ETV Bharat / city

CM KCR Comments: 'ఏ అధికారంతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తారు..'

author img

By

Published : Feb 1, 2022, 7:54 PM IST

CM KCR Comments: కేంద్ర బడ్జెట్​పై సీఎం కేసీఆర్​ తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత్‌కు కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జల విధానాల వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. భారత్‌ పురోభివృద్ధి సాధించాలంటే భాజపాను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

CM KCR Comments on union budget
CM KCR Comments on union budget

CM KCR Comments: కేంద్ర బడ్జెట్​పై స్పందించిన సీఎం కేసీఆర్​.. నదుల అనునంధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్​లో ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉందని ఉద్ఘాటించారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. ప్రజలకు సాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం విధానాల వల్లే దేశంలో నీటి గొడవలు జరగుతున్నాయని పేర్కొన్నారు.

"నదులు అనుసంధానం చేస్తామనడం పెద్ద జోక్‌. గోదావరి, కృష్ణా నదులను ఎలా అనుసంధానం చేస్తారు..? గోదావరి, కృష్ణా, కావేరి అనుసందానం చేస్తారని ఏ అధికారంతో చెప్పారు..? గోదావరి జలాల విషయమై ట్రైబ్యునల్‌లో కేసు ఉంది. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉంది. మాకు హక్కు ఉన్న జలాలను కావేరిలో ఎలా కలుపుతారు..? అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్‌లో ఎలా ప్రకటిస్తారు..? కేంద్రం నిధులు ఇవ్వకున్నా ప్రజలకు సాగునీరు అందిస్తున్నాం. రాష్ట్రంలో పండించిన పంటలను కొనుగోలు చేయట్లేదు. దేశంలో 65 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. 35 వేల టీఎంసీలు మాత్రమే వినియోగంలోకి తెచ్చారు. కేంద్ర విధానాల వల్లే భారత్‌లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర జల విధానాల వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. జల్‌శక్తి మిషన్‌కు రూ.60 వేల కోట్లని గొప్పలు చెబుతున్నారు. 140 కోట్ల దేశ జనాభాకు రూ.60 వేల కోట్లా..? కేవలం తెలంగాణలోనే మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లు కేటాయించాం. జల్‌శక్తి మిషన్‌ పేరిట మోసం చేస్తున్నారు." - సీఎం కేసీఆర్​

మోదీ.. కురచ బుద్ధి ఉన్న ప్రధాని..

దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఎలాంటి చర్యలు తీసుకోవాట్లేదని సీఎం కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనం వెనక్కి తెచ్చి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని.. అలాంటి వాళ్లందరినీ దేశం దాటించారని ఆరోపించారు. భారత్‌కు కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారని దుయ్యబట్టారు. భారత్​ పురోభివృద్ధి సాధించాలంటే.. భాజపాను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

"గజదొంగలు, బ్యాంకులను ముంచినవాళ్లు విదేశాలకు వెళ్లారు. బ్లాక్‌ మనీ ఉన్నవాళ్లను బయటకు పంపిన ఘనులు మీరు. నల్లధనం వెనక్కి తెచ్చి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. దేశంలో 15 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. భారత్‌ పురోభివృద్ధి సాధించాలంటే భాజపాను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలపాలి. భారత్‌కు కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారు. దేశ ప్రయోజనాలకు కోసం అవసరమైతే ఉద్యమిస్తాం. కోర్టు బయట వివాదాల పరిష్కారాలను ప్రపంచం అవలంబిస్తోంది. కోర్టు బయట వివాదాల పరిష్కారాల కోసమే లోకాయుక్త ఏర్పాటు చేశాం. వివాదాల పరిష్కారానికి దేశంలో ఆర్బిట్రేషన్‌ కేంద్రాలు లేవు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి నిధులు కేటాయిస్తున్నాం. ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని సీజేఐ చెప్పారు. దేశంలో క్రిప్టో కరెన్సీని మీరు అనుమతిస్తున్నారా..? క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్నులను ఎలా ప్రకటించారు..?" - సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.