ETV Bharat / business

'స్వాతంత్య్రం తర్వాత ఇదే దారుణమైన మాంద్యం'

author img

By

Published : May 27, 2020, 5:55 AM IST

కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యంత దారుణమైన మాంద్యంలోకి జారుకుంటున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. భారత్ ఇప్పటి వరకు (ప్రస్తుతంతో కలిపి) నాలుగు సార్లు మాంద్యాన్ని ఎదుర్కొనగా ఇదే అత్యంత పెద్దదని అభిప్రాయపడింది.

corona crisis on Indian Economy
కరోనాతో భారత్​కు గడ్డుపరిస్థితులు

కరోనా లాక్​డౌన్​తో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. భారత్​లో స్వాతంత్ర్యం అనంతరం (ప్రస్తుతంతో కలిపి) నాలుగు సార్లు మాంద్యం వచ్చిందని.. వాటన్నింటిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలిపింది.

లాక్​డౌన్​ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశార్థికం 5 శాతం మేర క్షీణించే ప్రమాదముందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ రేటు 25 శాతం తగ్గొచ్చని పేర్కొంది.

వాస్తవికంగా జీడీపీలో 10 శాతం శాశ్వతంగా కోల్పోయిన కారణంగా.. వృద్ధి రేటుపై ఇంతకుముందు పెట్టుకున్న అంచనాలను చేరుకోవడం అసాధ్యమని పేర్కొంది.

ఈ సారి మాంద్యం భిన్నం..

గడిచిన 69 ఏళ్లలో భారత్​ 3 సార్లు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 1958,1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం ఈ మూడు సార్లు ఒకే విధంగా ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్​ 2020 నుంచి మార్చి 2021) లో వచ్చిన ఆర్థిక మాంద్యం పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నట్లు అభిప్రాయపడింది.

ఈ సారి మాంద్యం వచ్చినప్పటికీ వ్యవసాయంపై అంత ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. రుతుపవనాలు సరైన సమయానికి రానున్నాయనే వార్తలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

కరోనా ప్యాకేజీతో..

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉపశమన ప్యాకేజీ స్వల్పకాలికంగా ఉపయోగపడే ఉద్దీపన మాత్రమేనని క్రిసిల్ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:మారటోరియంలోనూ వడ్డీపై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.