ETV Bharat / business

అమెరికా నుంచి 'లుపిన్' ఔషధం వెనక్కి

author img

By

Published : Jun 14, 2020, 11:14 AM IST

చక్కెర వ్యాధి ఔషధం మెట్​ఫామిన్​లో అధిక మోతాదులో ఎన్​డీఎంఏ మలినాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనితో ఫార్మా కంపెనీలు.. అమెరికా విపణి నుంచి ఆ ఔషధాన్ని స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో భారతీయ కంపెనీ లుపిన్ చేరింది.

'Lupine' withdraws Metformin drug from USA
అమెరికా నుంచి 'లుపిన్' ఔషధం వెనక్కి

ర్యానిటిడిన్‌ ఔషధం విషయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు మెట్‌ఫామిన్‌ మందు విషయంలోనూ అదే జరుగుతోంది. చక్కెర వ్యాధిని (మధుమేహం) అదుపు చేయటానికి వినియోగించే మెట్‌ఫామిన్‌ ఔషధంలో కేన్సర్‌కు దారితీసే ఎన్‌డీఎంఏ (నైట్రోసోడిమిథైలమైన్‌) అనే మలినాలు ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) కనుగొనటంతో.. ఫార్మా కంపెనీలు యూఎస్‌ విపణి నుంచి ఈ ఔషధాన్ని స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవటం మొదలు పెట్టాయి. తాజాగా ఈ జాబితాలో భారతీయ కంపెనీ అయిన లుపిన్‌ చేరింది. ఒక బ్యాచ్‌ ఔషధాన్ని తనంతట తాను వెనక్కి తీసుకుంటున్నట్లు లుపిన్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెల్లడించింది.

మెట్​ఫామిన్​లో మలినాలు

మధుమేహ వ్యాధిని అదుపు చేయటానికి ఎన్నో దశాబ్దాలుగా మెట్‌ఫామిన్‌ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. గత కొంతకాలంగా కొన్ని నూతన తరం ఔషధాలు వచ్చినప్పటికీ మెట్‌ఫామిన్‌ ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, ఈ ఔషధ వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు దీన్ని దేశీయ అవసరాలకు తయారు చేయటమే కాకుండా పెద్దఎత్తున అమెరికా, ఐరోపా, కొన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ఔషధంలో ఎన్‌డీఎంఏ మలినాలు ఉన్నట్లు, దీనిపై మరింత లోతైన పరిశోధనలు చేస్తున్నట్లు గత నెలలో యూఎస్‌ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఫార్మా కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ ఔషధాన్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ కంపెనీల్లో కొన్ని బహుళ జాతి ఫార్మా కంపెనీలు, భారతీయ కంపెనీలు ఉన్నాయి. యూఎస్‌ విపణిలో తాము విక్రయిస్తున్న మెట్‌ఫామిన్‌ ఔషధం వినియోగం వల్ల ఇబ్బందులు ఎదురైనట్లుగా ఎటువంటి నివేదికలు లేవని లుపిన్‌ ఈ సందర్భంగా పేర్కొంది. అయినప్పటికీ యూఎస్‌లోని టోకు, చిల్లర పంపిణీదార్లు, ఫార్మసీ విక్రయ కేంద్రాల నుంచి తన ఔషధాన్ని వెనక్కి తీసుకోవటానికి ఉపక్రమించింది. ఈ మేరకు పంపిణీదార్లకు లుపిన్‌ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సైడ్ ఎఫెక్ట్స్​

కొంతకాలం క్రితం ఇటువంటి సమస్య ర్యానిటిడిన్‌ ఔషధం విషయంలో ఎదురుకావటం తెలిసిందే. గ్యాస్ట్రిక్‌ అల్సర్లను అదుపు చేయటానికి వినియోగించే ర్యానిటిడిన్‌ మందులో మోతాదుకు మించి ఎన్‌డీఎంఏ ఉన్నట్లు, దీనివల్ల కేన్సర్‌ ముప్పు తలెత్తుతుందని అప్పట్లో యూఎస్‌ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ దాని తయారీ, విక్రయాలను నిషేధించలేదు. అయినప్పటికీ యూఎస్‌ఎఫ్‌డీఏ చేసిన హెచ్చరికతో చాలా కంపెనీలు మార్కెట్‌ నుంచి స్వచ్ఛందంగా ఈ ఔషధాన్ని వెనక్కి తీసుకున్నాయి. రోజూ తీసుకునే ఔషధంలో ఎన్‌డీఎంఏ మోతాదు 96 నానో గ్రాముల కంటే మించకపోతే ఇబ్బంది లేదని ఆ తర్వాత కొంతకాలానికి యూఎస్‌ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ పరిణామాలతో ర్యానిటిడిన్‌కి బదులు ఇతర ప్రత్యామ్నాయ ఔషధాల వైపు బాధితులు మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మెట్‌ఫామిన్‌ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

పరిశీలిస్తున్నాం..

యూఎస్‌ఎఫ్‌డీఏ చర్యలను మనదేశంలో ఔషధ నియంత్రణ బాధ్యతలను నిర్వర్తించే సంస్థ అయిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అధికార వర్గాలు పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఎటువంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేదు. మెట్‌ఫామిన్‌ ఔషధం వినియోగం వల్ల మనదేశంలో సమస్యలు ఎదురైనట్లు.. ఎక్కడా తమ దృష్టికి రాలేదని, అయినప్పటికీ పరిస్థితులను గమనిస్తున్నామని ఈ సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చూడండి: వాట్సాప్​ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.