ETV Bharat / bharat

ఆ కేసులో.. రాహుల్​ గాంధీకి మరోసారి ఈడీ సమన్లు

author img

By

Published : Jun 3, 2022, 12:44 PM IST

Updated : Jun 3, 2022, 1:57 PM IST

Rahul Gandhi National Herald Case: నేషనల్​ హెరాల్డ్​ కేసులో విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి మరోసారి సమన్లు జారీ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. జూన్​ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట విచారణకు రావాలని స్పష్టం చేసింది.

National Herald case: Enforcement Directorate issues fresh summons to Rahul Gandhi
National Herald case: Enforcement Directorate issues fresh summons to Rahul Gandhi

Rahul Gandhi National Herald Case: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్​ హెరాల్డ్​కు సంబంధించిన మనీలాండరింగ్​ కేసు విచారణకు జూన్​ 13న తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. అసలు గాంధీ జూన్​ 2నే ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం భారత్​లో లేనందున విచారణకు అందుబాటులో ఉండబోనని ఈడీకి సమాచారం అందించారు రాహుల్​. షెడ్యూల్​ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకు సమ్మతించిన ఈడీ.. జూన్​ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు రావాలని మళ్లీ సమన్లు పంపింది.

ఇదే కేసుకు సంబంధించి రాహుల్​ తల్లి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఆమెను జూన్​ 8న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. కాగా.. సోనియా గురువారం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్న ఆమె.. నిర్దేశించిన గడువులోనే విచారణకు హాజరవుతానని వెల్లడించారు.
కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా శుక్రవారం కరోనా బారినపడ్డారు. తల్లికి సోకిన మరుసటి రోజే ప్రియాంకకు కూడా కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్వారంటైన్​లో ఉన్నట్లు స్వయంగా ఆమె ట్వీట్​ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితులు జాగ్రత్తలు పాటించాలని ప్రియాంక కోరారు.

నేషనల్​ హెరాల్డ్​ కేసు ఇదే: కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

ఇవీ చూడండి: సోనియా, రాహుల్​కు ఈడీ సమన్లు.. కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం

సోనియా గాంధీకి కరోనా.. అయినా ఈడీ విచారణకు హాజరు!

Last Updated : Jun 3, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.