ETV Bharat / business

ఆ రాష్ట్రం నుంచి 'ఫాక్స్​కాన్' ఔట్! ఏ ప్రభావం ఉండదన్న మంత్రి.. కాంగ్రెస్ ఫైర్!

author img

By

Published : Jul 11, 2023, 9:18 AM IST

Foxconn Vedanta deal : దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థ వేదాంతాతో కలిసి గుజరాత్​లో ఏర్పాటు చేయాలనుకున్న సెమీ కండక్టర్ ప్లాంట్ జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్​కాన్ వైదొలిగింది. ఇందుకు కారణాలు వెల్లడించింది. ఈ పరిణామం భారత సెమీ కండక్టర్ లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ మాత్రం సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడింది. గుజరాత్ ఎన్నికల సమయంలో ఫాక్స్​కాన్ పెట్టుబడుల గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసింది.

foxconn vedanta deal cancelled
foxconn vedanta deal cancelled

Foxconn Vedanta deal : దేశీయ వ్యాపార దిగ్గజం వేదాంతాతో కలిసి ఏర్పాటు చేయాలనుకున్న సెమీ కండక్టర్ ప్లాంట్ జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నట్లు ఫాక్స్​కాన్ ప్రకటించింది. ఆ ప్లాంట్​తో తమకు ఎలాంటి సంబంధమూ ఉండబోదని, ఇక నుంచి సెమీ కండక్టర్ ప్లాంట్ పూర్తిగా వేదాంతాదేనని స్పష్టం చేసింది. గుజరాత్​లో ఒకటిన్నర లక్షల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్, డిస్​ప్లే తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఫాక్స్​కాన్, వేదాంతా గతేడాది ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇతర పెట్టుబడి అవకాశాలు ఉండడంతో జాయింట్ వెంచర్ విషయంలో.. వేదాంతాతో కలిసి ముందుకెళ్లకూడదని నిర్ణయించినట్లు ఫాక్స్ కాన్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియాకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపింది. ఫాక్స్​కాన్ వైదొలగడంపై స్పందించిన వేదాంతా సంస్థ సెమీకండక్టర్ ప్రాజెక్ట్​కు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. భారత తొలి సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఇతర భాగస్వాములతో కలిసి ముందుకెళ్లనున్నట్లు పేర్కొంది.

Foxconn Vedanta deal cancelled : అయితే, ఫాక్స్​కాన్ నిర్ణయంతో భారత సెమీ కండక్టర్ లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రెండు ప్రైవేటు కంపెనీల మధ్య జరిగే పరిణామాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు. ఫాక్స్​కాన్, వేదాంతాలు భారత్​లో వేర్వేరుగా తమ లక్ష్యాల సాధనకు కృషి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు సంస్థలు కూడా విలువైన పెట్టుబడిదారులని గుర్తు చేశారు. భారత్​లో ఈ రెండు కంపెనీలకు పెద్ద ఇన్వెస్ట్​మెంట్ ప్రాజెక్ట్​లు ఉన్నాయని తెలిపారు.

Foxconn Vedanta Gujarat : వేదాంతాతో సంయుక్తంగా చేపట్టిన సెమీ కండక్టర్ ప్లాంట్ నుంచి ఫాక్స్​కాన్ వైదొలిగిన వేళ భాజపా లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. గుజరాత్ మోడల్ లేదా న్యూ ఇండియా తయారు చేసిన హెడ్ లైన్స్ ను విశ్వసించవద్దని సూచించింది. ఈ ప్రాజెక్టు ప్రకటన సమయంలో భాజపా ప్రభుత్వం చేసిన ప్రచారం గుర్తుందా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. వేదాంతా, ఫాక్స్ కాన్ పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు వస్తాయని గుజరాత్ సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. వైబ్రెంట్ గుజరాత్ సదసుల్లో చేసుకున్న అనేక ఒప్పందాల భవితవ్యం కూడా ఇదేదని జోస్యం చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం గ్రోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో కుదుర్చుకున్న MOUల పరిస్థితి కూడా అంతేనని జైరాం రమేశ్ విమర్శించారు. అమెరికా సంస్థ మైక్రాన్ 2.75 బిలియన్ డాలర్లతో సెమికండక్టర్ రంగంలో పెట్టుబడికి ముందుకొచ్చినా అందులో ఆ సంస్థ వాటా కేవలం 20 శాతమేనని జైరాం రమేశ్ మరో ట్వీట్ చేశారు. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం 50, 20 శాతం చొప్పున ప్రోత్సాహకాల రూపంలో మైక్రాన్ కు ఇవ్వనున్నాయని తెలిపారు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఒక అమెరికన్ కంపెనీకి ఇది భారీ రాయితీయేనని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.