ETV Bharat / business

ఉద్యోగులకు TCS బంపర్​ ఆఫర్​.. తొలగించకుండా సూపర్​ ట్రైనింగ్​ ఇస్తుందట!

author img

By

Published : Feb 20, 2023, 6:59 AM IST

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజం టీసీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సంస్థ నుంచి ఉద్యోగుల్ని తొలగించబోమని టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉద్యోగుల్ని నియమించుకునేటప్పుడే వారు సుదీర్ఘకాలం పనిచేసేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

tcs employees
టీసీఎస్ కంపెనీ

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి సంస్థలు సహా పలు టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ దేశీయ టెక్కీ దిగ్గజం టీసీఎస్‌ మాత్రం శుభవార్త చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల్ని తొలగించబోమని టీసీఎస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉద్యోగుల్ని నియమించుకునేటప్పుడే వారు సుదీర్ఘకాలం పనిచేసేలా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. చాలా కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నందున ఇప్పుడు తొలగించాల్సి వస్తోందని టీసీఎస్‌ ప్రతినిధి తెలిపారు.

టీసీఎస్‌ మాత్రం ఒకసారి కంపెనీలోకి ప్రవేశించిన ఉద్యోగులకు నైపుణ్యాలు అందించి సమర్థులుగా మార్చే బాధ్యత తీసుకుంటుందని టీసీఎస్​ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపిన ఆయన వారికి గత సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా వేతన పెంపులు ఉంటాయని తెలిపారు. అంకుర సంస్థలు తొలగించిన ఉద్యోగులను నియమించుకునే ఆలోచన ఉన్నట్లు టీసీఎస్‌ ప్రతినిధి వెల్లడించారు.

డెల్ ఉద్యోగులకూ షాక్..​
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్​ సంస్థ కూడా ఇటీవల ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొద్ది రోజులు క్రితం ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5 శాతం అని కంపెనీ కో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ తెలిపారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​లోనూ..
సాఫ్ట్​వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్​ కూడా కొద్ది రోజుల క్రితం 600 ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలో ఫెయిలైనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది 2022 జులైలో నియమితులైనవారేనని తెలిపింది. ఉద్వాసనకు గురైన 600 మందిలో 280 మంది 2 వారాల క్రితం తొలగింపునకు గురైనట్లు వెల్లడించింది.

ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్​లోనూ..
ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ కూడా ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నష్టాల కారణంగా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఫిలిప్స్‌ వెల్లడించింది. 3 నెలల క్రితమే ఆ సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. తాజాగా 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.