ETV Bharat / business

సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

author img

By

Published : Jun 3, 2022, 12:06 PM IST

అవసరానికి డబ్బు కావాలంటే అప్పు చేస్తాం.. కొన్నిసార్లు ఒకటికి మించి రుణాలు తీసుకోవడం సహజమే. ఇంటిరుణం.. వాహన, వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాలు ఉన్నవారూ ఉంటారు. వీటికి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడం కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన పని కావచ్చు. అందుకే, రుణాలను నిర్వహించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం..

Entire Income go to the EMIs? Follow these precautions Pay installments like this?
Entire Income go to the EMIs? Follow these precautions Pay installments like this?

ఆదాయానికి మించి అప్పులుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మీకు వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి రుణ వాయిదాలకు వెళ్లకూడదు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి.. రూ.30వేల ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి 40 శాతం మేరకు ఈఎంఐలు చెల్లిస్తే.. మిగతా రూ.18వేలతో కుటుంబాన్ని నెట్టుకురాగలడా? బాధ్యతలు అధికంగా ఉంటే ఎంత కష్టమో కదా.. అదే రూ.2లక్షల వేతనం ఉన్న వ్యక్తి.. రూ.లక్ష రుణ వాయిదాలకు చెల్లించినా.. మిగిలిన డబ్బును ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. కాబట్టి, ఆదాయం ఎంతుందో చూసుకొని, అప్పుడే ఈఎంఐలు ఎంత మేరకు ఉంటే ఇబ్బంది లేదో చూసుకోవాలి.

అప్పులు తొందరగా తీర్చాలంటే.. మీ ఖర్చులకు కళ్లెం పడాల్సిందే. మీ నెలవారీ బడ్జెట్‌ను సిద్ధం చేయండి. అందులో ఖర్చులకు ప్రాధాన్యతా క్రమాన్ని ఇవ్వండి. తప్పనిసరి చెల్లించాల్సిన బిల్లులు, ఫీజులు, అనవసరమైన ఖర్చులు వేర్వేరుగా రాయండి. ముందుగా అవసరమైన వ్యయాలకు డబ్బు కేటాయించండి. వృథా వ్యయాల జోలికి అస్సలు వెళ్లకండి. ఇలా ఆదా చేసిన డబ్బును రుణాల చెల్లింపు కోసం వినియోగించండి.

అధిక రుణాలు ఉన్నప్పుడు వాటికి ఈఎంఐ చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. వాటికి ఉండే వడ్డీ రేటులోనూ తేడాలుంటాయి. రెండు మూడు ఈఎంఐలు ఉన్నప్పుడు మన ఆర్థిక శక్తి సన్నగిల్లుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వ్యక్తిగత, వాహన, కార్డు రుణాలన్నింటినీ కలిపి ఒకే రుణంగా మార్చే ప్రయత్నం చేయొచ్చు. గృహరుణానికి టాపప్‌లోన్‌ తీసుకోవడంలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. రుణాన్ని చెల్లించేందుకు వ్యవధీ దొరుకుతుంది.

ఒక్క రుణ వాయిదా సకాలంలో చెల్లించకపోయినా.. క్రెడిట్‌ స్కోరుపై ఆ ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి, వాయిదాలను వ్యవధిలోపే చెల్లించేందుకు ప్రయత్నించాలి. ఉన్న అప్పును తీర్చేందుకు కొత్త రుణాన్ని తీసుకోవద్దు. దీనివల్ల క్రమంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు.
ఆదాయం వృద్ధి చెందినప్పుడు.. అవసరమైన వస్తువులకు బదులు విలాసవంతమైనవి కొనేందుకు చూస్తుంటారు. ఇది పొరపాటు. ఉన్న అప్పులను వదిలించుకోవడంపైనే దృష్టి పెట్టాలి. పెరిగిన ఆదాయంలో కొంత భాగాన్ని అప్పులను తీర్చేందుకు వినియోగించాలి.

అధిక వడ్డీ ఉన్న అప్పులు, స్వల్పకాలిక రుణాలను తొందరగా తీర్చేయాలి. దీనికి తగిన ప్రణాళిక రచించుకోవాలి. తక్కువ వడ్డీ, దీర్ఘకాలిక వ్యవధి ఉండే గృహరుణాల్లాంటివి తీర్చేందుకు తొందరపడొద్దు. వ్యవధికి ముందే అధిక వడ్డీ అప్పులను తీర్చడం వల్ల మీపై భారం తగ్గుతుంది.

ఇవీ చూడండి: సామాన్యులకు కేంద్రం షాక్​.. గ్యాస్‌ సబ్సిడీకి మంగళం

పెరిగిన సిమెంట్​ ధరలు.. సామాన్యులకు మరింత భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.