ETV Bharat / business

రేట్లు తగ్గించలేదు కానీ.. పలు కీలక చర్యలు

author img

By

Published : Aug 7, 2020, 7:05 AM IST

ఆర్‌బీఐ ఈ సారి కీలక రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.. కరోనా నేపథ్యంలో పలు ఉపశమన చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థల రుణ పునర్నిర్మాణానికి అవకాశం కల్పించింది. గృహ రుణాలు, వ్యవసాయ రుణాలు పెరిగేందుకు దోహదం చేసేలా నాబార్డ్‌, ఎన్‌హెచ్‌బీలకు భారీ రుణ సదుపాయాన్ని కల్పించింది. బంగారంపై మరింత రుణం వచ్చేలా పరిమితిని పెంచింది.

RBI Strikes The Right Balance
రేట్లు తగ్గించలేదు కానీ

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 115 బేసిస్‌ పాయింట్లు.. అంతక్రితం ఏడాది 135 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించిన ఆర్‌బీఐ గురువారం ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో రేట్లలో మార్పులు చేయలేదు. అయితే వృద్ధికి ఊతం అవసరమయ్యేంత వరకు సర్దుబాటు ధోరణి విధానాన్ని కొనసాగించడానికి కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించడం విశేషం.

రుణ పునర్నిర్మాణాలు..

  1. కార్పొరేట్‌, రిటైల్‌ రుణ స్వీకర్తలకు ఆర్‌బీఐ భారీ ఊరటనిచ్చింది. కరోనా వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్న వీరికి వన్‌టైం రుణ పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మార్చి 1, 2020 నాటికి 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్‌ కాని కంపెనీల రుణాల పునర్నిర్మాణానికి బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. రెండేళ్ల పాటు రుణాల కొనసాగింపునకూ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం బ్యాంకులు కొన్ని కేటాయింపులను పక్కకు పెట్టాల్సి వస్తుంది.
  2. కరోనా ప్రభావం పడ్డ చిన్న, మధ్య తరహా కంపెనీ(ఎస్‌ఎమ్‌ఈ)ల రుణాల పునర్నిర్మాణానికి ప్రత్యేక గవాక్షం ఉంటుందని స్పష్టం చేసింది. 2020లో ఏ సమయంలోనైనా పరిష్కార ప్రణాళికను మొదలుపెట్టవచ్చని.. మొదలుపెట్టిన 180 రోజుల్లోగా అమలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.
  3. కార్పొరేట్‌ బ్రిక్స్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ కేవీ కామత్‌ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
  4. ప్రాధాన్య రంగ రుణాల(పీఎస్‌ఎల్‌) పరిధిని పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అందులోకి అంకురాలను చేర్చింది. పునరుత్పాదక ఇంధన రంగాలకు రుణ పరిమితిని సైతం పెంచింది.

గృహ రుణాలు, చిన్న రుణాలకు ఊతం

చిన్న రుణాలిచ్చేవారు, గృహ రుణ కంపెనీలకు సహాయం చేయడం కోసం నాబార్డ్‌, ఎన్‌హెచ్‌బీలకు అదనపు ప్రత్యేక ద్రవ్యలభ్యత సదుపాయం (ఏఎస్‌ఎల్‌ఎఫ్‌) కింద రూ.5,000 కోట్ల చొప్పున మొత్తం రూ.10,000 కోట్లను ప్రకటించింది. రెపో రేటు వద్దే వీటికి ఈ రుణాలు లభిస్తాయని దాస్‌ తెలిపారు.

వృద్ధిపై అంచనాలు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ప్రతికూలంలోకి వెళ్లవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. రెండో త్రైమాసికం నుంచి దేశీయ గిరాకీ పెరగవచ్చని తయారీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అంతక్రితం సర్వేతో పోలిస్తే జులైలో వినియోగదార్ల విశ్వాసం మరింత తగ్గిందని దాస్‌ అన్నారు.

ప్రధానాంశాలు:

  • రెపో రేటు, రివర్స్‌ రెపో రేటులలో మార్పు లేదు. అవి వరుసగా 4%, 3.35 శాతం వద్ధే
  • బంగారం విలువలో రుణ పరిమతి 75 శాతం నుంచి 90 శాతానికి పెంపు
  • 2020-21 రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నా. ద్వితీయార్థంలో కాస్త కిందకు దిగివచ్చే అవకాశాలున్నాయని- ఖరీఫ్‌ దిగుబడి కారణంగా గ్రామీణ గిరాకీ పెరగవచ్చని అంచనా వేసింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ప్రతికూలంగానే ఉండొచ్ఛు
  • ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల ఖాతాలు ప్రామాణిక వర్గీకరణ కింద ఉంటే రుణ పునర్నిర్మాణానికి అర్హత ఉంటుంది.
  • కార్పొరేట్‌, వ్యక్తిగత రుణాల పునర్నిర్మాణానికి సైతం బ్యాంకులు అనుమతించవచ్ఛు సరికొత్త పరిష్కార గవాక్షాన్ని ఇందుకు ఆర్‌బీఐ ఏర్పాటు చేయనుంది.
  • ప్రాధాన్య రంగ రుణాల(పీఎస్‌ఎల్‌) జాబితాలోకి అంకురాలను చేర్చారు.
  • ఆఫ్‌లైన్‌ పద్ధతిలో చిన్న విలువ చెల్లింపులకు పైలట్‌ పథకం ఏర్పాటుకు అనుమతి.
  • గృహ రంగంలో ద్రవ్యలభ్యత పెంచడం కోసం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) రూ.5,000 కోట్ల అదనపు ద్రవ్యలభ్యత అందివ్వనుంది.
  • వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు నాబార్డ్‌ సైతం రూ.5000 కోట్ల ద్రవ్యమద్దతు అందివ్వనుంది.
  • పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతంగా(+ లేదా -2) నిర్ణయించింది.
  • ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలుపెట్టినా.. కరోనా వ్యాప్తి పెరగడం, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో వెనకడుగు వేసింది.

ఇదీ చదవండి: పెట్రోల్​ బంకుల ఏర్పాటుకు అదానీ-టోటల్ యత్నాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.