ETV Bharat / business

ఫెడ్‌ వడ్డీ రేటు 0.75% పెంపు.. 28 ఏళ్ల తర్వాత ఇంతలా ఇప్పుడే!

author img

By

Published : Jun 16, 2022, 8:25 AM IST

Fed Interest Rates Hike: అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ బ్యాంక్.. వడ్డీ రేటును 0.75 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజా పెంపుతో ప్రామాణిక ఫెడరల్​ ఫండ్​ రేట్లు 1.5%-1.75% శ్రేణికి చేరాయి. 2020 మార్చిలో ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి.

Fed Interest Rates Hike
Fed Interest Rates Hike

Fed Interest Rates Hike: కీలక వడ్డీ రేటును 0.75 శాతం పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం ప్రకటించింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణం మేలో 41 ఏళ్ల గరిష్ఠమైన 8.6 శాతానికి చేరడంతో, అదుపు చేసేందుకు ఫెడ్‌ రేట్ల పెంపునకు మొగ్గు చూపింది. తాజా పెంపుతో ప్రామాణిక ఫెడరల్‌ ఫండ్‌ రేట్లు 1.5%-1.75% శ్రేణికి చేరాయి. 2020 మార్చిలో కొవిడ్‌ మహమ్మారి ప్రారంభానికి ముందు ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి.

2022కు అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలను ఫెడ్‌ తగ్గించింది. 2.8 శాతం వృద్ధి లభిస్తుందని మార్చిలో అంచనా వేయగా.. తాజాగా 1.7 శాతానికి పరిమితం చేసింది. అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ ఆశావహంగానే ఉన్నట్లు కమిటీ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, ఉద్యోగ విపణి బాగుందని, నిరుద్యోగ రేటు తక్కువగానే ఉన్నట్లు వివరించింది. 75 బేసిస్‌ పాయింట్ల పెంపునకు కన్సాస్‌ సిటీ ఫెడ్‌ అధ్యక్షుడు ఎస్తేర్‌ జార్జ్‌ మినహా ఎఫ్‌ఓఎంసీ సభ్యులందరూ అంగీకరించారు. జార్జ్‌ అరశాతం పెంపునకు మొగ్గుచూపారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఈ పెంపుదలను ఊహించినందున, ఇప్పటికే ఆ ప్రభావం పడింది.

ఇవీ చదవండి: పోటీతత్వ సూచీలో భారత్‌ ముందుకు.. ర్యాంక్ ఎంతంటే?

5G స్పెక్ట్రం వేలానికి కేబినెట్​ ఓకే​.. అందుబాటులోకి వస్తే 10 రెట్ల వేగంతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.