ETV Bharat / bharat

అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు.. రాజ్​పథ్ త్రివర్ణశోభితం

author img

By

Published : Jan 26, 2022, 10:47 AM IST

Updated : Jan 26, 2022, 2:17 PM IST

Republic day 2022: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్​పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. శకటాల ప్రదర్శన, యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
త్రివర్ణ పతాకం ఎగురవేసిన రాష్ట్రపతి

Republic day 2022: భారత 73వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం సందర్శనతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, త్రివిధ దళాల అధిపతులతో కలిసి జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం అక్కడ నుంచి రాజ్‌పథ్ చేరుకున్న ప్రధాని... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికారు. సాయుధ దళాల గన్‌ సెల్యూట్‌ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది.

REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న అశ్వికదళం
REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు ప్రధాని మోదీ స్వాగతం

President gallantry medal 2022

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్ముకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు మరణానంతరం అశోకచక్ర పురస్కారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బాబురామ్‌ కుటుంబం పురస్కారాన్ని అందుకుంది.

REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
బాబురామ్ కుటుంబ సభ్యులకు అశోక చక్ర అందజేత

Republic day parade 2022

అనంతరం పరేడ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్ర నేతృత్వంలో కవాతు ప్రారంభమైంది. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, డీఆర్​డీఓ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. సైన్యం తరఫున అశ్విక దళం,14 మెకనైజ్డ్‌ విభాగాలు, 6 మార్చింగ్‌ కంటింజెంట్లు కవాతులో పాల్గొన్నాయి.

ధ్రువ్‌ హెలికాప్టర్లు, 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పీటీ-76, సెంచూరియన్‌ ట్యాంకులు, 75/24 ప్యాక్ హోవిట్జర్, ఎంబీటీ అర్జున్ ఎంకే ట్యాంకులు, ఓటీ-62 శతఘ్నులతోపాటు.. పలు ఆయుధ వ్యవస్థలు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది.

REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
ఆకాశంలో హెలికాప్టర్ల చక్కర్లు

republic day tableaux 2022

రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలెట్ శివాంగి సింగ్ భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఈసారి నౌకాదళ శకటంపై 1946 నాటి నేవీ తిరుగుబాటు అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. నాడు బ్రిటిష్‌ సర్కారుపై తిరగబడ్డ భారతీయ నావికులు స్వాతంత్ర్య ఉద్యమానికి దోహదపడ్డారు.

REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
సైన్యం గౌరవ వందనం
REPUBLIC DAY PRESIDENT FLAG HOISTING
యుద్ధట్యాంకుల ప్రదర్శన
REPUBLIC DAY
బీఎస్ఎఫ్ మహిళల మోటార్ సైకిల్ టీమ్ విన్యాసాలు

12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలు కవాతులో పాల్గొన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, జమ్ము కశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల శకటాలకు కవాతులో చోటు దక్కింది. విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా తొమ్మిది శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.

REPUBLIC DAY
ఉత్తర్​ప్రదేశ్ శకటం

Azadi ka amrit Republic day 2022

గణతంత్ర దినోత్సవ కవాతులో ఈసారి కొత్తగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు చేసింది. రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వర్‌, ఎంఐ-17, సారంగ్‌, అపాచీ, డకోటా వంటి యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. గగనతలంలో మొత్తం 15 ఆకృతులను ప్రదర్శించారు.

REPUBLIC DAY
రాష్ట్రపతి భవన్ మీదుగా యుద్ధవిమానాలు

75 మీటర్ల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉన్న పది స్క్రోల్స్‌లను తొలిసారిగా పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిని సుమారు 600 మంది ఆర్టిస్టులు తీర్చిదిద్దారు. వందే భారతం పేరిట దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించి ఎంపిక చేసిన 480 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.

Republic day 2022 news

రిపబ్లిక్‌ డే వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పరేడ్‌ను తిలకించేందుకు వీలుగా రాజ్‌పథ్ వద్ద పది ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను 5 వేలకు కుదించారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పెద్దలు, ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న 15 ఏళ్లు పైబడిన పిల్లలను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించారు.

Republic day 2022 chief guests

కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. ఇప్పటి వరకు రిపబ్లిక్‌ డే పెరేడ్‌ చూసే అవకాశం రాని ఆటోరిక్షా డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, కరోనాపై పోరులో ముందుండి పోరాడిన ఆరోగ్య కార్యకర్తలను ప్రత్యేకంగా పరేడ్‌కు ఆహ్వానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: రాచరికపు సంకెళ్లు తెంచుకొని.. భారతావని ఉదయించిన వేళ..

Last Updated : Jan 26, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.