ETV Bharat / bharat

ఉక్రెయిన్‌లో నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్​ విద్యార్థులకు కేంద్రం ఊరట

author img

By

Published : Mar 4, 2022, 10:34 PM IST

Ukraine MBBS Students: ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువు కోసం వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు భారీ ఊరట కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్‌ఎంసీ నిబంధనలు సడలించడం లేదా భారత్‌, ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Ukraine MBBS Students
ఉక్రెయిన్

Ukraine MBBS Students: ఉక్రెయిన్‌లో కొనసాగుతోన్న భీకర పోరు భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వేలమంది మెడిసిన్‌ చదువుతోన్న విద్యార్థులు భారత్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, ప్రాణాలతో బయటపడి వచ్చినప్పటికీ అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా మెడిసిన్‌ చదువు మధ్యలో ఆగిపోతుందనే ఆందోళనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎన్‌ఎంసీ నిబంధనలు సడలించడం లేదా భారత్‌, ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) - 2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్‌ చదివే విద్యార్థులు కోర్సు, శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కూడా అక్కడే పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా వైద్యవిద్య ఎక్కడ అవుతుందో మిగతావీ అక్కడే పూర్తి చేయాలి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మెడిసిన్‌ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించవు.

Ukraine War: అయితే, ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ మెడిసిన్‌ చదువుతోన్న భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఎన్‌ఎంసీలో నిబంధనలు సడలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. లేదా భారత్‌లోని ప్రైవేటు కాలేజీల్లో కోర్సు పూర్తిచేయడం/విదేశాల్లోని కాలేజీలకు బదిలీ చేసుకునే వీలు కలిపించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖ, జాతీయ మెడికల్‌ కమిషన్‌ చర్చలు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశానికి సంబంధించి జాతీయ మెడికల్‌ కమిషన్‌, ఆరోగ్యశాఖ, విదేశాంగ శాఖతోపాటు నీతి ఆయోగ్‌ త్వరలోనే అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో కోర్సు పూర్తయ్యేందుకు వెసులుబాటు కల్పించే అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. మరో రెండేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. భారత్‌లోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతో పోలిస్తే ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సుకు అయ్యే ఖర్చు చాలా తక్కువే. అందుకే ప్రతిఏటా వేల మంది మెడిసిన్‌ ఔత్సాహికులు భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు తరలివెళ్తుంటారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్​ను వీడిన 20 వేల మంది భారతీయులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.