ETV Bharat / bharat

సర్వశ్రేష్ఠుడు సర్వేపల్లి... విద్యావేత్త.. దౌత్యవేత్త.. రాష్ట్రపతి!

author img

By

Published : Jul 10, 2022, 6:54 AM IST

విద్యావేత్త.. దౌత్యవేత్త.. ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతిగా విశిష్ఠ సేవలందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. అనేక దేశాల నాయకులతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. నాటి సోవియట్‌ యూనియన్‌లో భారత రాయబారిగా ఉభయ దేశాల మధ్య స్నేహానికి బలమైన పునాదులు వేశారు.

sarvepalli radhakrishnan
sarvepalli radhakrishnan

భారత రాష్ట్రపతుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ది అ'ద్వితీయ' స్థానం. శిఖర సమానుడైన విద్యావేత్తగా ఖ్యాతినార్జించిన ఆయన గొప్ప దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, దేశాధ్యక్షుడిగా విశిష్ట ముద్ర వేశారు. అధ్యాపకుడిగా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం, బెనారస్‌ యూనివర్సిటీలకు ఉప కులపతిగా ఎదిగి ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన పలు విద్యాసంస్థల ప్రగతికి పునాదులు వేశారు. దౌత్యవేత్తగానూ ఆయనది చెరగని ముద్ర. నాటి సోవియట్‌ యూనియన్‌లో భారత రాయబారిగా ఉభయ దేశాల మధ్య స్నేహానికి బలమైన పునాదులు వేశారు. నాటి సోవియట్‌ అధినేత స్టాలిన్‌తో సర్వేపల్లికి అధికారికంగానే కాకుండా వ్యక్తిగతంగానూ సాన్నిహిత్యం ఉంది. ఆయనతో ముఖాముఖి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

భారత తొలి ఉపరాష్ట్రపతిగా చరిత్రకెక్కిన ఆయన వరుసగా రెండుసార్లు ఈ ఉన్నత పదవిని సమర్థంగా నిర్వహించారు. బాబూ రాజేంద్రప్రసాద్‌ తర్వాత 1962 మేలో రాధాకృష్ణన్‌ దేశ రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో నెహ్రూ ప్రధాని. ఆయన రాజకీయాలను ఔపోసన పట్టిన నాయకుడు. రాధాకృష్ణన్‌ అందుకు పూర్తిగా భిన్నం. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏనాడూ లేరు. దీంతో నెహ్రూ వంటి దిగ్గజ నాయకుడితో రాధాకృష్ణన్‌ ఎలా నెగ్గుకొస్తారనే విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఉండేది. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే 1962 అక్టోబరులో భారత్‌ - చైనా యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భారత్‌ ఓటమిపాలైంది. దీనిపై రాధాకృష్ణన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమన్నది ఆయన భావన. ఈ విషయాన్ని నేరుగా నెహ్రూతో ప్రస్తావించారు. ఓటమి జాతికి అవమానకరమని ఆవేదన చెందారు. బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. సర్వేపల్లి ప్రతిస్పందన ఇంత ఘాటుగా ఉంటుందని నెహ్రూ ఊహించలేదు. గత్యంతరం లేక అయిష్టంగానే అప్పటి రక్షణమంత్రి వి.కె.కృష్ణమీనన్‌ చేత రాజీనామా చేయించారు. అయితే యుద్ధంలో ఓటమి తనను బాధకు గురి చేసిందని అందుకే ప్రథమ పౌరుడిగా తాను ప్రతిస్పందించాల్సి వచ్చింది తప్ప ప్రభుత్వంపైనా, రక్షణమంత్రిపైనా తనకు ఎటువంటి దురుద్దేశం లేదని సర్వేపల్లి అనంతర కాలంలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బ్రిటిష్‌ జగన్నాటకం.. పూరీ జగన్నాథ ఆలయంపైన ఆధిపత్యానికి విఫలయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.