ETV Bharat / business

ఎల్‌ఐసీ పాలసీదారులా..? ఐపీఓలో పాల్గొనాలంటే ఏం చేయాలి?

author img

By

Published : Feb 7, 2022, 5:13 AM IST

Updated : Feb 7, 2022, 7:47 AM IST

LIC IPO 2022: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్వరలో ఐపీఓకు రానున్న నేపథ్యంలో ఈ సంస్థ పాలసీదారులు కూడా ఇందులో పాల్గొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాలసీదారుల్లో కూడా ఈ ఐపీఓలో పాల్గొనాలన్న ఉత్సుకత నెలకొంది. మరి ఐపీఓలో పాల్గొనాలంటే ఏమేం కావాలి..?

LIC IPO 2022
ఎల్‌ఐసీ

LIC IPO 2022: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్వరలో ఐపీఓకు రానుంది. జీవిత బీమా రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన ఈ సంస్థ ఐపీఓలో పాలసీదారులు కూడా పాల్గొనే సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాలసీదారుల్లో కూడా ఈ ఐపీవోలో పాల్గొనాలన్న ఉత్సుకత నెలకొంది. మరి ఐపీఓలో పాల్గొనాలంటే ఏమేం కావాలి..?

పాన్‌ లింక్‌ చేశారా?

LIC IPO For Policyholders: ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనాలంటే ముందుగా మీ పాలసీ అకౌంట్‌తో పాన్‌ను లింక్‌ చేయాలి. ఎల్‌ఐసీ రికార్డుల్లో మీ పాన్‌ అప్‌డేట్‌ అయితేనే ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఇది వరకే ఎల్‌ఐసీ వెల్లడించింది. అందుకోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

  • తొలుత https://licindia.in/Home/Online-PAN-Registration లింక్‌ క్లిక్‌ చేసి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • అక్కడ మీ పాలసీ నంబర్‌, పుట్టిన తేదీ, పాన్‌ వివరాలు నమోదు చేయాలి.
  • క్యాప్చా కోడ్‌ క్లిక్‌ చేసిన తర్వాత సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.
  • తర్వాత మళ్లీ ఓ సారి ఎల్‌ఐసీ పాలసీకి, పాన్‌ లింక్‌ అయ్యిందో లేదో చెక్‌ చేసుకోవాలి.

డీమ్యాట్‌ ఖాతా ఉందా..?

LIC IPO in DEMAT: పాలసీతో పాన్‌ నంబర్‌ లింక్‌ చేసిన తర్వాత మీకు కావాల్సింది డీమ్యాట్‌ ఖాతా. ఇప్పటికే డీమ్యాట్‌ ఖాతా ఉంటే పర్లేదు.. లేదంటే కొత్తగా తెరవాల్సిందే. ఈక్విటీ మార్కెట్‌లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. వీటిని NSDL, CDSL నిర్వహిస్తుంటాయి. ఆధార్‌, పాన్‌, చిరునామా ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో డీమ్యాట్‌ ఖాతాను తెరవొచ్చు. అప్పుడే మీరు ఐపీవోలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.

మరిన్ని పెరగనున్న డీమ్యాట్‌ ఖాతాలు

స్టాక్‌ మార్కెట్‌లో కొన్నేళ్లుగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొవిడ్‌ వేళ ఈ సంఖ్య మరింత పెరిగింది. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓకు వస్తుండడంతో ఇది వరకే స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న వారితోపాటు సగటు పాలసీదారులు సైతం ఐపీఓకు సన్నద్ధమవుతున్నారు. 10 శాతం షేర్లు పాలసీదారులకు కేటాయిస్తామమని ప్రభుత్వం పేర్కొనడంతో వారు సైతం ఐపీఓలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ఉండగా.. ఎల్‌ఐసీ ఐపీఓ కారణంగా ఈ సంఖ్య భారీగానే పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: 5 ఏళ్లలో రూ. 1.17 లక్షల కోట్లు.. ఎయిర్​టెల్ మెగా ప్లాన్

Last Updated : Feb 7, 2022, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.