ETV Bharat / business

Air India CEO: ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్‌

author img

By

Published : Feb 15, 2022, 5:08 AM IST

Air India CEO: టాటాసన్స్​ ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓను నియమించింది. గతంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు ఛైర్మన్​గా సేవలందించిన ఇల్కర్​ ఐసీకి ఈ సీఈఓ, ఎండీ బాధ్యతలను అప్పగించింది. ఎయిర్​ ఇండియాను నవ శకం దిశగా నడిపించేందుకు టాటా గ్రూపులోకి ఇల్కర్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు టాటా సన్స్​ ఛైర్మన్​ చంద్రశేఖరన్.

Airindia New CEO
ఎయిర్​ఇండియా కొత్త సీఈఓ

Air India CEO: టాటాల చేతికి ఎయిర్​ ఇండియా వచ్చాక ఆ సంస్థకు కొత్త సీఈవో ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఐసీని కొత్త ఎండీ, సీఈవోగా టాటాసన్స్‌ నియమించింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ అలెక్స్‌ క్రూజ్‌ వంటి వారిపేర్లు కూడా వినిపించినప్పటికీ చివరకు ఇల్కర్‌ను కొత్త సీఈవోగా నియమిస్తూ టాటా సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇల్కర్‌ నియామకంపై ప్రకటన చేసిన సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. ఆయన్ను విమాన పరిశ్రమకు సారథిగా అభివర్ణించారు. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ను విజయవంతంగా నడిపించారని ప్రశంసించారు. ఎయిర్​ ఇండియాను నవ శకం దిశగా నడిపించేందుకు టాటా గ్రూపులోకి ఇల్కర్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

1971లో ఇస్తాంబుల్‌లో జన్మించిన ఇల్కర్‌ ఐసీ గతంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకముందు ఆ సంస్థ బోర్డులోనూ ఉన్నారు. 1994లో బిల్కెంట్‌ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పూర్వ విద్యార్థి అయిన ఇల్కర్‌.. యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో రీసెర్చర్‌గానూ పనిచేశారు. అలాగే, మర్మారా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపైనా మాస్టర్స్‌ చేశారు. ఎయిర్​ ఇండియా కొత్త సీఈవోగా ఏప్రిల్‌ 1 లేదా అంతకన్నా ముందే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి : వరుస రెండో నెలలోనూ తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.