సీఎస్, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, పీహెచ్ డైరెక్టర్, డీఎంఈ  విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. బులెటిన్లలో సమగ్ర వివరాలు ఉండాలని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్లు జిల్లాల వారీగా కరోనా కేసులు వెల్లడించాలిని పేర్కొంది. ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు కూడా వెల్లడించాలని కోర్టు తెలిపింది. వైద్యారోగ్య శాఖ వెబ్‌సైట్ పునరుద్ధరించాలని ఆదేశించింది.

Last Updated : Jul 20, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.