ETV Bharat / bharat

రాహుల్​పై కొనసాగిన ఈడీ ప్రశ్నల వర్షం.. మళ్లీ రావాలంటూ సమన్లు

author img

By

Published : Jun 16, 2022, 4:37 AM IST

Updated : Jun 16, 2022, 6:38 AM IST

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై మూడోరోజు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ఏజేఎల్ ఆస్తులు, యంగ్​ ఇండియన్ కార్యకలాపాలపై ఈడీ ఆరా తీసింది. శుక్రవారం మళ్లీ రావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిత్తక చోటుచేసుకుంది.

RahulRahul Gandhi at ED for 3rd Day
RahulRahul Gandhi at ED for 3rd Day

Rahul ED: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు దేశ రాజధాని దిల్లీలో వరుసగా మూడో రోజూ సెగలు పుట్టించింది! ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం 8 గంటలకు పైగా ప్రశ్నించారు. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఆస్తులు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఆయన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రూపంలోనూ భద్రపర్చారు. మళ్లీ శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు- రాహుల్‌పై విచారణ నేపథ్యంలో హస్తం పార్టీ హస్తినలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని.. నాయకులు, కార్యకర్తలను చితకబాదారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు డిమాండ్‌ చేసింది. వారి చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా గురువారం రాజ్‌భవన్‌లను ఘెరావ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఆ పార్టీ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.

.

మీ పాత్ర ఏంటి? : ఈడీ వర్గాల సమాచారం ప్రకారం.. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కార్యకలాపాలు, దాని యాజమాన్య సంస్థగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ కంపెనీ ఏర్పాటు, ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రుణం తదితర అంశాలకు సంబంధించి వరుసగా మూడో రోజూ అధికారులు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా వ్యవహారాల్లో ఆయన వ్యక్తిగత పాత్ర గురించి అడిగారు. ఏజేఎల్‌కు ఉన్న దాదాపు రూ.800 కోట్ల ఆస్తుల గురించి ప్రశ్నలు సంధించారు. లాభాపేక్ష లేని కంపెనీ అయిన యంగ్‌ ఇండియన్‌ భూములు, భవనాలను అద్దెకివ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలను ఎలా చేపడుతోందనీ ఆరా తీశారు. కోల్‌కతాలోని ఓ కంపెనీ నుంచి 2011 ఫిబ్రవరిలో యంగ్‌ ఇండియన్‌ తీసుకున్న రూ.కోటి రుణం గురించి అడిగారు. రాహుల్‌ వాంగ్మూలాలను వీడియో, ఆడియో రికార్డింగ్‌ రూపంలో భద్రపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎ4 సైజు పేపర్లపైనా టైప్‌ చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత ప్రతులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే రాహుల్‌ వాటిపై సంతకం చేసి దర్యాప్తు అధికారికి అందజేస్తున్నారని వివరించారు. మరోవైపు- కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌లకు ఈడీ సమన్లు పంపిన నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని కాంగ్రెస్‌ పేర్కొంది. దానిపై ఈడీ అధికారులు స్పందిస్తూ.. ఈ కేసులో ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న సంగతిని గుర్తుచేశారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌-120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్‌-420 (మోసం)లను అందులో ప్రయోగించారని తెలిపారు. తీవ్రమైన నేరాల విషయంలోనే వాటి కింద కేసు నమోదు చేస్తారని, అందుకే తాము పీఎంఎల్‌ఏ కేసు నమోదుచేశామని వివరించారు. యంగ్‌ ఇండియన్‌ లాభాపేక్ష లేని కంపెనీ అని, అందులో ఎవరికీ వ్యక్తిగత నిధులు/వాటాలు ఉండవని గతంలో రాహుల్‌ చెప్పిన సంగతిని గుర్తుచేశారు.

అట్టుడికిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం : రాహుల్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిరసనల సందర్భంగా దిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతలు తలెత్తాయి. కొంతమంది పోలీసులు బలవంతంగా తమ కార్యాలయంలోకి ప్రవేశించారని.. లాఠీఛార్జి చేసి పార్టీ నేతలు, కార్యకర్తలను చితకబాదారని కాంగ్రెస్‌ ఆరోపించింది. మహిళా కార్యకర్తలతోనూ దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడింది. అక్రమంగా లోపలికి చొచ్చుకొచ్చిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. వారిని సస్పెండ్‌ చేయాలని, ఇతర క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాలని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం, దిల్లీ పోలీసుల రౌడీయిజం పరాకాష్ఠకు చేరుకుందని వ్యాఖ్యానించారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న తమను అదుపులోకి తీసుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ''మోదీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారులను మేం ఊరికే వదిలిపెట్టబోం. ఇప్పుడు చేస్తున్నవన్నీ గుర్తుంచుకుంటాం. వారిపై తగిన చర్యలు చేపడతాం'' అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు- ఈడీ కార్యాలయం పరిసరాల్లో నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా నిరసనలకు దిగిన వందల మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాణికం ఠాగూర్‌, అమర్‌ సింగ్‌, జయకుమార్‌ విజయ్‌ వసంత్‌, ఎ.చెల్ల కుమార్‌ తదితర కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటు సముదాయంలో నిరసన చేపట్టారు.

అవన్నీ ఆరోపణలే: దిల్లీ పోలీసులు : కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోకి కొంతమంది పోలీసు సిబ్బంది ప్రవేశించారంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ''నిషేధాజ్ఞల నేపథ్యంలో నిరసన ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలనుకున్నాం. ఏఐసీసీ కార్యాలయం గేటు మూసేసేందుకు మేం ప్రయత్నించాం. ఆ ప్రక్రియలో కొంత ఘర్షణ చోటుచేసుకున్న మాట వాస్తవం. అంతేగానీ ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు మేం ప్రయత్నించలేదు'' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కేంద్రానికి కాంగ్రెస్‌ తాఖీదులు : రాహుల్‌పై ఈడీ విచారణకు సంబంధించి కేంద్ర సర్కారుకు కాంగ్రెస్‌ లీగల్‌ నోటీసులు పంపింది. విచారణ సమయంలో తమ నేత పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారంటూ, న్యాయవాదులు చెప్పిందే ఆయన వల్లె వేస్తున్నారంటూ వార్తాసంస్థలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని అందులో పేర్కొంది. మీడియాకు ఇలాంటి అనుచిత లీకులు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు సంబంధిత తాఖీదులు పంపింది.

దౌర్జన్యపూరితంగా స్వేచ్ఛను హరించారు- చిదంబరం: ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల చర్యను కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా తప్పుపట్టారు. అత్యంత దౌర్జన్యపూరిత రీతిలో పోలీసులు అక్కడ స్వేచ్ఛను హరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''పోలీసుల వద్ద సోదాల వారెంటుగానీ, అరెస్టు వారెంటుగానీ లేవు. అయినా కార్యాలయంలోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను బయటకు లాగి రోడ్డు మీద పడేశారు. అధీర్‌ రంజన్‌ చౌధరీ సహా పలువురు నేతలతో దురుసుగా ప్రవర్తించడం వీడియోల్లో నిక్షిప్తమైంది. ప్రజాస్వామ్యంలోని చట్టపరమైన, రాజకీయపరమైన ప్రమాణాలన్నింటినీ పోలీసులు ఉల్లంఘించారు. వారి చర్యను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం'' అని ట్విట్టర్​లో చిదంబరం పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పతనానికి నిదర్శనం- భాజపా: అవినీతి కేసులో విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ హింసాత్మక నిరసనలు చేపడుతోందంటూ భాజపా విమర్శలు గుప్పించింది. ఇది ఆ పార్టీ పతనావస్థకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ''రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. అయినప్పటికీ ఆయన్ను ఈడీ విచారిస్తుంటే కాంగ్రెస్‌ నిరసనలు చేపడుతోంది. బల ప్రదర్శనలకు దిగుతోంది. కాంగ్రెస్‌ పూర్తిగా కుటుంబ పార్టీగా మారిందని చెప్పేందుకు ఇదే తార్కాణం'' అని సుధాన్షు వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు 30 గంటల పాటు.. : సమన్ల నేపథ్యంలో రాహుల్‌ మధ్య దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాతో కలిసి బుధవారం ఉదయం 11:35 గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు ఆయన్ను ప్రశ్నించడం ప్రారంభించారు. దాదాపు మూడు గంటలకు భోజన విరామం ఇచ్చారు. అప్పుడు తన నివాసానికి వెళ్లిన రాహుల్‌.. మధ్యాహ్నం 4 గంటలకు తిరిగి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆపై రాత్రి 9:30 గంటలకు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. మూడు రోజుల్లో కలిపి మొత్తంగా ఇప్పటివరకు రాహుల్‌ను ఈడీ దాదాపు 30 గంటలపాటు ప్రశ్నించింది. విచారణ, వాంగ్మూలం నమోదు పూర్తి కాకపోవడంతో గురువారం మళ్లీ రావాలని అధికారులు ఆయన్ను ఆదేశించారు. అయితే ఒక్కరోజు మినహాయింపు ఇవ్వాలని రాహుల్‌ కోరడంతో అందుకు సమ్మతించారు. అనంతరం శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు.

ఇదీ చదవండి: అగ్నివీరులకు ప్రత్యేక డిగ్రీ కోర్స్.. నైపుణ్యానికి 50% క్రెడిట్స్​

Last Updated : Jun 16, 2022, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.