ETV Bharat / city

ఎన్‌కౌంటర్‌పై జస్టిస్​ వీఎస్​ సిర్పుర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ

author img

By

Published : Dec 12, 2019, 11:20 AM IST

Updated : Dec 12, 2019, 1:52 PM IST

disha-accused-encouter-case-in-supreme-court
ఎన్‌కౌంటర్‌పై జస్టిస్​ వీఎస్​ సిర్పుర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ

11:15 December 12

ఎన్‌కౌంటర్‌పై జస్టిస్​ వీఎస్​ సిర్పుర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ

      దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్​ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు.హైదరాబాద్‌లో సరైన చోట ఉండి దర్యాప్తు చేయాలని కమిటీని ఆదేశించింది. తొలి విచారణ తేదీ దర్యాప్తు కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారి ఇష్టమని సుప్రీం పేర్కొంది. 

6 నెలల్లో నివేదిక అందించాలి

    తొలి విచారణ తేదీ నుంచి 6 నెలల్లో సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలని సుప్రీంకోర్టు కమిటీకి తెలిపింది. ఈ కేసులో మీడియా, సామాజికమాధ్యమాలపై కట్టడి  విధించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై ఉన్న ఇతర దర్యాప్తులపై స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర విచారణలు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల భద్రత, విచారణకు కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. విచారణ కమిషన్ సభ్యుల భద్రత సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించింది. తుది తీర్పు వచ్చేవరకు మీడియా నియంత్రణ పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. 
 

రాష్ట్ర సర్కారు తరఫున ముకుల్​ రోహత్గి వాదనలు 

    ఉదయం ఈ కేసుపై విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్ తీరు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని పిటిషనర్ జీఎస్ మణి పేర్కొనగా... మీరెందుకు పిటిషన్ వేశారని సీజేఐ ప్రశ్నించారు. అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదని సీజే జస్టిస్ బోబ్డే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.  ఎన్‌కౌంటర్ జరిగిన తీరును కోర్టుకు వివరించారు. ఇద్దరు నిందితులు పోలీసుల పిస్టళ్లను తీసుకుని కాల్పులు జరిపారని... పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని ముకుల్​రోహత్గి కోర్టుకు వివరించారు. ఎన్‌కౌంటర్‌పై పోలీసు ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తున్నామని ఆయన తెలిపారు.

సిట్​ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాం
 

        ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపించాలని అనుకుంటున్నామని... పరిష్కారం తీసుకొచ్చే దర్యాప్తు కావాలని సీజేఐ పేర్కొన్నారు. సిట్ ఏర్పాటు చేసి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేస్తున్నామని... దర్యాప్తునకు తాము వ్యతిరేకం కాదని ముకుల్​ రోహత్గి న్యాయస్థానానికి వివరించారు. దానికి సమాంతరంగా విశ్రాంత న్యాయమూర్తి దర్యాప్తు ఎందుకని అడిగారు. ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా తీసుకొని కేసు విచారణ చేస్తోందని తెలిపారు. 

       ఇరువురి వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ వీఎస్​ సిర్పుర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని నియమిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చూడండి: కాలిన మృతదేహం దిశదే..!

  
 

           

Last Updated : Dec 12, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.